Tuesday, April 30, 2024

బీసీ చైతన్యం ఒక్కటవ్వాలి..

తప్పక చదవండి
  • బీసీలను అన్ని విధాలుగా ఆదుకున్నాం
  • ఎన్నికల తరువాత కోదాడలో బీసీ భావనం
  • బీడు భూములకు కాళేశ్వరం జలాలు
  • కర్ణాటకలో కేవలం 5 గంటల కరెంట్‌
  • ఇక్కడ 24 గంటలు ఫ్రీ ఇస్తున్నం
  • తెలంగాణకు గులాబీ పార్టీనే శ్రీరామరక్ష
  • కాంగ్రెస్‌ ప్రజలకు తీరని అన్యాయం చేసింది
  • నీటి హక్కులపై ఎవరూ నోరు మ్నెదపలేదు
  • నాగార్జున సాగర్‌ నిర్మాణంలో కుట్ర జరిగింది
  • పేరు వేరే ఉంది.. కట్టాల్సింది కూడా అక్కడ కాదు
  • తుంగతుర్తి ఎన్నో పోరాటాలు చేసిన గడ్డ
  • కోదాడ, తుంగతుర్తి ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌

హైదరాబాద్ : కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌పై సీఎం కేసీఆర్‌ మండిపడ్డారు. సాగుకు కరెంటు విషయంలో డీకే చేసిన వ్యాఖ్యలను ఎద్దేవా చేశారు. డీకే శివకుమార్‌ తీరు కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెడగొట్టినట్లు ఉందన్నారు. కర్ణాటక నుంచి వచ్చిన డీకే రంగారెడ్డి జిల్లాలో మాట్లాడుతూ కరెంటు విషయంలో సవాల్‌ చేశారని, ఆయన విసిరన సవాల్‌ హాస్యాస్పదంగా ఉందని సీఎం వ్యాఖ్యానించారు. ఎన్నికల సందర్భంగా ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలని, ప్రజల గురించి ఏ పార్టీ ఏం చేసిందో ఆలోంచాలని కేసీఆర్‌ సూచించారు. ఓటు మన తలరాతను మారుస్తుందని, పంటలు పండాలా…? ఎండాలా…? అనే విషయాన్ని ఓటు నిర్ణయిస్తుందన్నారాయన.. ప్రజాస్వామ్యంలో ఓటును మించిన శక్తి లేదని అన్నారు.

ఆదివారం జరిగిన ప్రజా ఆశీర్వాద ప్రచారంలో భాగంగా కోదాడ, తుంగతుర్తి సభల్లో పాల్గొన్న కేసీఆర్‌.. రెండు సభల్లోనూ డీకే శివకుమార్‌పై పంచులు పేల్చారు. తెలంగాణలో రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్నామని కేసీఆర్‌ చెప్పుకొచ్చారు. అయితే.. ఈ 24 గంటల కరెంటు అవసరం లేదని కాంగ్రెస్‌ నేతలు వద్దంటున్నారని.. కేవలం 3 గంటల కరెంటు చాలని టీపీసీసీ అధ్యక్షుడే చెప్తున్నాడని పేర్కొన్నారు. అయితే.. కర్ణాటక నుంచి అక్కడి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ ప్రచారానికి వచ్చాడని.. పరిగిలో మాట్లాడుతూ తమ రాష్ట్రంలో రైతులు 5 గంటల కరెంటు ఇస్తున్నామని గొప్పలు చెప్తున్నాడని తెలిపారు. అక్కడ 5 గంటల కరెంట్‌ ఇస్తే.. ఇక్కడ 24 గంటల కరెంట్‌ ఇస్తున్నామంటూ కౌంటర్‌ ఇచ్చారు కేసీఆర్‌. 24 గంటల కరెంటు ఇస్తున్న రాష్ట్రానికి వచ్చి 5 గంటల కరెంటు ఇస్తున్నామంటూ గొప్పలు పోవటమేంటీ అంటూ తనదైన శైలిలో చెప్పటంతో.. సభ మొత్తం ఒక్కసారిగా గొల్లున నవ్వింది. కర్నాటకలో ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మి ఓటేస్తే వారికి ఐదు గంటల కరెంటే ఇస్తున్నారని.. ఈరోజు ఆ రైతులంతా ధర్నాలు చేస్తున్నారని కేసీఆర్‌ చెప్పుకొచ్చారు. తెలంగాణలో కూడా నమ్మి కాంగ్రెస్‌కు ఓటేస్తే మాత్రం కరెంటును కాటకలుపుతుందని హెచ్చరించారు కేసీఆర్‌.

- Advertisement -

ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు బాగా ఆలోచించి ఓటేయాలని, ఎవరికి పడితే వాళ్లకు కాకుండా మంచి, చెడు, న్యాయం, అన్యాయం గురించి ఆలోచించి ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఏ పార్టీకి ఓటేస్తే మంచి జరుగుతది, ఏ పార్టీ రాష్ట్రాన్ని బాగు చేస్తది అనేది ప్రజలు ఓటు వేసేటప్పుడు బాగా ఆలోచించాలని కోరారు. కరువులతో అల్లాడిన ఆలేరు నియోజకవర్గం తెలంగాణ ఏర్పడిన తర్వాత అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నదని సీఎం చెప్పారు. లక్ష్మీ నర్సింహస్వామి ఆశీస్సులతో యాదరిగి గుట్ట పుణ్యక్షేత్రాన్ని మరింత అద్భుతంగా తీర్చిదిద్దుకున్నమని తెలిపారు. ఒకప్పుడు ఆలేరు భూములకు విలువ ఉండేది కాదని, ఇప్పుడు ఈ నియోజకవర్గానికి పెద్దపెద్ద షావుకారులు వచ్చి భుములు కొని పెట్టుకున్నరని అన్నారు. ఆలేరు రూపు రేఖలే మారిపోయాయని చెప్పారు. సునీతను మరోసారి గెలిపిస్తే ఆలేరులో మరింత అభివృద్ధి జరుగుతుందని చెప్పారు.

‘కోదాడలో ఒక బీసీకి అవకాశం రాలేదు. పీహెచ్‌డీ వరకు చదివిన విద్యావంతుడని పిలిచి టికెట్‌ ఇచ్చాను. మీరు దీవిస్తే ఎమ్మెల్యేగా గెలిచాడు. మీ మధ్యనే ఉన్నడు తోచిన పనులు చేస్తున్నడు. ప్రభుత్వం అందించే కార్యక్రమాలు, ఆయనగా చేసే కార్యక్రమాలు చేస్తున్నారు.

మల్లయ్య యాదవ్‌ గెలువడు అని ఆరు నెలలుగా నా వద్దకు వచ్చి గునుగుడు.. మంత్రి వద్దకు వచ్చి గునుడు. గెలవకపోతే గెలువకపాయే.. నేను టికెట్‌ ఇస్తా.. ఏం జరుగుతుందో అదే జరుగుతుంది అని చెప్పాను. ఇవాళ కోదాడ నియోజకవర్గంలో చదువుకున్న, ఉద్యోగాలు చేస్తున్న, నిరుద్యోగులు, రిటైర్డ్‌ బీసీ చైతన్యం కనపడాలి. మేము 50శాతం, 60 శాతం ఉన్నమని నరుకుడు కాదు.. రుజువు చేసి చూపించాలి. కోదాడ నియోజకవర్గంలో బీసీ చైతన్యం ప్రతి కుటుంబంలో, ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల ఇంట్లో చర్చ జరగాలి. కేసీఆర్‌ చెప్పింది నిజమా? ఎవరు గెలవాలి ? ఎవరు ఓడిపోవాలి ? అనే చర్చ చేయాలి. 60శాతం, 70శాతం బీసీ సామాజిక, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గం ఎందుకు ఓడిపావాలి. ఆ చైతన్యాన్ని చూపెట్టే బాధ్యత కోదాడ మీద ఉన్నది. కోదాడలో విజయ బావుటగా ఎగుర వేయాలి. మల్లయ్య యాదవ్‌ ఇప్పుడే నన్ను కోరారు. అగ్రకులాలతో పాటు పెద్ద సంఖ్యలో బీసీ కులాల ప్రజలు ఉన్నరు. ప్రత్యేకంగా కోదాడ కోసం బీసీ భవన్‌ను మంజూరు చేయాలని కోరారు. మల్లయ్య యాదవ్‌ను బంపర్‌ మెజారిటీతో గెలిపిస్తే రూ.10కోట్లతో కోదాడలో బీసీ భవన్‌ను కట్టించే బాధ్యత నాది. బీసీ చైతన్యాన్ని చూపించాలి.. చూపిస్తారనే నమ్మకం నమ్మకం ఉంది’ అన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు