Wednesday, May 22, 2024

17 ఏళ్లుగా ఒకే చోట తిష్ట వేసిన కే. సుదర్శన్

తప్పక చదవండి
  • భువనగిరి ఆర్టీఏ ఆఫీసులో ఆయనే రాజు.. ఆయనే మంత్రి..
  • ఇప్పటికే మూడు ఏసీబీ కేసులు.. పలు ఛార్జ్ మెమోలు
  • అయినా, సారుకు సాధారణ బదిలీ కూడా లేదు..
  • బిఆర్ఎస్ పార్టీకి నమ్మిన బంటుగా పేరు!
  • దీర్ఘకాలికంగా కొనసాగుతున్న సారు ‘దాదాగిరి’పై ఆదాబ్ ప్రత్యేక కథనం..

యాదాద్రి భువనగిరి జిల్లా రవాణా శాఖ (ఆర్టీఏ) కార్యాలయంలో గడిచిన 17 ఏళ్లుగా ఇక్కడ విధులు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగిపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు వినపడుతున్నాయి. స్పౌజ్ బదిలీపై ఇక్కడ ఉద్యోగం నిర్వహిస్తున్న ఈయనకు 17 ఏళ్లుగా ఒకే చోట అవకాశం ఏ విధంగా ఇచ్చారనేది ఇక్కడి ఉద్యోగుల్లో తీవ్ర చర్చ కొనసాగుతోంది. సీసీఏ నిబంధనలకు విరుద్ధంగా ఒక ప్రభుత్వ ఉద్యోగి ఒకే కార్యాలయంలో 17 ఏళ్లకు పైగా ఉద్యోగం నిర్వహించడం ఎలా సాధ్యమవుతుందో ఎవరికి అంతుచిక్కని వైనం. ఈయన సర్వీసు విషయం ఇలా ఉంటే, భువనగిరి ఆర్టీఏ కార్యాలయంలో సారు చెప్పిందే వేదం.. ఈయన మాటే ఇక్కడ శాసనం… ఈ విధంగా కార్యాలయాన్ని మొత్తం తన హస్తగతం చేసుకొని అందరిపై సారు కర్రపెత్తనం కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. భువనగిరి ఆర్టీఏ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న కే. సుదర్శన్ అనే ఉద్యోగి గత 17 ఏళ్లుగా ఇదే కార్యాలయంలో వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. ఇన్నేళ్లుగా ఇతనొక్కడే అత్యంత ఎక్కువ కాలం పని చేసిన అధికారిగా ముద్రపడింది. ఈయన ముందట ఎంతో మంది జిల్లా అధికారులు వస్తూపోతూ ఉన్నారు. కానీ ఈయనకు మాత్రం నేటి వరకు కనీసం ఒక్క సాధారణ బదిలీ కూడా లేదని తెలుస్తోంది. భువనగిరి ఆర్టీఏ కార్యాలయంలో తమ పని జరగాలంటే జిల్లా అధికారికంటే ముందు ఇక్కడున్న సీనియర్ అసిస్టెంట్ ను కలవాల్సి ఉంటుందని, రూల్స్ ప్రకారం పొరపాటున ఈయనను దాటుకుని ఎవరైనా తమ ఫైలు జిల్లా అధికారి వద్దకు తీసుకుపోతే.. సదరు అధికారులు సైతం ఈయన సమ్మతి ఉందా! లేదా అని పరిశీలించుకున్న తర్వాతే సంబంధిత ఫైలును ఆమోదిస్తున్నట్లు తెలుస్తోంది. దీన్నిబట్టి పరిశీలిస్తే, ఇక్కడ ఈయనంటే జిల్లా రవాణా శాఖ అధికారులకు సైతం హడల్ అన్నట్లు తెలియ వచ్చింది. తొండ ముదిరి ఊసరవెల్లి గా మారిన సామెత ఇక్కడ కొనసాగుతోందన్నట్లు.!

- Advertisement -

మూడు ఏసీబీ కేసులు.. పలు చార్జ్ మెమోలు…

ఈయనపై ఇప్పటికే మూడు ఏసీబీ కేసులు నమోదు కాగా, సంబంధిత కేసులో ఇతనికి ఉన్నతాధికారులు మూడు ఛార్జ్ మెమోలు జారీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. సాధారణంగా రవాణా శాఖలో పనిచేసే అధికారులపై శాఖపరమైన ఛార్జ్ మెమోలు ఉంటే, వారికి అధికారికంగా ప్రభుత్వ వెబ్ సైట్లో లాగిన్ ఇవ్వకూడదనే నిబంధనలు ఉన్నాయి. కానీ వాటన్నిటినీ ఇక్కడ తుంగలో తొక్కి, యదేచ్చగా భువనగిరి ఆర్టీఏ కార్యాలయంలోఈయన వీర విహారం చేస్తున్నట్లు తెలుస్తోంది.

స్పౌజ్ కేసు పేరుతో 17 ఏళ్లు తిష్ట.. 317 జీవో భేఖాతర్.!

నాగర్ కర్నూలు జిల్లా ప్రాంతానికి చెందిన ఈయన, తన సతీమణి కూడా యాదాద్రి భువనగిరి జిల్లాలో శ్రీ శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. స్పౌజ్ కేసు పేరు చెప్పుకొని, సీసీఏ నిబంధనలను తుంగలో తొక్కి, కొన్ని ఏళ్లుగా ఇక్కడే ఇరువురు ఉద్యోగాలు చేస్తున్నట్లు సమాచారం. 317 జీవో ప్రకారం ఈ ఇరువురు గడిచిన 2022 లోనే వారి సొంత జిల్లా అయిన నాగర్ కర్నూల్ ప్రాంతానికి బదిలీ కావలసి ఉంది. కానీ నిబంధనలను పాతరేసి, స్పౌజ్ కేసు అని చెప్పుకుంటూ ఏండ్ల కొద్ది ఒకే చోట ఉద్యోగం చేయడం చట్ట విరుద్ధమైన చర్యగా ఇక్కడ ఉద్యోగులంతా భావిస్తున్నారు.

ప్రైవేటు వ్యక్తులతో తన విధుల నిర్వహణ..!

ప్రభుత్వ కార్యాలయంలో తాను కూర్చొని పని చేయాల్సిన చోట ముగ్గురు ప్రైవేటు వ్యక్తులను ఏర్పాటు చేసుకొని, తాను చేయాల్సిన పనులను వేరే వారితో చేయిస్తున్నట్లు కార్యాలయ ఉద్యోగులే విమర్శిస్తున్నారు. తాను ఇష్టానుసారంగా ఇక్కడ వ్యవహరిస్తున్నా, జిల్లా అధికారులు ఈయనను ఎందుకు వారించలేకపోతున్నారో ఎవరికి అర్థం కాని దుస్థితి ఇక్కడ నెలకొంది. ఈయనకు భువనగిరి కార్యాలయము నుండి రవాణా శాఖ కమిషనర్ కార్యాలయానికి డైరెక్ట్ లింకు ఉన్నట్లుగా చెప్పుకొని ఇతర సిబ్బందిని బెదరగొడుతుంటాడని, గతంలో ఈయన మాజీ మంత్రి హరీష్ రావు దగ్గర పనిచేయడం కారణంగా తన రాజకీయ పలుకుబడిని ఉపయోగించి గత బిఆర్ఎస్ 10 ఏళ్ల కాలం మొత్తం ఇక్కడ ఈయనకు ఎదురులేని రాజ్యాన్ని ఏలినట్లు తెలుస్తోంది.

బి.ఆర్.ఎస్ పార్టీకి నమ్మిన బంటుగా పేరు.!

భువనగిరి ఆర్టీఏ కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ కే. సుదర్శన్ పేరు చెబితే చాలు., ఇక్కడ కానీ పని అంటూ లేదని అందరూ చెప్పుకుంటారు. బిఆర్ఎస్ పార్టీ పెద్దలతో ఈయనకు అత్యంత బలమైన రాజకీయ సంబంధాలు ఉండేవని తోటి ఉద్యోగులు అంటున్నారు. ఏండ్లకొద్దీ ఈ కార్యాలయంలోనే పాతుకపోయి, ఈయన వేర్లు ప్రస్తుతం అవి ఊడలుగా మారి, ఇక్కడ సామ్రాజ్యాన్ని తన ఒంటి చేతితో నడిపిస్తున్నట్లు కార్యాలయంలో తీవ్రమైన చర్చ అయితే జరుగుతోంది.

మరిన్ని వివరాలు వచ్చే సంచికలో…

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు