Monday, April 29, 2024

అధికారం ఎవరిదో తేల్చే స్వింగ్‌ సీట్లు

తప్పక చదవండి

జైపూర్‌ : ఇటీవలి కాలంలో రాజస్తాన్‌ ప్రజలు వరుసగా రెండుసార్లు ఏ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టిన దాఖలాలు లేవు. కాంగ్రెస్‌, బీజేపీ మధ్య హోరాహోరీ పోరాటంతో చెరో అయిదేళ్లు అధికారాన్ని పంచుకుంటున్నాయి. పార్టీ విజయాల్లో స్వింగ్‌ స్థానాలే కీలకంగా మారి అధికారంలోకి ఎవరు రావాలో నిర్ణయిస్తున్నాయి. గత దశాబ్ద కాలంలో ఈ స్వింగ్‌ స్థానాల్లో ఏ పార్టీకి ఎలా ఉంది ? ఈ సారి ఓటర్లు ఎవరి వైపు ఉండబోతున్నారనేది ఆసక్తిని రేకిస్తోంది. రాజస్తాన్‌లో 200 అసెంబ్లీ స్థానాలకు గాను ఏకంగా 166 నియోజకవర్గాల్లో ఓటరు నాడి పట్టుకోవడం కష్టంగా మారింది. ప్రతీసారి ఆ నియోజకవర్గాల్లో ప్రజలు పార్టీని మార్చేస్తూ ఉంటారు. ఈ నియోజకవర్గాల్లో గత కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్‌పై బీజేపీ తన పట్టు ప్రదర్శిస్తోంది. ప్రజల రాజకీయ ప్రాధాన్యా లేంటో తలపండిన రాజకీయ నాయకులకి కూడా అంతుపట్టడం లేదు. 2008లో బీజేపీ ఆధిక్యం ప్రదర్శించినా 2018లో కాంగ్రెస్‌ అనూహ్యంగా పుంజుకున్నప్పటికీ స్వింగ్‌ స్థానాలు మాత్రం రాజస్తాన్‌ రాజకీయాల్లో వైల్డ్‌ కార్డులుగా మారాయి. 2018లో స్వింగ్‌ స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు, ఇతర పార్టీలు కూడా తమ ఉనికిని చాటాయి. ఎవరి ఊహకు అందని విధంగా 12 నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధిస్తే, బీఎస్పీ రెండు స్థానాలు, సీపీఎం ఒక్క స్థానాన్ని దక్కించు కున్నాయి. స్వింగ్‌ స్థానాల్లో ఓటరు ఒక్కోసారి ఒక్కో రకంగా తీర్పు ఇస్తూ ఉండడంతో ఆ నియోజ కవర్గాలపై దృష్టి పెట్టడం రాజకీయపార్టీలకు అనివార్యంగా మారింది. ఎన్నికల వ్యూహాలన్నీ ఆ స్థా నాల ప్రాధాన్యాలకనుగుణంగానే రచిస్తున్నాయి. ఆ నియోజకవర్గాల్లో ఓటర్లను ఆకట్టుకునేలా వ్యూ హాలు రచించడం అత్యంత కీలకంగా మారింది. ఈ స్థానాల్లో వచ్చే ఫలితాలే రాష్ట్ర రాజకీ యాలను మలుపు తిప్పుతుంటాయి. 2008, 2013, 2018 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే భారతీయ జనతా పార్టీ 28 నియోజకవర్గాల్లో వరుసగా నెగ్గుతూ వస్తోంది. కాంగ్రెస్‌ పార్టీకి అయిదు స్థానాల్లో వరుసగా విజయం సాధిస్తూ వచ్చింది. 2008లో స్వింగ్‌ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌, బీజేపీ పోటాపోటీగా నిలిస్తే 2013 ఎన్నికల నాటికి బీజేపీ పూర్తిగా తన పట్టు బిగించింది. ఇంచుమించుగా క్లీన్‌ స్వీప్‌ చేసింది. గత ఎన్నికల నాటికి కాంగ్రెస్‌ మళ్లీ పుంజుకున్నప్పటికీ స్వతంత్ర అభ్యర్థులు అధికంగా విజయం సాధించడం చూస్తుంటే ఓటర్లు స్థానిక అంశాలకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. దీంతో కాంగ్రెస్‌, బీజేపీ ఈ సారి ఈ స్వింగ్‌ స్థానాల్లో పట్టు బిగించి అధికారం దక్కించుకోవాలని తహతహలాడుతున్నాయి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు