Monday, April 29, 2024

ఐదేళ్ల భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు ఇవి

తప్పక చదవండి
  • ఆలోచించి జాగ్రత్తగా ఓటేయాలి
  • దళితబంధును అడ్డుకున్న కాంగ్రెస్‌ దరిద్రులు
  • వారు చేయని లాలూచి పనులు లేవు
  • అసైన్డ్‌ భూములకు పట్టాలు ఇప్పించే బాధ్యత నాదే
  • షాద్‌నగర్‌ ప్రజాశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌

వచ్చే ఐదేళ్ల భవిష్యత్‌ ఎంతో ముఖ్యమని, అందువల్ల ఆలోచించి ప్రజలు ఓటేయాలని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు. రైతుబంధును ఆపించిన ఘనులు కాంగ్రెస్‌ వాళ్లని మండిపడ్డారు. అధికారంలోకి రాగానే యధావిధిగా దీనిని అమలు చేస్తామని అన్నారు. అలాగే అసైన్డ్‌ భూములకు తొలి కేబినేట్‌లోనే పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేపడతామని అన్నారు. యాసంగి రైతుబంధు నిధులను రైతుల ఖాతాల్లో వేయకుండా అడ్డుకుంటున్న కాంగ్రెస్‌ పార్టీపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ దుమ్మెత్తి పోశారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇచ్చే రైతుబంధును తీసుకుంటూ.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి ఓటేయండని తిరుగుతున్న ఆ పార్టీ నేతలు, కార్యకర్తలకు సిగ్గుమానం ఏమైనా ఉందా..? అని ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం షాద్‌నగర్‌లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం ప్రసంగించారు. ‘కాంగ్రెసోళ్లు ఎన్నికల్లో గెలుపు కోసం చెయ్యని లాలూచీ పనులు లేవు. ఎన్ని అడ్డమైన కుట్రలు చేయాల్నో అన్నీ చేస్తున్నరు. రైతుబంధు దుబారా అంటరు. కరెంటు వృథా అంటరు. ధరణిని తీసేస్తమంటరు. ఇసుంటి లంగ మాటలు చాలా మాట్లాడుతున్నరు. లంగ పనులు చాలా చేస్తున్నరు. ఈ యాసంగికి రైతుల ఖాతాల్లో పడాల్సిన రైతుబంధు ఎయ్యకుంట కాంగ్రెసోళ్లు ఆపిండ్రు. రైతుబంధు ఆపాల్నని ఎన్నికల కమిషన్‌కు దరఖాస్తు ఇచ్చి అడ్డంపడ్డరు. దాంతోటి నేను అడిగితే ఒకరోజులో రైతుబంధు ఎయ్యిండ్రని ఈసీ పర్మిషన్‌ ఇచ్చింది. పర్మిషన్‌ ఇయ్యంగనే వద్దువద్దని మళ్ల దరఖాస్తు ఇచ్చిండ్రు. దాంతోటి ఈసీ మళ్ల ఆపిందని సీఎం కెసిఆర్‌ చెప్పారు. ‘కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలల్ల కూడా రైతుబంధు తీసుకునేటోళ్లు చాలా మంది ఉన్నరు. వాళ్లకు ఏమన్న సిగ్గు, మానం ఉందా..? అని నేను అడుగుతున్న. విూ ఖాతాల్లో పడాల్సిన రైతుబంధును పడకుండా అడ్డుకున్న కాంగ్రెస్‌ విూరెట్ల మద్దతిస్తరంటున్నా. ఇసుంటి కాంగ్రెస్‌కు మద్దితిస్తే విూ కొంప గూడా కొల్లారం కాదా..? విూకు రావాల్సిన రైతుబంధు ఆగిపోదా..? కాబట్టి ఇతర ప్రజలతోపాటు కాంగ్రెస్‌ కార్యకర్తలు గూడా ఈ విషయంపై బాగా ఆలోచించాలె. కాంగ్రెస్‌ కుట్రలను గుర్తెరిగి ఎన్నికల్లో ఓడగొట్టాలె. పొరపాటున కాంగ్రెస్‌ గెలిస్తే రాష్ట్రం మళ్ల ఎనకబడుతది. మళ్ల ఎనకటి దరిద్రపు రోజులే వస్తయ్‌’ అన్నారు.షాద్‌నగర్‌ వరకు మెట్రో తీసుకొచ్చే బాధ్యత నాది అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. ఇక్కడి వరకు మెట్రో వస్తే విూ భూముల ధరలు మూడిరతలు పెరుగుతాయని కేసీఆర్‌ అన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి అంజయ్య యాదవ్‌ వజ్రం తునక లాంటి మనిషి. ఆయన చీమకు దోమకు కూడా అన్యాయం చేసే మనిషి కాదు. ఇలాంటి ఎమ్మెల్యే చాలా తక్కువ ఉంటరు రాష్ట్రం మొత్తంలో. మొదట్నుంచి నాతో పాటు నమ్మిన బంటుగా ఉన్నారు. ఇవాళ వరకు ఎలాంటి చెడ్డ పని చేయలేదు. నా నియోజకవర్గం నాకు కావాలని తండ్లాడుతాడు. అంజయ్య లాంటి ఎమ్మెల్యే ఉంటే షాద్‌నగర్‌కు ఏదంటే అది వస్తది. విూరు సిటీ పక్కకే ఉన్నారు. మేం మెట్రో రైలు గురించి ఆలోచన చేస్తున్నాం. షాద్‌నగర్‌ దాకా మెట్రో రావాలని అంజయ్య యాదవ్‌ పట్టుబట్టారు. ఆయన పట్టుబట్టి షాద్‌నగర్‌ వరకు మెట్రో పెట్టించారు. షాద్‌నగర్‌ వరకు మెట్రో తీసుకొచ్చే బాధ్యత నాది. విూరు అంజయ్య యాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపించండి. ఒక మెడికల్‌ కాలేజీ రావాలని కోరారు. నేను తప్పకుండా మెడికల్‌ కాలేజీ మంజూరు చేస్తాను. పీజీ కాలేజీలు కొన్ని అడిగారు. విూకు చాలా విద్యాసంస్థలు వస్తాయి హైదరాబాద్‌ పక్కకే ఉంటది కాబట్టి. ఒకసారి మెట్రో వస్తుందని తెలిస్తే విూ భూముల ధరలు మూడిరతలు పెరుగుతాయి. అన్ని విద్యాసంస్థలు వస్తాయి. కాలుష్య రహిత పరిశ్రమలు కూడా తరలివస్తాయి. దండం పెట్టుకుంట వస్తాయి. షాద్‌నగర్‌కు మెట్రో వస్తుందని తెలిసిన తర్వాత దీనికి డిమాండ్‌ తారాజువ్వాలా లేచిపోయింది. హైదరాబాద్‌ సంకలో ఉన్నారు కాబట్టి.. అంజయ్య లాంటి ఎమ్మెల్యే ఉంటే ప్రజల కోసం పాటు పడే ఎమ్మెల్యే ఉంటే విూ కోరికలన్నీ నెరవేరుతాయి అని కేసీఆర్‌ తెలిపారు. లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌ గురించి ఆనాడు నన్ను ఎవరూ అడగలేదు. చెప్పలేదు. తెలంగాణ ఉద్యమంలో నేను కనిపెట్టిన పాయింట్‌. తెలంగాణలో హైయేస్ట్‌ పాయింట్‌ కొందుర్గు మండలంలోని మన లక్ష్మీదేవిపల్లి. అక్కడ రిజర్వాయర్‌ వస్తే నెత్తి విూద కుండలా ఉంటుంది. ఇదే కాంగ్రెస్‌ నాయకులు పాలమూరు ఎత్తిపోతలపై గ్రీన్‌ ట్రిబ్యునల్‌కు వెళ్లి స్టేలు తీసుకొచ్చి, 196 కేసులు పెట్టారు. చాలా కాలం కొట్లాడిన తర్వాత కేసులు క్లియర్‌ అయ్యాయి. ఒక పంపు హౌస్‌ ప్రారంభించుకున్నాం. ఇక్కడ పెద్దవాగు విూద కట్టేది కాదు లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌. అది రింగ్‌ బండ వేసుకుని కట్టుకుంటాం. అది నిమిషాల్లో అయిపోతది పెద్ద సమస్య కాదు. విూకు ఎక్కువ భూములు మునగకుండా, తక్కువ భూములు మునిగేలా ఆ రిజర్వాయర్‌ తెచ్చి ఇచ్చే బాధ్యత నాది. తెలంగాణ ఇరిగేషన్‌లో అది నా ప్లాన్‌. అది ఎన్నటికైనా రావాల్సిందే. ఒక పూట వెనుక ముందు. ఈసారి మనమే గెలుస్తున్నాం. ఈసారి తప్పకుండా ఆ పనులు స్టార్ట్‌ చేయిస్తానని మనవి చేస్తున్నా. ఉద్ధండపూర్‌ నుంచి కూడా విూకు నీళ్లు వస్తాయి. సాగు నీళ్ల బాధ కూడా తప్పుతది అని కేసీఆర్‌ తెలిపారు. అనేక రకాలుగా షాద్‌నగర్‌ అభివృద్ధి కావడానికి అవకాశం ఉంది. అదే కాంగ్రెస్‌ చేతిలో పెడితే ఆగమై పోయే అవకాశం ఉంటుంది. అంజయ్య యాదవ్‌ అజాత శత్రువు. ఈగకు, దోమకు కూడా అన్యాయం చేసే మనిషి కాదు. ప్రజల కోసం పని చేస్తడు. ఇక్కడే ఉంటడు. ప్రజల మధ్యనే ఉంటడు. ఇటువంటి మంచి మనిషిని గ్యారెంటీగా కాపాడుకోవాలి. ఇక్కడ అభివృద్ధి బాధ్యత వందకు వంద శాతం నాది. నూటికి నూరు శాతం బీఆర్‌ఎస్‌ గవర్నమెంటే వస్తుంది. అందులో అనుమానం అవసరం లేదు అని కేసీఆర్‌ స్పష్టం చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు