- సి.ఎం.ఆర్ బియ్యం ఎగవేత మిల్లర్లపై ప్రభుత్వం సీరియస్..
- సూర్యాపేట జిల్లా మిల్లర్స్ అధ్యక్షుడిపై నాన్ బెయిలబుల్ కేసులు
- సన్మానించిన అధికారులే.. సంకెళ్లు వేసేందుకు సిద్ధమయ్యారు..!
- కోట్లాది రూపాయల బియ్యం ఎగవేతలో అధికారుల పాత్ర లేదా.?
- మిగిలిన 60 మంది మిల్లర్లంతా పవిత్రులేనా..?
సి.ఎం.ఆర్ (కష్టమ్ మిల్డ్ రైస్) బియ్యం సేకరణ విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్ గా వర్కఅవుట్ చేస్తోంది. పెండింగ్ మిల్లర్ల ముక్కు పిండి బియ్యం వసూలు చేయాల్సిందేనని రాష్ట్ర సివిల్ సప్లయ్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్ని జిల్లాల అధికారులకు అల్టిమేటం జారీ చేశారు. డీఫాల్ట్ మిల్లర్ల తరఫున ఫైరవీలు చేసేందుకు ఇతర శాఖల మంత్రులు, అధికార పార్టీ నాయకులు సైతం ససేమిరా అంటున్నారు. గత ప్రభుత్వంలో మిల్లర్లు అంటే కొంతమంది నాయకులకు ఎంతో ప్రీతి. అందులో డిఫాల్ట్ మిల్లర్స్ అంటే మరింత అభిమానంగా ఉండే వారని ఒక విమర్శ ఉంది. ప్రస్తుతం మిల్లర్లు అంటేనే నాయకులు దూరం జరుగుతున్నారు.
గత ప్రభుత్వ హయాంలో రైస్ మిల్లర్లు సి.ఎం.ఆర్ బియ్యం ప్రభుత్వానికి తిరిగి ఇచ్చే బదులు కొంత మొత్తాన్ని బ్లాక్ మార్కెట్ చేసి ఇతర రాష్ట్రాల్లో అధిక ధరలకు విక్రయిస్తూ, కోట్లకు పడగలెత్తారు. గతంలో సి.ఎం.ఆర్ విధానం రైస్ మిల్లర్లకు ఒక వరంగా మారింది. ఇదే సమయంలో సివిల్ సప్లయ్ శాఖలో పనిచేస్తున్న అనేకమంది అధికారులు ఇదే అదునుగా భావించి, “దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకున్నారు”. గతంలో సూర్యాపేట జిల్లాలో పనిచేసి వెళ్లిన ఓ సివిల్ సప్లయ్ అధికారి దరిదాపుగా 100 కోట్లు పోగేసుకున్నట్లు రాష్ట్ర శాఖలోనే తీవ్రమైన చర్చ కొనసాగింది. ప్రస్తుత ప్రభుత్వంలో పాలకుల వైఖరి భిన్నంగా మారింది. అధికారులు సైతం మిల్లర్ల పట్ల కఠినంగా వ్యవహరించక తప్పని పరిస్థితికి వచ్చింది. సి.ఎం.ఆర్ బియ్యం ఇవ్వని రైస్ మిల్లర్లపై కొరడా ఝులిపించేందుకు రంగం సిద్ధమైంది. ఇందులో భాగంగానే సూర్యాపేట జిల్లా సివిల్ సప్లయ్ శాఖ అధికారులు రైస్ మిల్లర్లపై కేసులు పెట్టడంలో వెనుకాడటం లేదు.
సూర్యాపేట జిల్లా మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షునిపై నాన్ బెయిలబుల్ కేసులు..
సూర్యాపేట జిల్లా సివిల్ సప్లయ్ శాఖకు ఇద్దరు నూతన అధికారులు బదిలీపై వచ్చారు. సి.ఎం.ఆర్ బియ్యం సేకరణలో ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను ఇరువురు అధికారులు కఠినంగానే అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లా కలెక్టర్ వెంకట్ రావు ఆదేశాలతో సి.ఎం.ఆర్ ఎగవేత దారులపై వరుసగా నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఏప్రిల్ 16న మొట్టమొదటిగా జిల్లా రైస్ మిల్లర్స్ అధ్యక్షుడి మిల్లులపైనే అధికారులు దాడులు మొదలుపెట్టారు. దీంతో జిల్లాలో ఉన్న మిల్లర్లు ఒక్కసారిగా అలజడికి గురైనట్లు తెలుస్తోంది. ఏకంగా జిల్లా అధ్యక్షుడిపైనే తమ అస్త్రం ప్రయోగిస్తే, మిల్లర్లంతా దారికి వస్తారని అధికారులు భావించినట్లు సమాచారం. 2022-23 రబీ, 2023- 24 ఖరీఫ్ సీజన్లు కలుపుకొని మొత్తం ధాన్యం 47,548.12 మెట్రిక్ టన్నులు మిల్లర్స్ అధ్యక్షుడైన ఇమ్మడి సోమ నర్సయ్యకు చెందిన సంతోష్ రైస్ ఇండస్ట్రీకి అప్పగిస్తే, అక్కడ కేవలం 5,663 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే ఉందని, 41 వేల 884.76 మెట్రిక్ టన్నుల ధాన్యానికి లెక్కలు చూపించలేదని, ఇదంతా బ్లాక్ మార్కెట్ కు తరలించారని అధికారుల అధికారిక పంచనామా. సంబంధిత సి.ఎం.ఆర్ విలువ రూ.91 కోట్లు ఉంటుందని సూర్యాపేట జిల్లా సివిల్ సప్లయ్ అధికారి వి.మోహన్ బాబు తిరుమలగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు సంతోష్ రైస్ మిల్లు మేనేజింగ్ పార్టనర్లు అయిన ఇమ్మడి అంజయ్య, ఇమ్మడి సోమనర్సయ్య, ఇమ్మడి సోమయ్యలపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు.(సంబంధిత ఎఫ్.ఐ.ఆర్. నెం.76/2024) నిందితులపై ఐపీసి109,120బి,406,409,420 సెక్షన్లు నమోదు అయినట్లుగా తెలుస్తోంది.
ఇది ఇలా ఉండగా ఏప్రిల్ 18న జిల్లా సివిల్ సప్లయ్ మేనేజర్ పి.రాములు ఆధ్వర్యంలో ఇమ్మడి సోమనర్సయ్య మేనేజింగ్ పార్టనర్ వ్యవహరిస్తున్న రఘురామ రైస్ ఇండస్ట్రీస్ అనే మిల్లులో అధికారులు తనిఖీలు నిర్వహించారు. 2022-23 రబీలో 27,998.280 మెట్రిక్ టన్నుల ధాన్యం కేటాయించగా, సదరు మిల్లులో ధాన్యం నిలువ లేదని, 2023-24 ఖరీఫ్ సీజన్ లో 17,179.981 మెట్రిక్ టన్నులు ఈ మిల్లుకు కేటాయించగా అక్కడ కేవలం 8,598.680 టన్నుల దాన్యం మాత్రమే ఉందని, కనిపించకుండా పోయిన ప్రభుత్వ ధాన్యం విలువ సుమారు 77 కోట్ల 10 లక్షల 78 వేల 639 రూపాయల విలువ ఉంటుందని సివిల్ సప్లయ్ మేనేజర్ పి.రాములు స్థానిక నాగారం మండల పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరుమలగిరి పోలీసుల మాదిరిగానే అవే సెక్షన్లు ఇక్కడ కూడ నమోదు చేశారు (సంబంధిత ఎఫ్.ఐ.ఆర్. నెం. 67/2024).
కోదాడ రైస్ మిల్లర్ పై కూడా సేమ్ టు సేమ్ కేసు నమోదు..
కోదాడ రూరల్ ప్రాంతమైన కొమరబండ గ్రామంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర రైస్ ఇండస్ట్రీలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. 2022-23 ఖరీఫ్ లో 23,325.840 మెట్రిక్ టన్నుల ధాన్యం కేటాయించగా, 2022-23 రబీ సీజన్ లో 15,535.520 మెట్రిక్ టన్నులు కాగా, 2023-24 ఖరీఫ్ లో 4,102.640 మెట్రిక్ టన్నుల ధాన్యం ఈ మిల్లుకు కేటాయించారు. ఏప్రిల్ 16వ తేదీన ఈ మిల్లులో అధికారులు తనిఖీ చేశారు. ఈ మిల్లు నుండి బ్లాక్ మార్కెట్ కు తరలిపోయిన ప్రభుత్వ ధాన్యం విలువ రూ.64 కోట్ల 9 లక్షల 39 వేల 79 రూపాయల ఖరీదు ఉంటుందని జిల్లా సివిల్ సప్లయ్ మేనేజర్ పి రాములు, కోదాడ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికారుల ఫిర్యాదు మేరకు శ్రీ వెంకటేశ్వర రైస్ మిల్లు యజమాని అయిన నీల సత్యనారాయణతో పాటు ఇతరులపై ఐ.పి.సి 420,406,409,34, లాంటి నాన్ బెయిలబుల్ కేసులు పోలీసులు నమోదు చేశారు (సంబంధిత ఎఫ్.ఐ.ఆర్ నెంబర్ 97/2024)
సన్మానించిన అధికారులే సంకెళ్లు వేసేందుకు సిద్ధమయ్యారు.!
