Friday, June 14, 2024

టీఎస్ఎస్‌పీడీసీఎల్ లో రూ. 1,200 కోట్ల‌ స్కామ్‌

తప్పక చదవండి
  • ట్రాాన్స్ ఫార్మర్స్ పెన్సింగ్ ఆఫ్ డీటీఆర్ పేరుతో భారీ అవినీతి కుంభ‌కోణం
  • స్క్వేర్ ఫీట్ రూ. 56 ప‌నుల‌కు రూ. 384 చొప్పున వ‌సూలు
  • 47 మంది డీఈ, ఏడీఈ, ఏఈల అవినీతి బాగోతం..
  • 2016-20 వరకు కొనసాగిన పెన్సింగ్ పనులు
  • సుమారు 20 డివిజన్లలో జరిగిన వర్క్స్
  • నచ్చిన గుత్దేదార్లకే ఓపెన్ టెండర్ల అప్పగింత
  • డీఈ, గుత్తేదార్లు కలిసి అడ్డగోలుగా దోపిడి
  • పాత సీఎండీ రఘుమారెడ్డికి వాటాలు..!
  • అవినీతి అధికారుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు ఎక్క‌డ‌..?

టీఎస్ఎస్‌పీడీసీఎల్‌లో త‌వ్వినా కొద్ది భ‌య‌క‌ర‌మైన అవినీతి బాగోతాలు బ‌ట్ట‌బ‌య‌లు అవుతున్నాయి.. గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వం అండ చూసుకొని అప్ప‌టి సీఎండీ ర‌ఘుమారెడ్డి స్మార్ట్‌గా ఉంటునే.. స్మార్ట్‌గా భారీ స్కామ్‌ల‌కు తెగ‌ప‌డ్డాడు.. తాజాగా దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్)లో భారీ కుంభకోణం బయటపడింది. అందుకు సంబంధించిన వివరాలు ఆదాబ్ హైద‌రాబాద్‌ చేతికొచ్చాయి. పాత సీఎండీ రఘుమారెడ్డి, అతని అవినీతి శిష్యగణం కాసుల కోసం రూ.వేల కోట్ల స్కాం చేసేశారు. బీఆర్ఎస్ సర్కార్ హయంలో మమ్ములను అడిగేవారేవ్వరన్నట్లు ఆయా డివిజన్ల పరిధిల్లోని కొందరు డీఈ, ఏడీఈ, ఏఈలు ఇష్టారాజ్యంగా వ్యవహరించి కోట్లు దండుకున్నారు. నవ్విపోదుగాక నాకేంటి సిగ్గన్నట్లు టెండర్ లో కోడ్ చేసిన ప్రకారం కాకుండా ఇష్టారీతిన చేసిన పనులకు.. బిల్లులు అప్రూవల్ చేసేశారు.

2016-2020 వార్షిక బడ్జెట్లలో టీఎస్ఎస్పీడీసీఎల్ లోని సుమారు 20 డివిజన్ల పరిధిలో ట్రాన్స్ ఫార్మర్ల చుట్టు కంచె వేసేందుకు సంబంధిత డీఈలు ఓపెన్ టెండర్ల ద్వారా గుత్తేదార్లను బిడ్డింగ్స్ కు ఆహ్వానించారు. ఈ బిడ్డింగ్స్ లోని నిబంధనల ప్రకారం ట్రాన్స్ ఫార్మర్ల చుట్టూ 5 ఫీట్ల పొడగు, 4 ఫీట్ల వెడల్పుతో ఇనుప కంచె వేయాల్సి ఉంటుంది. డీటీఆర్ (ట్రాన్స్ ఫార్మర్) చుట్టు మొత్తం 120 ఫీట్లతో పెన్సింగ్ నిర్మాణాన్ని పూర్తి చేయాలి. ఇనుప కంచె తప్పకుండా 7 ఫీట్లు ఉండేలా గుత్తేదారు చూసుకోవాలి. పెన్సింగ్ చుట్టు ఇనుప ముళ్లతో కూడిన వైర్ ఏర్పాటు చేయాలి. కంచె చుట్టు మొత్తం 8 ఇనుప రాడ్స్ ను పోస్టులుగా ఏర్పాటు చేసి.. వాటి కింద కాంక్రిట్ నిర్మాణాలు చేయాల్సి ఉంటుంది. పెన్సింగ్ పూర్తైన తర్వాత దానికి ఒక గేట్ ను కూడా అమ‌ర్చాలి..

- Advertisement -

అయితేే ఇంతవరకు బాగానే ఉన్న పెన్సింగ్ నిర్మాణ పనుల్లో అనేక గోల్ మాల్ పనులు జరగడం గమనార్హం. గుత్తేదారు ఎస్టిమేషన్ కు క్షేత్ర స్థాయిలో పనులకు అస్సలు సంబంధం లేకపోవడం ఆశ్చ‌ర్యాన్ని క‌ల్గిస్తుంది. చేసిన పనులకు ఇచ్చిన బిల్లులకు కూడా అస్సలు పోలిక లేకపోవడం గమ్మత్తుగా ఉంది. ఎస్టిమేషన్స్ ప్రకారం పనులు జరగకున్నా.. సంబంధిత బిల్లులను ఆయా డివిజన్లలోని డీఈలు పాస్ చేయడం బాధాకరం. నిబంధనల ప్రకారం ఫీట్ కు ఏరియాను బట్టి ఎస్టిమేషన్ లెక్కలు వేయాలి.. మామూలుగా అయితే ట్రాన్స్ ఫార్మర్ల చుట్టు 120 ఫీట్లకు మించి పెన్సింగ్ వేయాల్సి పనిలేదు. కానీ, అనేక చోట్ల 600 ఫీట్ల కంచె వేసినట్లు ఎస్టిమేషన్ వేసి బిల్లులు పాస్ కావడం గమనార్హం. మరికొన్ని చోట్ల స్క్వేర్ ఫీట్ కు రూపాయి చెల్లించాల్సిన చోట అంతకు 14 రెట్ల అధిక మొత్తాన్ని చెల్లించారు. ఇంకొన్ని చోట్లనైతే తన అనుయాయులకే డీఈలు డీటీఆర్ కంచె టెండర్లు అప్పగించడం విశేషం.

మచ్చుకుకొన్ని ఉదాహరణలు..
మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్ శివంపేట్ ఏఈ లిమిట్స్ లో రెండు ట్రాన్స్ ఫార్మర్ల చుట్టు ఇనుప పెన్సింగ్ వేయడం జరిగింది. ఇందుకు సంబంధించిన ఎస్టిమేషన్ ను 20.03.2018 నాడు వేశారు. అయితే ఎస్టిమేషన్ లోనే లోపాలుండడం గమనార్హం. వాస్తవానికి నిబంధనల ప్రకారం డీటీఆర్ చుట్టు 100 నుంచి 120 మీటర్లకు మించి ఇనుప కంచె వేయరాదు. కానీ, ఇక్కడ అదనంగా 14 రెట్లు పెన్సింగ్ వేసినట్లు చూపించుకున్నారు. ఇక్కడ స్వ్కేర్ ఫీట్ కు రూ.56ను ఎస్టిమేషన్ లో కోడ్ చేశారు. అంటే ఈ చొప్పున అదనంగా 14 రెట్ల మేర కంచె వేసినట్లు చూపించినందున గుత్తేదార్, విద్యుత్ అధికారులు కలిసి ఎంత మొత్తం మింగేశారో ఇట్టే అర్థమవుతోంది. అలాగే హుస్నాాబాద్ డివిజన్ పరిధిలోని మరో రెండు ట్రాన్స్ ఫార్మర్ల చుట్టు వేసిన పెన్సింగ్ ను పరిశీలించగా.. అడ్గగోలు అవినీతి జరిగినట్లు అర్థమవుతోంది. ఇక్కడ ప్రతీ స్క్వేర్ ఫీటుకు ఇనుప కంచె వేసేందుకు రూ.284లుగా నిర్ణయించారు.

అదే శివంపేట ఏఈ పరిధిలోని ట్రాన్స్ ఫార్మర్స్ కు మాత్రం ప్రతీ స్క్వేర్ ఫీటుకు రూ.56 నిర్ణయించారు. కానీ, ఇక్కడ మాత్రం అదే కంచెను రూ.284కు వేసినట్లు నిర్ణయించడం గమ్మత్తుగా ఉంది. అంటే శివంపేట్ లో క్వాంటిటి పెంచి డబ్బులు దండుకోగా.. ఇక్కడ మాత్రం ఫీట్ చొప్పున వేసే కంచెకు రేట్ పెంచేసి పైసల్ మింగేశారు. ఇక వికారాబాద్ జిల్లా దోమలో మాత్రం క్వాంటిటిని తగ్గించినప్పటికీ.. స్వ్కేర్ ఫీట్ కు వేసే రేట్ ను మాత్రం అమాంతం పెంచేశారు. ఇక్కడ ఒక్క ఫీటు కంచె వేసేందుకు రూ.384 అయినట్లు చూపించడం గమనార్హం. అంటే శివంపేట్, హుస్నాబాద్ లలో జరిగిన కంచె పనుల కన్న అధిక మొత్తం రేట్ ను ఇక్కడ సంబంధిత డీఈ చెల్లించారన్న మాట. మొత్తంగా తక్కువ రేట్ ఉన్న చోట అధిక క్వాంటిటిని.. ఎక్కువ రేట్ కోడ్ చేసిన దగ్గర తక్కవ క్వాంటిటిని మెయింటెన్ చేసి నిబంధనలకు పాతరేసి సుమారు 20 డివిజన్ల పరిధుల్లో ఆయా డీఈ, ఏడీఈ, ఏఈ అధికారులు కోట్లాది రూపాయాలను దిగమింగినట్లు అర్థమవుతోంది.

అంతేకాక డీటీఆర్ లకు ఇనుప కంచెలు వేసే పనులను సంబంధిత డీఈలు తమ తాబేదార్లకే గుత్తేదార్ వర్క్స్ ను అప్పగించుకొని జరిగిన అవినీతి వల్ల వచ్చిన సోమ్మును పప్పు-బెల్లం వలె పంచేసుకున్నారు. ఈ అవినీతి వ్య‌వ‌హ‌రం బ‌ట్ట‌బ‌య‌లు కావ‌డంతో టీఎస్ఎస్‌పీడీసీఎల్ అధికారులు స‌మాచార హ‌క్కు చ‌ట్ట ప్ర‌కారం ఒక సామాజిక కార్య‌క‌ర్త కోరిన స‌మాచారం ప్ర‌కారం నిబంధ‌న‌ల‌కు ఉల్లంఘించి, అవినీతికి పాల్ప‌డిన 47మంది (డీఈ, ఏడీఈ, ఏఈ) అధికారుల‌పై శాఖ ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని, అలాగే ప్ర‌భుత్వ సొమ్మును దొంగ బిల్లుల‌తో స‌ర్కార్ ఖ‌జానాను కొల్ల‌గొట్టిన అవినీతి అధికారుల నుండి రెవెన్యూ రీక‌వ‌రీ యాక్ట్ ప్ర‌కారం డ‌బ్బులు రీక‌వ‌రీ చేస్తామ‌ని తెలిపారు.

విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం దర్యాప్తు అధికారులు అవినీతి అధికారుల‌తో చేతులు క‌లిపి సుమారు 20 డివిజన్ల పరిధుల్లో కొల‌తల‌ తేడాల‌ను ప‌రిశీలించి, చ‌ర్య‌లు తీసుకునే విధంగా రిపోర్ట్ చేసిన‌ట్లు స‌మాచారం. శివంపేట ఏఈ పరిధిలోని ట్రాన్స్ ఫార్మర్స్ కు స్క్వేర్ ఫీటుకు రూ.56 కానీ, ఒక‌చోట ట్రాన్స్ ఫార్మర్స్ కు స్క్వేర్ ఫీటుకు రూ. 125 చొప్పున 231 శాతం అధికంగా బిల్లు చెల్లించారు. అలాగే మ‌రోచోట స్వ్కేర్ ఫీట్ కు రూ.284 చొప్పున 526 శాతం అధికంగా బిల్లులు చెల్లించారు. వీటన్నింటిని మించి వికారాబాద్ జిల్లా దోమలో మాత్రం క్వాంటిటిని తగ్గించి.. స్వ్కేర్ ఫీట్ కు రూ.384 చొప్పున 711శాతం అధినంగా బిల్లులు చెల్లించారు.

రూ. 1200 కోట్లు కొల్ల‌గొట్టిన అవినీతి అధికారులు…
ఉదాహ‌ర‌ణ‌కు ప్ర‌దీప్ ఎల‌క్ట్రీక‌ల్, కాంట్రాక్ట‌ర్ ఏడుకొండ‌లుకు నామినేష‌న్ బేసెస్ ప్ర‌కారం వ‌ర్క్‌ను కేటాయించ‌డం జ‌రిగింది. డీఈ అగ్రీమెంట్ ప్ర‌కారం 4,769 ప‌నుల‌కు గాను రూ. 30,69,81,354/-, అదే విధంగా ఎస్ఈ అగ్రీమెంట్ ప్ర‌కారం 314 ప‌నుల‌కు గాను రూ. 3,70,43,484/- మొత్తం క‌లిపి ఏడుకొండ‌లు అనే కాంట్రాక్ట‌ర్‌కు రూ. 34,40,24,838 చెల్లించారు. ఇది ఒక కాంట్రాక్ట‌ర్ ఏడుకొండ‌లుకు సుమారు రూ.34 కోట్లు చెల్లించింది.. అదే విధంగా 20 డివిజ‌న్‌ల‌లో 48మంది కాంట్రాక్ట‌ర్లు.. సుమారుగా ఒక్కొక్క కాంట్రాక్ట‌ర్ అగ్రిమెంట్ విలువ రూ.25 కోట్లు.. అంటే మొత్తం 48 మంది కాంట్రాక్ట‌ర్లకు టీఎస్ఎస్ పీడీసీఎల్ నుండి అక్ర‌మంగా చెల్లించింది రూ.1,344 కోట్లు.. వాస్తవంగా ఈ ప‌నులు టీఎస్ఎస్ పీడీసీఎల్ నిర్ణ‌యించిన ధ‌ర ప్ర‌కారం, సంస్థ నిబంధ‌న‌ల ప్ర‌కారం మార్కెట్ ధ‌రతో సుమారు రూ. 144 కోట్లు వెచ్చిస్తే 20 డివిజ‌న్‌ల‌లో జ‌రిగిన పెన్సింగ్ ఆఫ్ డిటీఆర్ ప‌నులు పూర్తి అవుతాయి.. అంటే టీఎస్ఎస్ పీడీసీఎల్ సంస్థ‌లోని అవినీతి అధికారులు, కాంట్రాక్ట‌ర్లతో లోపాయ‌కారి ఒప్పందం చేసుకొని ఎంత లేద‌న్న సుమారు రూ. 1200 కోట్లు కొల్ల‌గొట్టారు…

ఇంత భారీ ఎత్తున అవినీతికి పాల్ప‌డిన 47మంది (డీఈ, ఏడీఈ, ఏఈ) అధికారులపై 2022 సంవ‌త్స‌రం న‌వంబ‌ర్ మాసంలో చ‌ర్య‌లు తీసుకొని, అవినీతి సొమ్మును రీక‌వ‌రీ చేస్తామ‌ని టీఎస్ఎస్‌పీడీసీఎల్ ఇచ్చిన లేఖ‌లో జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ జి. సుధ‌ స్ప‌ష్టంగా తెల‌ప‌డం జ‌రిగింది.. కానీ, ఈ రోజు వ‌ర‌కు సంబంధిత అధికారుల‌పై చ‌ర్య‌లు తీసుకోలేదు.. త‌ప్పుడు లెక్క‌ల‌తో కాజేసిన సొమ్మును సైతం రీక‌వ‌రీ చేయ‌కుండా గ‌తంలో ఉన్న సీఎండీ రఘుమారెడ్డి ఒక్కొక్క అవినీతి అధికారి నుండి సుమారు రూ. 20 ల‌క్ష‌లు వ‌సూలు చేసి, పైల్ ను తొక్కి పెట్టిన‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టికైనా టీఎస్ఎస్‌పీడీసీఎల్ అప్ప‌టి సీఎండీ రఘుమారెడ్డిపై ప్ర‌స్తుత సీఎండీ ఎం.డి. ముషార్రఫ్ ఫరూకీ క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, ఇప్ప‌టి వ‌ర‌కూ అక్ర‌మంగా సంపాదించిన అవినీతి సొమ్మును సైతం రీక‌వ‌రీ చేసి, నిర్ల‌క్ష్యం వ‌హించిన సంబంధిత అధికారుల‌పై శాఖ ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదాబ్ హైద‌రాబాద్ ప‌త్రిక కోరుతుంది.

టీఎస్ఎస్‌పీడీసీఎల్ లో జ‌రిగిన మ‌రిన్ని భ‌య‌క‌ర‌మైన అవినీతి అక్ర‌మాలు తెర‌ముందుకు తేనుంది.. ఆదాబ్ హైద‌రాబాద్.. మా అక్ష‌రం.. అవినీతిపై అస్త్రం…

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు