- ప్రైవేటు కమర్షియల్ కంపెనీల చేతిలోకి టిఎస్ఐఐసి స్థలం..
- కిరాయిల పేరుతో 5 షో రూమ్ లకు అంటగట్టిన కేటుగాడు..
- ఇబ్బడి ముబ్బడిగా అక్రమ నిర్మాణాలు..
- కేవలం నోటీసు జారీ చేసి చేతులు దులుపుకున్న జెడ్.ఎం. అనురాధ..
- ఎంత చేతులు మారాయో..? కానీ అటువైపు కన్నెత్తి చూడని అధికారి..
- జోనల్ మేనేజర్ అండ్ కమిషనర్ అనురాధ వ్యవహార తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు..
- ఉన్నతాధికారులు స్పందించి అక్రమ నిర్మాణాలను తక్షణమే కూల్చివేయాలని డిమాండ్ చేస్తున్న స్థానికులు..
ఆమె ఒక మహిళా అధికారి.. ఈ స్థాయికి చేరిందంటే ఆమె ఎంత కష్టపడిందో అర్ధం అవుతుంది.. ఉన్నత చదువులకోసం, ఆపై ఉద్యోగం కోసం ఆమె అహర్నిశలు కష్టపడి ఉంటుందన్నని నిర్విదాంశం.. ఒక మహిళలో పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలదు అని నిరూపించిన స్త్రీ మూర్తి ఆమె.. అలాంటి మహిళ ఉద్యోగంలో ఉన్నతస్థాయికి చేరుకున్నాక ఎంతో నిజాయితీగా ఉండాలి.. అవినీతికి తావివ్వకుండా పదిమందికి మార్గదర్శకురాలిగా ఉండాలి.. కానీ ఈవిడ అవినీతికి పరాకాష్టగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతుండటం యావత్ మహిళా లోకానికే కళంకంగా పరిణమించింది.. ఆమె పేరు అనురాధ టి.ఎస్.ఐ.ఐ.సి. లో జెడ్.ఎం.అండ్ కమిషనర్ గా పటాన్ చెరువు లో కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తోంది.. ఇటు ప్రభుత్వం, అటు ప్రజల ఆస్తులను కాపాడవలసిన బాధ్యత ఆమె మీద వుంది.. కానీ ఓ లీజు పొందిన వ్యక్తితో ములాఖత్ ఐ అవినీతికి తెరలేపింది.. టి.ఎస్.ఐ.ఐ.సి. స్థలాన్ని ప్రయివేట్ కమర్షియల్ సంస్థలకు కిరాయిలా పేరుతో అప్పనంగా అప్పగించడానికి తన వంతు సహకారం అందించింది అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. జరిగిన అవినీతి ఆమె దృష్టికి వచ్చినా కేవలం నోటీసులతో సరిపెట్టడంతో ఈ విమర్శలకు ఆమె తావిచ్చినట్టే అనిపిస్తోంది.. అసలు జరిగిన కథా కమామీషు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
సంగారెడ్డి జిల్లా లోని, పఠాన్ చెరు నియోజకవర్గంలో, రామచంద్రపురం లో తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ కు సంబంధించిన ప్రభుత్వ స్థలం ఫేస్ వన్ లోని ప్లాట్ నెంబర్ 29 కలదు..ఇట్టి స్థలాన్ని, పఠాన్ చెరు స్టీల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు లీజుకి ఇచ్చారు.. ఈ సంస్థ టిఎస్ఐఐసీ నిబంధనలను తుంగలో తొక్కి కాసులకు కక్కుర్తి పడి, ప్రభుత్వ అనుమతి లేకుండానే లీజుకు సంబంధం లేని వేరే వ్యక్తులకు కిరాయిలకు ఇచ్చి ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ.. కాసులు వెనకేసుకుంటున్న పఠాన్ చెరు స్టిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. లీజు తీసుకునే సమయంలో టి.ఎస్.ఐ.ఐ.సి నిబంధనలు ఉల్లంఘించి ఎలాంటి అక్రమ నిర్మాణాలు చేపట్టడం గానీ, అనుమతి లేకుండా ఇతరులకు బదిలీ చేయడం లాంటి చర్యలు చేపడితే, చట్టప్రకారం చర్యలు తీసుకుంటారని లీజు నిబంధనలు తెలుపుతున్నాయి.. కానీ పఠాన్ చెరు స్టిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ వారు .. దొడ్డి దారిన టైల్స్ అండ్ గ్రానైట్స్ సేల్స్ షోరూం, టైల్ నెస్ట్ గ్రానైట్స్ సేల్స్ షోరూమ్, లక్ష్మీ మార్బుల్స్- మార్బుల్స్ సేల్స్ అండ్ షో రూమ్, హైటెక్స్ మార్బుల్స్-మార్బుల్స్ సేల్స్ అండ్ షో రూమ్, హర్ష టయోటా – కార్ షోరూమ్ లకు కిరాయిలకు ఇవ్వడంతో పాటు అందులో టీఎస్ఐఐసి కార్యాలయ అనుమతి లేకుండానే భారీ కమర్షియల్ షెడ్లను నిర్మించి నిబంధనలు తుంగలో తొక్కారు.. ఇదంతా పటాన్చెరువు టీఎస్ఐఐసీ జోనల్ మేనేజర్ అండ్ కమిషనర్ అనురాధ కనుసన్నల్లో జరుగుతుండడంతో ఈ ప్రాంతంలో సదరు అధికారి వ్యవహార తీరుపై బహిరంగ విమర్శలు వెలువెత్తుతున్నాయి.. ప్రాథమిక స్థాయిలో నిర్మాణ పనులను గుర్తించినా వాటిని నిలుపుదల చేయకుండా, అట్టి నిర్మాణ సంస్థలతో లోపాయికారి ఒప్పందం చేసుకొని యదేచ్చగా నిర్మాణాలు చేస్తున్నా ఆ వైపు కన్నెత్తి చూడకుండా తనకు ఏమీ తెలియదన్న చందాన అధికారి వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తోంది.. నిర్మాణాలు చేస్తుంటే జెడ్ ఎమ్ అనురాధ లెటర్ నెంబర్. జడ్ ఓ/టీఎస్ ఐఐసీ/పి టి సి/1984/147, తేదీ:- 1/3/ 2024 గల నోటీసు ఇచ్చి చేతులు దులుపుకున్న తీరు చూస్తుంటే, సదరు అధికారి భారీ అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలకు బలం చేకూరుతుంది… టీఎస్ ఐఐసీ జడ్ ఎం అండ్ కమిషనర్ అనురాధ అక్రమ నిర్మాణాలకు నోటీస్ అంటించిన, సదర్ నోటీసుకు కవరు కట్టి నోటీసును లెక్కచేయకుండా ఇదేచ్ఛగా నిర్మాణాలు చేసి మూడు పూలు ఆరుకాయలన్న చందంగా వారి వ్యాపారం కొనసాగిస్తుండడం చూస్తుంటే జెడ్ ఎం అండదండలు ఏ మేరకున్నాయో అట్టే అర్థమవుతుంది.. ఇప్పటికైనా టీఎస్ఐఐసీ ఉన్నతాధికారులు స్పందించి జెడ్ ఎం అనురాధను విధుల నుండి తొలగించి, అక్రమ నిర్మాణాలను తక్షణమే కూల్చివేయాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.. అక్రమ నిర్మాణాలను కూల్చకుండా టీఎస్ఐసి స్థలాలని ప్రవేట్ పరం చేస్తుండడంపై పలువురు సామాజిక వేత్తలు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు, ఉన్నతాధికారుల తీరు పట్ల ఫిర్యాదు చేయనున్నట్టు తెలిసింది.. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ నిబంధనలను బేఖాతరు చేసిన పటాన్చెరు స్టీల్స్ ప్రైవేట్ లిమిటెడ్ లీజును తక్షణమే రద్దు చేయాలని పలువురు డిమాండ్ చేశారు.. జోనల్ మేనేజర్ అండ్ కమిషనర్ అనురాధ కనుసన్నల్లో జరుగుతున్న అక్రమ వ్యవహారాలకు సంబంధించి మరిన్ని ఆధారాలతో మరో కథనం ద్వారా వెలుగులోకి తేనుంది “ఆదాబ్ హైదరాబాద్”.. ” మా అక్షరం అవినీతిపై అస్త్రం “..