డిఫాల్ట్ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయింపులు లేకుండా అధికారులు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఒక సమాచారం. గత కొన్ని నెలల క్రితం ఇదే మిల్లర్లను సన్మానించిన జిల్లా అధికారులు ప్రస్తుతం ప్రభుత్వం మారడంతో ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నారు. గత ప్రభుత్వంలో ఉన్న పాలకులు సి.ఎం.ఆర్ పాలసీని నిర్వీర్యం చేశారు. గతంలో డిఫాల్ట్ మిల్లర్లకే ఇక్కడ పెద్దపీట వేశారు. ప్రస్తుతం పరిస్థితి తలకిందులైంది. డిఫాల్ట్ మిల్లర్లకు ధాన్యం కేటాయించకుండా, ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకుంటోంది. బియ్యం ఎగవేత దారులకు కర్రు కాల్చి వాతలు పెడుతోంది. ఇదే జిల్లాలో ఒకప్పుడు తమను సన్మానించిన జిల్లా అధికారులే ఇప్పుడు మాపై క్రిమినల్ కేసులు పెడుతున్నారని మిల్లర్లంతా ఒకింత కలవరానికి గురవుతున్నారు. తిరుమలగిరి విషయానికి వస్తే, జిల్లా మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడైన ఇమ్మడి సోమ నర్సయ్యను అధికార పార్టీకి చెందిన ఓ నేత కోటి రూపాయలు డిమాండ్ చేస్తే ఇవ్వలేదనే కారణంగా అదును చూసి ఈ కేసులో ఇరికించినట్లుగా స్థానికులు చర్చించుకుంటున్నారు. కానీ, ఇందులో నిజానిజాలు త్వరలోనే తేలిపోనుంది.
కోట్లాది రూపాయల బియ్యం ఎగవేతలో అధికారుల పాత్ర లేదా.?
ప్రభుత్వం మారింది. పాలకులు మారారు.. పరిస్థితులు మారిపోయాయి. కాబట్టి ప్రస్తుతం అధికారులు కూడా మారని స్థితి నెలకొంది. సూర్యాపేట జిల్లా అధికారులు వెల్లడిస్తున్న వాస్తవాలు, ఆయా మిల్లర్లపై పెడుతున్న క్రిమినల్ కేసులను లోతుగా పరిశీలిస్తే ఆశ్చర్యం వేస్తోంది! ఫలానా మిల్లర్ గడిచిన 2022- 23, 2023-24 రబీ మరియు ఖరీఫ్ సీజన్లకు చెందిన 100 కోట్ల విలువ చేసే సి.ఎం.ఆర్ బియ్యం ఇవ్వలేదని, వారి మిల్లులో ధాన్యం స్టాక్ మాయమైందని అధికారులు ఇప్పుడు చిలక పలుకులు పలుకుతున్నారు. అసలు ఇన్ని కోట్ల రూపాయల ప్రభుత్వ ధాన్యం మాయమవుతుంటే క్షేత్రంలో అధికారులు ఏం చేస్తున్నట్లు?
2022-23 రబీ సీజన్లో ఒక మిల్లర్ కు కేటాయించిన ధాన్యానికి చెందిన బియ్యం సివిల్ సప్లయ్ వారికి అప్పగించనప్పుడు తిరిగి 2022-23 ఖరీఫ్ సీజన్లో మళ్ళీ అదే మిల్లర్ కు ధాన్యం ఎందుకు కేటాయించినట్లు? వేలాది మెట్రిక్ టన్నుల పెండెన్సీ ఉన్న మిల్లర్లకే సివిల్ సప్లయ్ అధికారులు నిస్సిగ్గుగా ప్రతీ సీజన్లో ధాన్యం కేటాయింపులు ఎందుకు చేసినట్లు? డిఫాల్ట్ మిల్లర్లు ఇస్తున్న కాసులకు కక్కుర్తి పడి నాడు మిల్లర్లతో కుమ్మక్కై, మిల్లర్లకు కొమ్ము కాసి నేడు కోట్లాది రూపాయల ప్రజాధనం దోపిడీకి గురైందని కేసులు పెడుతున్న సివిల్ సప్లయ్ శాఖాధికారులకు ఇందులో బాధ్యత లేదా? మీ నిర్లక్ష్యం, నిర్లిప్తత ఇందుకు కారణం కాదా? అని జిల్లా ప్రజానీకం తీవ్రంగా చర్చించుకుంటున్నారు.
జిల్లాలో మిగిలిన మిలర్లందరు పవిత్రులేనా..?
సూర్యాపేట జిల్లాలో సుమారు 74 మిల్లులు
సి.ఎం.ఆర్ బియ్యం పాలసీలో పాలుపంచుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఓ 15 మంది మిలర్లను డిఫాల్ట్ మిల్లర్లుగా స్థానిక సివిల్ సప్లయ్ శాఖ గుర్తించింది. వీరిని పక్కన పెడితే, మరి మిగిలిన మిల్లర్లంతా పవిత్రులేనా? అనే చర్చ జిల్లా మిల్లర్లలో జోరుగా నడుస్తోంది.