Friday, May 10, 2024

మేడిగడ్డ రిపేర్ల బాధ్యత ఎవరిది?

తప్పక చదవండి
  • ఎల్‌ అండ్‌ సంస్థ ప్రకటనతో బయటపడ్డ డొల్ల
  • ఆనాడు ప్రభుత్వ పెద్దలు చేసిన ప్రకటనలకు బాధ్యులు ఎవరు?

హైదరాబాద్‌ : మేడిగడ్డ రిపేర్‌ బాధ్యత తమది కాదని, తమ ఒప్పందం తీరిందని ఇటీవల ఎల్‌ అండ్‌ టీ సంస్థ చేసిన ప్రకటనతో ..కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీపై గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చెప్పిందంతా అబద్ధమని తేలింది. ఎన్నికల ముందు దీనిపై తీవ్ర దుమారం రేగింది. అయితే అక్డ పగుళ్లేవీ లేవని కెటిఆర్‌ విమర్శలు గుప్పించారు. రాహుల, నేటి సిఎం రేవంత్‌ అక్కడకు వెళ్లడాన్ని ఎద్దేవా చేశారు. అలాగే కుంగిన మేడిగడ్డ బ్యారేజీ రిపేర్ల భారం నయా పైసా ప్రభుత్వంపై పడదని అప్పట్లో బీఆర్‌ఎస్‌ నేతలు, మంత్రులు ప్రకటించిందంతా బూటకమేనని స్పష్టమైంది. మేడిగడ్డ కుంగడంతో ఆ ప్రభావం ఎన్నికల్లో తమ పార్టీపై పడకుండా బ్యారేజీ నిర్మించిన ఎల్‌అండ్‌టీ సంస్థనే రిపేర్లు చేసి ఇస్తుందని ప్రజలను నమ్మించేందుకు బీఆర్‌ఎస్‌ ప్రయత్నం చేసిందని.. అధికారులు, ఇంజినీర్లతో నోటికి వచ్చినట్టు అబద్ధాలు చెప్పించిందని స్పష్టమైంది. బ్యారేజీలోని ఏడో బ్లాక్‌లో కుంగిన పిల్లర్ల రిపేర్లను నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీనే చేస్తుందని అప్పటి ప్రభుత్వ పెద్దలు చెప్పగా, రిపేర్లతో తమకేమీ సంబంధం లేదని ఎల్‌అండ్‌ టీ కుండబద్దలు కొట్టింది. చేపట్టాల్సిన రిపేర్లకు డబ్బులు ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పింది. బీఆర్‌ఎస్‌ పెద్దలు చెప్పినట్టుగా డిఫెక్ట్‌ లయబిలిటీ పీరియడ్‌ ?ఐదేండ్లు కాదని రెండేండ్లేనని.. ఆ గడువు కూడా ఈ ఏడాది ఫిబ్రవరితోనే ముగిసిందనే నిజాన్ని ఎల్‌అండ్‌ టీ బయటపెట్టింది. బ్యారేజీ పునరుద్ధరణ పనులు చేయడానికి ఖర్చయ్యే మొత్తాన్ని ప్రభుత్వమే భరించాలని, ఇందుకోసం తమ సంస్థతో మళ్లీ అగ్రిమెంట్‌ చేసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. దీంతో మేడిగడ్డ రిపేర్ల భారం ప్రజలపైనే పడనుంది. ఎన్నికల్లో గెలుపు కోసమే అప్పటి కేసీఆర్‌ సర్కార్‌ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు నిజాలు దాచిందనే విషయాలు ఎల్‌అండ్‌ టీ లేఖతో బయటపడిరది. ఈ ఏడాది అక్టోబర్‌ 21న మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్‌ లోని పిల్లర్లు కుంగాయి. దీని వెనుక ఏదైనా కుట్ర ఉండొచ్చని మొదట ప్రాజెక్టు ఇంజినీర్లు పోలీసులకు కంప్లయింట్‌ చేయగా, సాంకేతిక కారణాలతోనే బ్యారేజీ కుంగినట్టుగా తేలింది. నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ చైర్మన్‌ ?ఆధ్వర్యంలోని ఎక్స్‌పర్ట్‌ టీమ్‌ బ్యారేజీని పరిశీలించి డిజైన్ల లోపం, నిబంధనల మేరకు నిర్మాణం చేపట్టకపోవడంతోనే కుంగినట్టుగా ప్రాథమికంగా అంచనాకు వచ్చింది.అయితే ఎన్డీఎస్‌ఏ రిపోర్టును అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కార్నర్‌ చేస్తూ కేంద్రానికి లేఖ రాసింది.ఈ క్రమంలోనే ఈ నెల రెండో తేదీన ఎల్‌అండ్‌ టీ సంస్థ రామగుండం ఈఎన్సీకి లేఖ రాసింది. మేడిగడ్డ బ్యారేజీ రిపేర్లతో తమకు సంబంధం లేదని అందులో స్పష్టం చేసింది. పలు ఆసక్తికర విషయాలను లేఖలో బయటపెట్టింది. ‘మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం 2018, ఆగస్టు 25 వరకు పూర్తి చేసేలా అగ్రిమెంట్‌ చేసుకున్నాం. వివిధ కారణాలతో 2020, జూన్‌ 29 నాటికి నిర్మాణం పూర్తి చేశాం. 2021, మార్చి 15వ తేదీతో బ్యారేజీ పనులు పూర్తయినట్టుగా సంబంధిత ఎస్‌ఈ మాకు ధ్రువీకరణ పత్రం ఇచ్చారు. అగ్రిమెంట్‌ ప్రకారం సివిల్‌ పనులకు ఏదైనా నష్టం జరిగితే బ్యారేజీ అప్పగించిన 24 నెలల వరకు మేం బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపింది. అక్టోబర్‌ 21న మేడిగడ్డ బ్యారేజీ కుంగగా 22న ప్రాజెక్టు ఇంజినీర్లతో పాటు ఎల్‌అండ్‌టీ సంస్థ ప్రతినిధులు కుంగిన బ్యారేజీని పరిశీలించారు. సమస్యకు కారణాలేమిటో పరిశీలిస్తామని, అవసరమైన పరిష్కారం చూపించే ప్రయత్నం చేస్తామని పేర్కొన్నారు. బ్యారేజీ.. నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌ టీ ఆధీనంలో ఉంది కాబట్టి పునరుద్ధరణ పనుల పూర్తి బాధ్యత ఆ సంస్థనే తీసుకుంటుందని మేడిగడ్డ ఈఈ తిరుపతిరావు వెల్లడిరచారు. ఈ క్రమంలో నవంబర్‌ 4న మేడిగడ్డ బ్యారేజీలోని ఏడో బ్లాక్‌ ను తామే పునరుద్ధరిస్తామని చెప్తూ ఎల్‌అండ్‌ టీ సంస్థ పేరుతో ఒక ప్రకటన మీడియాకు రిలీజ్‌ చేశారు. ఇప్పుడా ప్రకటన అసలు ఎల్‌అండ్‌ టీ సంస్థనే ఇచ్చిందా..లేక అప్పటి ప్రభుత్వమే ఎల్‌అండ్‌ టీ పేరుతో ప్రచారంలోకి తెచ్చిందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు