Wednesday, May 22, 2024

తాత్కాలిక ఎంప్లాయిస్‌కు శాశ్వత వేత‌న‌మివ్వాలి

తప్పక చదవండి
  • సమాన పనికి సమాన వేతనం ఇవ్వాల్సిందేనన్న సుప్రీం కోర్టు
  • ఢిల్లీ ఉద్యోగుల కేసుపై సుప్రీం సంచలన తీర్పు
  • పర్మినెంట్ ఉద్యోగులకు లక్షల్లో జీతాలు
  • విద్యా వాలంటీర్, కాంట్రాక్ట్, గెస్ట్ ఫ్యాకల్టీలకు అంతమాత్రమే
  • కనీస వేతనాల అమలు మచ్చుకైనా లేవు
  • రూ.10 వేల‌ నుంచి రూ.20 వేలలోపే వేతనాలు
  • ప్రభుత్వ సెక్టార్ లోని వివిధ శాఖల్లో శ్రమదోపిడీ
  • ఆదేశిక సూత్రాలను అమలు చేయని సర్కార్

డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం ఎంతో గొప్పది. రాజ్యాంగం భారత దేశానికి సర్వోత్కృష్ఠ చట్టం. భారత ప్రభుత్వ నిర్మాణం ఎలా ఉండాలి, పరిపాలన ఎలా జరగాలి అనే విషయాలను రాజ్యాంగంలో పొందుపరిచారు. శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థల ఏర్పాటు, ఆయా వ్యవస్థల అధికారాలు, బాధ్యతలు, వాటి మధ్య సమన్వయం ఎలా ఉండాలో కూడా ఆలోచన చేసి 2 సంవత్సరాల, 11 నెలల, 18 రోజులు రాసిర్రు రాజ్యాంగాన్ని అంబేడ్కర్. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం మనది. అన్ని వర్గాలకు సమానమైన హక్కులను కల్పించే ఏకైక సాధనం. అదే భారతదేశం యొక్క గొప్పతనం. అందులో ఉన్న లొసుగులు ఆసరాగా చేసుకొని పాలకులు మార్పులు (సవరణలు) చేస్తూ పోతున్నారు. ఆదేశిక సూత్రాల్లో పేర్కొన్న విషయాలను గమనిస్తే ఏ వర్గం వారు కూడా నష్టపోకూడదనే ఆలోచన చేసి నిర్మించారు బాబా సాహెబ్.

ఇదంతా ఓ వైపు అయితే భారత రాజ్యాంగం వందకు వంద శాతం అమలవుతుందా అనేది వెయ్యి డాలర్ల ప్రశ్న. ప్రభుత్వాలే మనదేశ ఖడ్గం లాంటిదైన దానిని పాటించకపోతే ఎవరూ నెరవేరుస్తారని మేధావులు ప్రశ్నిస్తున్నారు. ‘గుమ్మిల వడ్లు గుమ్మిల్నే ఉండాలె.. బిడ్డ దుడ్డొలిగ ఉండాలె’ అని ఎనకటికి ఎవరో అన్నట్టు ఉంది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పనితీరు. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఓ కేసులో దేశ అత్యున్న న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. ఆదేశిక సూత్రాల్లో చెప్పినట్టుగా ‘సమాన పనికి సమాన వేతనం’ అమలు కావడం లేదనే ఆవేదన వ్యక్తం చేసింది. ఢిల్లీ ఉద్యోగులు వేసిన పిటిషన్ పై సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది. తాత్కాలిక ఎంప్లాయిస్, శాశ్వత ఉద్యోగులు సమానమే అని అభిప్రాయపడింది. రెగ్యూలర్ ఎంప్లాయిస్ కు ఇచ్చినట్టుగానే కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలంటూ తీర్పు వెలువరించింది.

- Advertisement -

ప్రభుత్వ సెక్టార్ లోని వివిధ కార్యాలయాలు, స్కూల్స్, కాలేజీలు, ఆస్పత్రులు వంటి పలు ప్రదేశాల్లో పనిచేసే కాంట్రాక్ట్, విద్యావాలంటీర్లు, గెస్ట్ ఫ్యాకల్టీ, అవుట్ సోర్సింగ్, ఇతరత్రా తాత్కాలిక సిబ్బంది రెగ్యూలర్ (పర్మినెంట్) ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నప్పటికి అరకొర జీతాలె అందుతున్నాయి. లక్షల్లో జీతాలు తీసుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం అడపదడపా పనిచేస్తూ కాంట్రాక్ట్ పద్దతిన డ్యూటీ చేసే వీళ్లు మాత్రం శ్రమ దోపిడీకి గురవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సంస్థలైన పాఠశాలలు, గురుకులాలు, జూనియర్, డిగ్రీ కళాశాలలు, ఎమ్మార్వో, ఎంపీడీవో, మున్సిపల్, గవర్నమెంట్ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న వివిధ రకాల ఎంప్లాయిస్ కు రూ.10వేల నుంచి రూ.20వేల వరకు మాత్రమే వేతనం తీసుకుంటున్నారు. ‘చారాణా కోడికి భారాణా మసాలా’ అన్నట్టు వెట్టిచాకిరి చేసిన తమకు వచ్చే చాలచాలనీ జీతాలతో దుర్భరంగా జీవ‌నం కొన‌సాగిస్తున్నారు.

గవర్నమెంట్ ఉద్యోగులు లక్ష రూపాయలకు పైగా జీతాలు తీసుకుంటూ ధీమాగా బతుకుతున్నారు. కానీ అదే తాత్కాలిక ఉద్యోగుల పరిస్థితి ‘కుంచెడు గింజల కూలికి పోతే.. తూమెడు గింజలు దూడమేసినట్లు’ అన్నట్టుగా తయారైంది. శ్రమ ఎక్కువ పైకం తక్కువ కాబట్టి. ప్రభుత్వంలో పనిచేసే సరిపడ జీతాలు ఇవ్వకుంటే ప్రైవేటు సంస్థలు, కంపెనీల్లో వర్క్ చేసే వారినీ ఎంత ఘోస పుట్టించుకుంటాయో అర్థం చేసుకోవాలి. స్వయంగా దేశ అత్యున్నత న్యాయస్థానం (సుప్రీం) సమాన పనికి సమాన వేతనం ఇవ్వాల్సిందే, తాత్కాలిక ఉద్యోగులకూ రెగ్యూలర్ వారిగా జీతం కట్టించాలంటూ కీలక తీర్పు ఇచ్చినప్పటికీ ప్రభుత్వాలు కండ్లు తెరవడంలేదు. ‘దయగల మొగుడు తలుపు దగ్గరకు వేసి కొట్టాడట’ అన్న చందంగా బయటకు సుద్దులు చెబుతున్న ప్రభుత్వ పెద్దలు బక్కబలుచటి వారైన తాత్కాలిక ఉద్యోగులతో కుటుంబాల ఉసురుపోసుకుంటున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాలను సైతం లెక్కచేయకుండా ఉండడంపై విద్యావేత్తలు, మేధావులు ప్రశ్నిస్తున్నారు. వెంటనే అత్యున్నత ధర్మాసనం చెప్పినట్టుగా రెగ్యూలర్ వారి మాదిరిగా కాంట్రాక్ట్ ఉద్యోగులకు తగిన జీతాలు ఇచ్చి.. సమాన పనికి సమాన వేతనం అమలు చేసిన వారుగా చరిత్రలో నిలవాలంటూ పలువురు డిమాండ్ చేస్తున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు