Monday, April 29, 2024

‘ఇండియా’ కూటమికి రాహుల్‌ నామినేట్‌.. ?

తప్పక చదవండి

2024 లోక్‌సభ ఎన్నికల్లో ‘ఇండియా’ కూటమి అధికారంలోకి వస్తే ప్రధానిగా ఎవరిని ఎంపిక చేస్తారన్న దానిపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యుడు శశి థరూర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే.. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లేదా, ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీని నామినేట్‌ చేసే అవకాశం ఉందని భావిస్తున్నట్లు చెప్పారు. కేంద్రంలోని అధికార ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా దేశంలోని 28 ప్రతిపక్ష పార్టీలు కూటమిగా ఏర్పడి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఆయా పార్టీలన్నీ ‘ఇండియా’ పేరుతో కూటమిని ఏర్పాటు చేశాయి. ఇందులో కాంగ్రెస్ తో పాటు జనతాదళ్, ఆర్జేడీ, టీఎంసీ, ఎన్సీపీ, ఎస్పీ సహా పలు ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో ఎన్డీయే సర్కార్‌ను ఎలాగైనా గద్దె దించాలని కంకణం కట్టుకున్నాయి. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేని మట్టికరిపించి కేంద్రంలో విపక్షాల కూటమి ‘ఇండియా’ అధికారంలోకి వచ్చే అకవాశాలు ఉన్నాయని శశిథరూర్‌ అన్నారు. ‘2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో ‘ఇండియా’ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. ఇది ఒక పార్టీ కాదు. అందుకని ఫలితం వెలువడిన తర్వాత కూటమిలోని అన్ని పార్టీల నాయకులు కలిసి ఒకరిని ఎంపిక చేసుకోవాలి. ‘ఇండియా’ కూటమి నుంచి ప్రధాని అభ్యర్థిగా.. కూటమిలోని అన్ని పార్టీలకు ఆమోదయోగ్యమైన అభ్యర్థిని ఎంపిక చేయాల్సి ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్‌ అధిష్టానం మల్లికార్జున ఖర్గే లేదా, రాహుల్‌ గాంధీలో ఎవరో ఒకరిని ప్రధాని అభ్యర్థిగా ఎంపిక చేస్తుందని నేను భావిస్తున్నాను’ అని థరూర్‌ వివరించారు. ఇక ప్రధానిగా ఖర్గేకి అవకాశం ఇస్తే దేశానికి తొలి దళిత ప్రధానిగా ఆయన రికార్డు సృష్టిస్తారని అన్నారు. ఖర్గే వైపు మొగ్గుచూపడానికి ఇది ప్రధాన కారణంగా నిలుస్తుందని చెప్పారు. అయితే, కాంగ్రెస్‌ పార్టీ కుటుంబ పార్టీ కావడంతో రాహుల్‌ గాంధీని ప్రధానిని చేసే అవకాశం లేకపోలేదని శశి థరూర్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు