Tuesday, October 15, 2024
spot_img

పేరుకు ఎంపీలం పెత్తనమంతా ఎమ్మెల్యేలదే

తప్పక చదవండి
  • బీఆర్ఎస్‌‌ లో మొదలయిన కొత్త పంచాయితీ
  • లోక్ సభ స్థానాల్లో పోటీకి సిట్టింగ్‌ల విముఖత
  • కాంగ్రెస్‌తో టచ్‌లోకి వెళ్లిన ముగ్గురు ఎంపీలు?
  • బీఆర్ఎస్ కు సవాల్ గా పార్లమెంట్ ఎన్నికలు..
  • ప్రతిష్టాత్మకంగా లోక్ సభను తీసుకున్న కాంగ్రెస్

హైదరాబాద్(ఆదాబ్ హైదరాబాద్ ):- అధికార పార్టీలోకి వెళ్లి ఆ పార్టీ తరఫున పోటీ చేయాలని భావిస్తున్న నేతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో గతంలో సన్నిహిత సంబంధాలు ఉండటం గులాబీ దళానికి కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. గత పదేళ్లుగా ఎదురైన అనుభవాలను తమ సన్నిహితుల దగ్గర ప్రస్తావిస్తున్న ఎంపీలు.. పార్టీపై అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారట. పేరుకు లోకసభ సభ్యులమే అయినప్పటికీ .. ఎమ్మెల్యేల చెప్పు చేతల్లోనే ఉండాల్సి వచ్చేదని దిగాలు పడుతున్నారట.. తమకు ఎలాంటి గుర్తింపు లేదని ఎక్కువ మంది ఎంపీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం… ఎమ్మెల్యేలే ప్రధానంగా భావించే పార్టీలో ఎంపీలుగా కొనసాగడం కుదరదని కొందరు ప్రశ్నిస్తున్నట్లు చెబుతున్నారు.

ఎనుకటికి ఓ సామెత గుర్తొస్తుంది. పిలిచి పిల్లనిస్తానని చెబితే … బాయి కాడికి పోయి స్నానం చేసి వచ్చి చెబుతానని పోయిండట ఎనుకటికి ఓ పెద్దమనిషి . అట్లుంది బీఆర్ఎస్‌‌ పార్టీలోని కొందరి పరిస్థితి. ఆపరేషన్ సక్సెస్ పేషేంట్ డెడ్ అన్న చందంగా తయారయ్యింది తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్‌‌ పరిస్థితి. తమకు ఎదురులేదని విర్రవీగిన నాయకులకు స్థానిక ఎన్నికల్లో ఓటర్లు గట్టిగానే బదులిచ్చారు. ఈ నేపథ్యంలో ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ లోకి చేరికలు మొదలు కానప్పటికీ అధికార పార్టీ వైపు కొందరు ముఖ్య నేతలు రావాలని ఇప్పటికే రాయబారాలు మొదలెట్టారట.. వీరిలో చాలామంది లోక్ సభ ఎన్నికలు పూర్తయ్యే వరకు వేచి చూద్దాం అనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు బీఆర్ఎస్‌‌ లో కొత్త పంచాయితీ మొదలయ్యిందని చెప్పుకుంటున్నారు. సిట్టింగులకు పిలిచి సీటీ ఇస్తామని గులాబీ నేతలు కబురు పంపినా .. మాకొద్దు సర్ ప్లీజ్ అంటున్నారట.. ఖమ్మం, నల్గొండ, వరంగల్, మహబూబ్ నగర్,భువనగిరి జిల్లాలో లోక్ సభ స్థానాలకు అభ్యర్థులపై గందరగోళం నెలకొంది. ఈ జిల్లాల్లో ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు కాంగ్రెస్ పార్టీతో ఇప్పటికే సంప్రదింపులు మొదలు పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. వీరే కాకుండా మరో ఇద్దరు ఎంపీలు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్‌లో చేరే ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు.

- Advertisement -

బీఆర్ఎస్ కు సవాల్ గా పార్లమెంట్ ఎన్నికలు..
భారత రాష్ట్ర సమితి పేరుతో జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించాలని భావించిన బీఆర్ఎస్ కు వచ్చే పార్లమెంట్ ఎన్నికలు సవాల్‌గా మారనున్నాయి. అసెంబ్లీ ఫలితాలు నిరాశకు గురిచేసినా, పార్లమెంటు ఎన్నికల్లో ఓటమిని అధిగమించేలా మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవాలన్న లక్ష్యంగా పావులు కదుపుతోన్న గులాబీ దళానికి.. ఆదిలోనే హంసపాదు ఎదురవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం బీఆర్‌ఎస్ పార్టీకి 9 మంది లోకసభ సభ్యులు ఉన్నారు. ఈ ఎన్నికల్లో మరిన్ని స్థానాలను తమ ఖాతాలో వేసుకునేలా క్షేత్రస్థాయిలో పావులను కదుపుతోంది ఆ పార్టీ అగ్రనాయకత్వం.

కాంగ్రెస్‌తో టచ్‌లో ముగ్గురు ఎంపీలు?
బీఆర్‌ఎస్ ప్రయత్నాలకు సిట్టింగ్ ఎంపీలు గండి కొడుతున్నట్లు జరుగుతున్న ప్రచారం రాజకీయవర్గాల్లో కలకలం రేపుతోంది. కొందరు సిట్టింగ్ ఎంపీలు మళ్లీ పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదన్న ప్రచారం గులాబీ పార్టీ నేతలను తెగ టెన్షన్ పెడుతోందట . ప్రధానంగా ఖమ్మం, నల్గొండ, వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాలో లోక్ సభ స్థానాలకు అభ్యర్థులపై గందరగోళం నెలకొంది. ఈ జిల్లాల్లో ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు కాంగ్రెస్ పార్టీతో సంప్రదింపులు మొదలు పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. వీరే కాకుండా మరో ఇద్దరు ఎంపీలు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్‌లో చేరే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు