Monday, April 29, 2024

ఆరునెలల్లో కాంగ్రెస్‌పై ప్రజా తిరుగుబాటు

తప్పక చదవండి
  • ఆదానీని దొంగ అంటూనే అలయ్‌ బలయ్‌
  • మొన్నటి వరకు మోడీ అదానీపై విమర్శలు
  • ఎరువుల కోసం రైతులు క్యూలో ఉండే పరిస్థితి
  • బీజేపీ ఆదేశాల మేరకే రేవంత్‌ రెడ్డి పని
  • పార్లమెంట్‌ ఎన్నికలకు సన్నద్దంగా ఉండాలి

హైదరాబాద్‌ : ఆరు నెలల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడతారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే కేటీఆర్‌ అన్నారు. ఎన్నికల ముందు అదానీ దొంగ అని విమర్శించిన రేవంత్‌ రెడ్డి.. సీఎం అయ్యాక దావోస్‌ సాక్షిగా అదానీతో అలయ్‌బలయ్‌ చేసుకున్నారని విమర్శించారు. ప్రధాని మోడీ అదానీ ఒకటేనని రాహుల్‌ అంటున్నారని.. మొన్న రేవంత్‌ కూడా అదానీ`మోడీ ఒకటేనని విమర్శించారని గుర్తు చేశారు. ఢిల్లీలో అదానీతో కొట్లాడుతూ తెలంగాణలో మాత్రం అదానీతో కలిసి ఎందుకు పనిచేస్తున్నారో చెప్పాలని రేవంత్‌ రెడ్డిని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. ఈ ఏడాదిలో వరుసగా వివిధ ఎన్నికలు ఉన్నాయని.. వీటిని ఎదుర్కోవడం కోసం పార్టీ సంసిద్ధంగా ఉండాలని కేటీఆర్‌ పిలుపునిచ్చారు. గురువారం పార్టీ ఎమ్మెల్సీలతో సమావేశం అయిన ఆయన.. రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉండే అవకాశం ఉందన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ గెలుపు అవకాశాలు బలంగా ఉన్నాయని నమ్మకం వెలిబుచ్చారు. రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో ఎమ్మెల్సీలు విస్తృతంగా పనిచేయాలని కోరారు. జిల్లా కేంద్రంగా పార్టీ కార్యక్రమాలను మరింత యాక్టివేట్‌ చేస్తామన్నారు. త్వరలోనే మాజీ సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీలతో సమావేశం ఉంటుందని.. అందులోనే శాసన మండలి పార్టీ నేతను ఎన్నుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన 420 హామీల అమలు కోసం శాసనసభలో బీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున ఒత్తిడి కొనసాగిస్తామని కేటీఆర్‌ పేర్కొన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని కాంగ్రెస్‌కు గుర్తు చేస్తామన్నారు. హామీలను అమలు చేయకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తే.. అసెంబ్లీలో ఉన్న బలమైన ప్రతిపక్షాలు శాసనసభ వేదికగా ప్రశ్నిస్తాయని హెచ్చరించారు. శాసనమండలి సభ్యులు పార్టీకి కళ్లు, చెవుల మాదిరిగా పని చేయాలని అన్నారు. శాసనమండలి సభ్యులు తమ నియోజకవర్గాల్లోని పార్టీ శ్రేణులతో సమన్వయం చేసుకోవాలన్నారు. పార్టీని గ్రామస్థాయి నుంచి పోలిట్‌ బ్యూరో వరకు పునర్య్వవస్థీకరించాలని పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ భావిస్తున్నారని చెప్పారు. చురుకైన నాయకులు, కార్యకర్తల సేవలను పార్టీ ఉపయోగించుకుంటుందని కేటీఆర్‌
చెప్పుకొచ్చారు. తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ పార్టీ మహబూబ్‌నగర్‌ లోక్‌సభ నియోజకవర్గ సన్నాహక సమావేశం జరిగింది. సభకు మాజీ మంత్రులు నిరంజన్‌రెడ్డి, వీ శ్రీనివాస్‌గౌడ్‌, లక్ష్మారెడ్డి, కడియం శ్రీహరి, మాజీ స్పీకర్‌లు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మధుసూదనాచారి, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోని నేతలు హాజరయ్యారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు