Sunday, April 28, 2024

కాళేశ్వరం అవినీతిపై కాంగ్రెస్‌ దోబూచులాట

తప్పక చదవండి
  • మాజీ సీఎం కేసీఆర్‌ను రక్షించే పనిలో రేవంత్‌ రెడ్డి
  • సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదని ప్రశ్న
  • నిజాయితీ ఉంటే సీబీఐ విచారణకు లేఖ రాయాలి
  • మీడియా సమావేశంలో కేంద్రమంత్రి, బీజేపీ నేత కిషన్‌ రెడ్డి

హైదరాబాద్‌ : తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో బిఆర్‌ఎస్‌ ప్రభుత్వ అవినీతి పట్ల అనేక సార్లు ప్రస్తావించిన నేతలు ఇప్పుడు పట్టించుకోవడం లేదని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షులు కిషన్‌ రెడ్డి అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వంపై విచారణ కోరుతూ కేంద్రానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం లేఖ ఎందుకు రాయటం లేదని ప్రశ్నించారు. సీఎం రేవంత్‌ లేఖ రాస్తే.. 48 గంటల్లో కేంద్రం సీబీఐ విచారణ చేపడుతోందన్నారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ఒక్కటి కాదంటే.. సీబీఐ విచారణ కోరాలన్నారు. న్యాయ విచారణ పేరుతో కేసీఆర్‌కు మేలు చేసేలా కాంగ్రెస్‌ ప్రభుత్వం వ్యవహరిస్తోందని తెలంగాణ బీజేపీ చీఫ్‌ విమర్శించారు. ప్రధానంగా రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్తు ఏంటని ప్రశ్నించారు. లక్షకోట్ల రూపాయల అవినీతి ప్రాజెక్టు విషయంలో ఎందుకు సీబీఐ విచారణకు కోరడం లేదని కిషన్‌ రెడ్డి మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ కుంగిందన్నారు. అన్నారం ప్రాజెక్టు కూడా గ్యారేంటీ లేకుండా పోయిందన్నారు. ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ఇమేజ్‌ను గోదావరి పాలు చేసిందని ఎద్దేవా చేశారు. అంతేకాదు ఈ ప్రాజెక్టు గురించి మరింత విశ్లేషణ చేయాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ ప్రాజెక్టు గురించి 20 అంశాలపైన నేషనల్‌ డ్యాం సెప్టీ అథారిటీ ప్రశ్నలు అడుగగా ప్రభుత్వం మారినా కూడా వివరాలు అందజేయలేదని గుర్తు చేశారు. 20 అంశాలలో 11 అంశాలకే అరకొర సమాధానాలు చెప్పారని వెల్లడిరచారు. ప్రస్తుత ముఖ్యముంత్రి రేవంత్‌ రెడ్డి ఎన్నికలకు ముందు మాట్లాడిన అంశాలు ఎందుకు అమలు చేయడం లేదన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో జరిగిన అవినీతి ప్రాజెక్టులు, స్కాంలపై దర్యాప్తు చేస్తామని చెప్పారని గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టు కోసం ఖర్చు పెట్టిన కోట్లాది రూపాయల గురించి ఎందుకు మరచిపోయారని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో అసలు కాళేశ్వరం ప్రాజెక్టులో నష్టపోయిన పిల్లర్స్‌ మళ్లీ కడతారా లేదా నేషనల్‌ డ్యాం సెప్టీ అథారిటీ సలహాలు తీసుకుంటారో చెప్పాలని కిషన్‌ రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఈ అంశాన్ని న్యాయ విచారణ పేరుతో ఆలస్యం చేస్తోందన్నారు. కాళేశ్వరం విషయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కాంగ్రెస్‌ ప్రభుత్వం కాపాడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌ రెడ్డి ప్రభుత్వానికి పూర్తిస్థాయి మెజారిటీ లేదని… అందుకే బీఆర్‌ఎస్‌తో అవగాహన కుదుర్చుకుందని ఆరోపించారు. తుమ్మితే ఊడిపోయే ప్రభుత్వం కాంగ్రెస్‌ ప్రభుత్వం అంటూ ఎద్దేవా చేశారు. ఎంఐఎం మధ్యవర్తిత్వంతో మాజీ సీఎం, ప్రస్తుత సీఎంల మధ్య అవగాహన కుదిరిందన్నారు. కాంగ్రెస్‌, ఎంఐఎం, బీఆర్‌ఎస్‌.. మూడు పార్టీలకు అంగీకారానికొచ్చాయన్నారు. అవినీతి, కుటుంబ పాలన వలనే ఎన్నికలల్లో ప్రజలు కేసీఆర్‌ను ఓడిరచారన్నారు. కాంగ్రెస్‌ పార్టీ మీద ప్రేమతో ప్రజలు అధికారం ఇవ్వలేదని తెలిపారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ, కేసీఆర్‌ పీడ విరగడ కావాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్‌కు అధికారమిచ్చారని కిషన్‌రెడ్డి వ్యాఖ్యలు చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు