Monday, April 29, 2024

ఇందిరమ్మ రాజ్యమంటే దోపిడీయే

తప్పక చదవండి
  • అరాచకాలకు కేరాఫ్‌ కాంగ్రెస్‌ పాలన
  • వారి పాలన సక్కగ లేకనే ఎన్టీఆర్‌ పార్టీ పెట్టారు
  • తెలంగాణ ఉసురు తీసిందే కాంగ్రెస్‌
  • ఉద్యమానికి అండగా నిలిచిన గడ్డ సిద్దిపేట
  • ఎమ్మెల్యేగా గెలిపించి సిఎంను చేసిన గడ్డ గజ్వెల్‌
  • దేశానికి ఆదర్శంగా గజ్వెల్‌ను తీర్చిదిద్దాను
  • ప్రతి ఒక్కరూ ఇక్కడి అభివృద్దిని గుర్తిస్తున్నారు
  • మరింతగా అభివృద్దితో ముందుకు సాగేలా చేస్తా
  • వరంగల్‌, గజ్వెల్‌ ప్రజాశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌

ఇందిరమ్మ రాజ్యమంటే ఎన్‌కౌంటర్లు, ఎమర్జెన్సీలు, దోపిడీలని సిఎం కెసిఆర్‌ ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ నేతలు తమ పార్టీ గెలిస్తే మళ్ల ఇందిరమ్మ రాజ్యం తెస్తం అంటున్నరు. ఇందిరమ్మ రాజ్యం అంత దరిద్రపు రాజ్యం ఇంకోటి లేదు. ఇందిరమ్మ రాజ్యంలో ఎన్నో అరాచకాలు జరిగినయ్‌. తెలంగాణ కోసం ఉద్యమించిన 400 మందిని కాల్చిచంపిండ్రు. ఎమర్జెన్సీ పెట్టి అందర్నీ జైళ్లల్ల పెట్టిండ్రు. అసుంటి రాజ్యం మళ్ల గావాల్నా..? కాంగ్రెస్‌ పార్టీ ఉన్న తెలంగాణను ఊడగొట్టి 58 ఏండ్లు మనలను గోసపెట్టింది. అది సక్కగ ఉంటే ఎన్టీఆర్‌ పార్టీ పెట్టేవారు కాదు..కిలో రెండురూపాయల బియ్యం ఇచ్చేవారు కాదన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ కేఎంసీ గ్రౌడ్స్‌లో నిర్వహించిన వరంగల్‌ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని ప్రసంగించారు. 1969 ఉద్యమంలో 400 మందిని చంపిన ఘనత కాంగ్రెస్‌ పార్టీకి దక్కిందని విమర్శించారు. ఆరోజు ఆజంజాహి మిల్లును కాంగ్రెస్‌ అమ్ముకుంటే ఇప్పుడు టీఆర్‌ఎస్‌ వచ్చాక కాకతీయ మెగా టెక్ట్స్‌టైల్స్‌ పార్క్‌ నిర్మిస్తున్నామని తెలిపారు. లక్షన్నర ఉద్యోగాలు వరంగల్‌ జిల్లాలో కల్పించబోతున్నామన్నారు. రాష్ట్రం ఏర్పడ్డాకే రోడ్లన్నీ విస్తరించుకున్నామని చెప్పారు. 24 అంతస్తులతో అత్యంత అత్యాధునిక హంగులతో ఆస్పత్రి నిర్మించుకున్నామని చెప్పారు. తూర్పు, పశ్చిమ అభ్యర్థులు బీసీ బిడ్డలే అని.. వారిని కచ్చితంగా గెలిపించాలని సీఎం కేసీఆర్‌ కోరారు. వరంగల్‌ను అన్నిరంగాల్లో అభివృద్ది చేశామని అన్నారు. తెలంగాణ చరిత్ర వైభవానికి, వెయ్యేండ్ల తెలంగాణ చరిత్రకు సాక్షీభూతంగా ఉన్న ఈ వరంగల్‌ వీరభూమికి తాను శిరసు వంచి నమస్కరిస్తున్నానని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో అనేక కీలక ఘట్టాలకు వరంగల్‌ పట్టణమే వేదికగా నిలిచిందని గుర్తు చేశారు. ఉద్యమంలో అతి భారీ బహిరంగ సభ ఈ వరంగల్‌ నగరంలోనే జరిగిందని, భద్రకాళీమాత ఆశీర్వాదంతో మనం తెలంగాణ సాధించుకున్నమని అన్నారు. అమ్మవారికి కిరీట ధారణ చేసి తాను మొక్కు కూడా చెల్లించుకున్నానని తెలిపారు. అన్నింటికన్నా మించి వరంగల్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గౌరవం ఏందంటే.. రాష్ట్ర రాజముద్రలో కాకతీయ కళాతోరణం పెట్టడం, చెరువులు బాగు చేసుకునే కార్యక్రమానికి మిషన్‌ కాకతీయ అని పేరు పెట్టడం. ఇది కాకతీయ రాజులకు తెలంగాణ ప్రజలు అర్పించిన నిజమైన నివాళి అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. నేను ఉద్యమాన్ని తలకెత్తుకున్న సందర్భంలో నన్ను నిండు మనసుతో ఆశీర్వదించిన ప్రజాకవి కాళోజీ గారిని, నాకు ఆ రోజు అండగా నిలిచిన ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ గారిని నేను మనఃపూర్వకంగా స్మరించుకుంటున్నా. ఈ సందర్భంగా నేను చెప్పేదేందంటే ఓటు వేసేటప్పుడు బాగా ఆలోచించాలె. మీరు వేసే ఓటు తెలంగాణతో పాటు వరంగల్‌ ఈస్ట్‌, వెస్ట్‌ నియోజకవర్గాల ఐదేండ్ల భవిష్యత్తును నిర్ణయిస్తది. కాబట్టి అసుంటి ఓటును ఆషామాషీగా వేయవద్దు. మంచి అభ్యర్థికి, మంచి పార్టీకి వేయాలె. అప్పుడే మంచి జరుగుతది. కాబట్టి మీ గ్రామాలల్లో బాగా చర్చించి, మంచి పార్టీ ఏదో, మంచి అభ్యర్థి ఎవరో తేల్చుకుని ఓటేయాలె’ అని సూచించారు. ’కొట్లాడంగ, కొట్లాడంగ ఆఖరికి తెలంగాణ ఇచ్చిండ్రు. తెలంగాణ ఏర్పడంగనే బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. ఆసరా పెన్షన్‌లు,
కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌, రైతబంధు, రైతుబీమా లాంటి పథకాలు తీసుకొచ్చినం. అన్ని వర్గాల వారికి న్యాయం జరిగేలా తాము నిర్ణయాలు చేసినం’ అని చెప్పారు.

గజ్వెల్‌ ప్రజాశీర్వాద సభలో సిఎం కెసిఆర్‌
తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిన తర్వాత ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించేందుకు తనకు బలాన్ని ఇచ్చిన గడ్డ సిద్దిపేట అయితే… ఆ తర్వాత.. సాధించిన తెలంగాణను తీర్చిదిద్దడం కోసం తనను ఎమ్మెల్యేను చేసి, రాష్ట్ర ముఖ్యమంత్రిని చేసిన గడ్డ ఈ గజ్వేల్‌ అని సిఎం కెసిఆర్‌ అన్నారు. గజ్వేల్‌ నా గౌరవాన్ని పెంచింది. నన్ను ఈ స్థాయికి తెచ్చింది. గత తొమ్మిదిన్నర ఏండ్లుగా నేను గజ్వేల్‌ ప్రాంతం అభివృద్ధికి శాయశక్తులా కృషి చేశాను. ఇప్పుడే పెద్దలు ప్రతాపరెడ్డి గారు మీకు అన్నీ వివరించారు. నేను మళ్లా అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో మంచి నీళ్ల కోసం నానా ఇబ్బందులు పడిన గజ్వేల్‌కు శాశ్వతంగా ఆ బాధ తీరిపోయింది. సాగు నీటి కోసం ఎన్నో ఇబ్బందులు పడిన గజ్వేల్‌కు ప్రాజెక్టులు, కాలువలు రావడంతో ఆ బాధ కూడా తీరిపోయింది’ అని సీఎం అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గజ్వేల్‌ నియోజకవర్గాన్ని పొగడ్తల్లో ముంచెత్తారు. గజ్వేల్‌ నియోజక వర్గంపై తనకు ఉన్న అభిమానాన్ని, మమకారాన్ని చాటుకున్నారు. గజ్వేల్‌ తన గౌరవాన్ని పెంచిందని, తనను ఈ స్థాయికి తెచ్చిందని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం గజ్వేల్‌లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం ప్రసంగించారు. ’మన గజ్వేల్‌కు రైలు వస్తదని ఎన్నడూ అనుకోలేదు, కానీ రైలు కూడా వచ్చేసింది. గజ్వేల్‌ ఒక గుర్తింపు కలిగిన నియోజకవర్గంగా ఎదిగింది. ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి గజ్వేల్‌ మోడల్‌ అభివృద్ధిని చూడటానికి వస్తున్నరు. మన ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ కావచ్చు, మన అడవుల పునరుద్ధరణ కావచ్చు, మన మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు కావచ్చు.. ఇట్ల అనేక రకాల పనులను చూడటానికి ఇయ్యాల గజ్వేల్‌కు వస్తున్నరు. మిషన్‌ భగీరథ పథకాన్ని గురించి తెలుసుకోవడానికి కోమటిబండకు రాని రాష్ట్రమే భారత దేశంలో లేదు. అన్నింటికంటే ముఖ్యంగా ఇప్పుడు మనం తాగుతు న్నది, సాగుకు వినియోగిస్తున్నది మనందరం ఎంతో పవిత్రంగా భావించే గోదావరి జలాలు. ఇలా ఒక రోల్‌ మోడల్‌గా గజ్వేల్‌ ఎదిగింది. అయితే ఇప్పటికే అయ్యింది చాలా గొప్ప అని మనం సంతోషపడితే కాదు, ఇంకా చాలా అభివృద్ధి కావాల్సి ఉందని సీఎం చెప్పారు. గత 24 ఏండ్లుగా తెలంగాణ ఆశగా, శ్వాసగా బతుకుతున్నానని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. గజ్వేల్‌ నుంచి మీరు అవకాశం ఇచ్చి రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసి పంపిస్తే ఈ రాష్ట్రం కోసం కష్టపడ్డాను, కృషి చేశాను. అవన్నీ ప్రజల కండ్ల ముందు కనబడుతున్నాయి అని కేసీఆర్‌ తెలిపారు. ఈ నియోజకవర్గం నుంచి కేసీఆర్‌ పోటీలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఇది నా చివరి సభ.. ఇది 96వ సభ. తెలంగాణ రాష్ట్రం గురించి కూడా ఒకసారి చెప్పాలి. గజ్వేల్‌ నుంచి మీరు అవకాశం ఇచ్చి రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసి పంపిస్తే ఈ రాష్ట్రం కోసం కష్టపడ్డాను. కృషి చేశాను. అవన్నీ ప్రజల కండ్ల ముందు కనబడుతున్నాయి. ఇక్కడ వచ్చేటటువంటి ట్రిపుల్‌ ఆర్‌ కూడా మన గజ్వేల్‌ మీదుగానే రాబోతుందని సంతోషంగా తెలియజేస్తున్నా. 24 ఏండ్లుగా తెలంగాణనే ఆశగా, శ్వాసగా బతుకుతున్నాను. ఆ విషయం మీ అందరికి తెలుసు అని కేసీఆర్‌ పేర్కొన్నారు. ఉద్యమ సందర్భంలో తెలంగాదణ ఎట్ల తేవాలని ఆరాట పడ్డాను. పోరాటం చేశాను. కాంగ్రెస్‌ పార్టీ మోసం చేసినా తట్టుకోని, నిలబడి, మొండిగా, చివరకి మళ్లీ ధోకా చేశారని గుర్తించి, ఇక తప్పదనే నమ్మకానికి వచ్చి కేసీఆర్‌ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అని ఆమరణ దీక్ష చేస్తే, 33 పార్టీలు మనకు అండగా వస్తే అప్పుడు దిగొచ్చింది ఈ కాంగ్రెస్‌ పార్టీ. ఇవాళ కాంగ్రెస్‌ పార్టీ అనేక విషయాలు మాట్లాడుతోంది. మేం గెలిస్తే మళ్ల ఇందిరమ్మ రాజ్యం తెస్తమని చెబుతున్నారు. ఇందిరమ్మ రాజ్యం ఎవరికి కావాలి ఇప్పుడు. అసలు నాకర్థం కాదు. ఇందిరమ్మ రాజ్యం సక్కగా ఉంటే ఎన్టీ రామారావు పార్టీ పెట్టి 2 రూపాయాలకే కిలో బియ్యం ఎందుకు ఇయ్యాల్సి వచ్చింది. అప్పటి వరకు మన రాష్ట్రం ఆకలి కడుపుతోనే ఉన్నది కదా..? ఇందిరమ్మ రాజ్యంలో ఎమర్జెన్సీ రోజులు వచ్చాయి. ఇందిరమ్మ రాజ్యంలోనే కదా ఎన్‌కౌంటర్లు, రక్తపాతం జరిగింది. మన తెలంగాణ ఉద్యమంలో 1969లో 400 మందిని కాల్చి చంపింది. ఇవన్నీ కావాలని మళ్లీ కోరుతున్నారు. ఇది ఎట్ల ఉందంటే తద్దినం ఉందని భోజనానికి పిలిస్తే రోజు మీ ఇంట్లో ఇట్లనే జరగాలని అన్నడట యెన్కటికి ఒకడు. ఇప్పుడు ఆ కాంగ్రెస్‌ గెలిచేది లేదు సచ్చేది లేదు. కానీ గెలిస్తే మటుకు ఇందిరమ్మ రాజ్యం తెస్తమని మాట్లాడుతున్నారు అని కేసీఆర్‌ ధ్వజమెత్తారు. బిజెపి ఒక్కటంటే ఒక్క పనిచేయని దానికి ఎందుకు ఓటేయాలని అన్నారు. బిజెపికి ఓటేసి తప్పు చేయొద్దన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు