Monday, April 29, 2024

పోలీసుల అదుపులో రైస్ మిల్లర్.!

తప్పక చదవండి
  • ప్రభుత్వ వడ్లు అమ్ముకున్న పాత కేసులో రైస్ మిల్లర్ అరెస్ట్!
  • సూర్యాపేటలో జరిగిన ధాన్యం, సి.ఎం.ఆర్ దందాపై మంత్రి సీరియస్..
  • సివిల్ సప్లయ్ కమిషనర్ గా ఐ.పి.ఎస్.. వేట మొదలుపెట్టిన పోలీస్…
  • అవినీతి మిల్లర్లకు ఇకనుంచి జోలపాటే…
  • బి.ఆర్.ఎస్ ప్రభుత్వ హయాంలో పాతరేసిన కేసులను తిరగతోడుతున్న నూతన ప్రభుత్వం
  • ప్రభుత్వ నిర్ణయం పట్ల ప్రజల హర్షనీయం..

ఆదాబ్ హైదరాబాద్, తెలంగాణ బ్యూరో :

గతమంతా తెలంగాణలో జరిగిన రైస్ మాఫియా పై కాంగ్రెస్ ప్రభుత్వం ఉక్కు పాదం మోపెందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగానే రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ కమిషనర్ గా ఒక ఐ.పీ.ఎస్ అధికారిని ఈ సంస్థకు నియమించింది. దీన్ని బట్టి చూస్తే, తెలంగాణ ప్రభుత్వం సివిల్ సప్లయ్ శాఖను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసే దిశగా అడుగులేస్తుందని తేలిపోయింది. గత 2014లో కూడా బి.ఆర్.ఎస్ ప్రభుత్వం పోలీస్ ఐ.పీ.ఎస్ అధికారి అయిన సి.వి ఆనంద్ నియమించింది. నాడు సి.వి ఆనంద్ కూడా తనదైన శైలిలో పాలనను గాడిలో పెట్టే ప్రయత్నం చేశారు.

- Advertisement -

మిల్లర్ల వద్దనున్న ప్రభుత్వ గోనె సంచుల స్కాం, రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా లాంటివి సి.వి ఆనంద్ పనిచేసిన కాలంలోనే బయటికి వచ్చాయి. అప్పుడు మిల్లర్లంతా ఏకమై, నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్రమైన ఒత్తిడిని పెంచి ఎట్టకేలకు సి.వి ఆనంద్ ను ఆ పదవి నుండి దించేశారు. ఇప్పుడున్నది నూతన కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం చూపుతున్న దూకుడు చివరికంటా ప్రదర్శిస్తుందా! లేదా..? అన్నది వేచి చూడాల్సిందే. ఇక వివరాల్లోకి వెళితే.. రాష్ట్ర సివిల్ సప్లయ్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత జిల్లా సూర్యాపేట. ఈ జిల్లాలోనే సి.ఎం.ఆర్ బియ్యం ప్రస్తుత బకాయి 1000 కోట్లు ఉంది. ఇక గతంలో అయితే 2019 నుండి మొదలు మొన్నటి 2023 రబీ సీజన్ వరకు కూడా ధాన్యం కొనుగోళ్ల గోల్ మాల్ దందా వ్యవహారం నడిచింది. ఒక్క తిరుమలగిరి మండలంలోనే సుమారు 20 కోట్ల ధాన్యం కొనుగోళ్ల కుంభకోణం జరిగిందని గడిచిన ఫిబ్రవరిలో “ఆదాబ్” ఆధారాలతో సహా ప్రచురించింది. గత ప్రభుత్వం ఆ విచారణను తొక్కి పట్టింది.

ఇదే రీతిలో గతంలో సూర్యాపేటలో కూడా సి.ఎం.ఆర్ బియ్యం కోసం సివిల్ సప్లయ్ కేటాయించిన ప్రభుత్వ వడ్లను బ్లాక్ మార్కెట్ కు తరలించి, కోట్ల రూపాయలు సొమ్ము చేసుకున్న ఏడుగురు మిల్లర్లపై పోలీసు కేసులు నమోదు చేయించి, సూర్యాపేట జిల్లా సివిల్ సప్లయ్ అధికారులు చేతులు దులిపేసుకున్నారు. సంబంధిత వడ్ల కేసులో (ఎఫ్.ఐ.ఆర్. నెంబర్ 167/2023) పోలీసులు ఇద్దరిని మాత్రమే అరెస్టు చేసి, మిగిలిన ఐదుగురు నిందితులు పరారీలో ఉన్నట్లుగా తమ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. పరారీలో ఉన్నట్లు పేర్కొన్న నిందితులు కొంతమంది ఏకంగా జిల్లా కలెక్టర్ ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరైన విషయం నాడు పెద్ద చర్చాంశానియంగా మారింది. పరారీలో ఉన్న నేరస్తులు జిల్లా సివిల్ సప్లయ్ అధికారులతో చట్టపట్టాలేసుకొని తిరిగిన విషయం అందరికీ తెలిసిందే. కారణం అప్పుడున్న బి.ఆర్.ఎస్ ఎమ్మెల్యే, మంత్రి అండదండలే కావచ్చు.

సివిల్ సప్లయ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తన సొంత జిల్లాలోనే ప్రక్షాళన చేయకుండా, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మిల్లర్ల పాపాలను ఎలా కడిగేది! అనే సంశయంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో మంత్రి చాలా సీరియస్ గానే ఉన్నట్లు వినికిడి. ఐపీఎస్ అధికారికి సివిల్ సప్లయ్ కమిషనర్ గా పోస్టింగ్ ఇచ్చి 24 గంటలు గడవకముందే, పోలీసులు వెంటనే పాత కేసు దుమ్ము దులిపినట్లు కనిపిస్తోంది. ఈ ప్రక్రియలో భాగంగానే ఈ కేసులో ఉన్న ఎ7 ముద్దాయి అయిన జగన్మాత రైస్ మిల్లు ఓనర్ కాశం జగన్ ను చివ్వెంల మండలం, వల్లభాపురంలోని ఆయన సొంత రైస్ మిల్లులోనే సి.సి.ఎస్ పోలీసులు విచారణ పేరుతో అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం! ఎఫ్.ఐ.ఆర్ నెంబర్ 167/2023 తేదీ.13/7/2023 పోలీస్ రిమాండ్ రిపోర్ట్ ప్రకారం ఈ కేసులో ఎ1 నిందితునిగా ఉన్న సుందరి స్రవంతి, ఎ3 ఉపేందర్, ఎ5 సోమచంద్రశేఖర్, ఎ6 కందిబండ ప్రభాకర్, ఎ7 కాశం జగన్ ఈ ఐదుగురు నిందితులు పరారీలో ఉన్నట్లు నాడు పోలీసులు తమ రిమాండ్ రిపోర్టులో చూపించారు. ఇక మిగిలిన ఇద్దరూ సుందరి నాగేశ్వరరావు, యమసాని రామారావులను కోర్టులో ప్రొడ్యూస్ చేసినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.

ప్రభుత్వ కదలికతో పాటు, రాష్ట్ర సివిల్ సప్లయ్ శాఖకు ఒక ఐ.పీ.ఎస్ అధికారిని కమిషనర్ గా ప్రకటించడంతో, సూర్యాపేట పోలీసులు పాత కేసులో ఉన్న నిందితులను వేటాడే పనిలో నిమగ్నమైన ఉన్నట్లు తేలిపోయింది. దీని ద్వారా అక్రమ మిల్లర్లకు మునుముందు ఇక “జోలపాట” తప్పదని తెలుస్తోంది. ఏది ఏమైనా ప్రభుత్వ నిర్ణయం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు