Friday, July 26, 2024

త్రిముఖ పోరుమూడు ఎంపీ స్థానాలపైనే ప్రధాన పార్టీల నేతల గురి

తప్పక చదవండి
  • ఖమ్మం నుంచి బరిలోకి సోనియాగాంధీ
  • మల్కాజ్‌గిరి నుంచి పోటిలో ప్రధాని మోదీ
  • బీఆర్‌ఎస్‌ నుంచి కేసీఆర్‌ను బరిలోకి..
  • పార్టీ ఆఫీస్‌లకుక్యూ కడుతున్న అశావాహులు
  • రసవత్తరంగా మారిన పార్లమెంట్‌ రాజకీయం
  • లోక్‌సభ సీటుపై ఆశలు పెట్టుకున్న బీఆర్‌ఎస్‌
  • మోడీ విజయం ఖాయమంటున్న టీ బీజేపీ
  • హస్తానికి ఎదురులేదంటున్న తెలంగాణ కాంగ్రెస్‌

హైదరాబాద్‌ :- లోక్‌ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. తెలంగాణలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. పార్లమెంట్‌ ఎన్నికల్లో పట్టు సాధించేందుకు మూడు ప్రధాన పార్టీలు తమ వ్యూహలకు పదునుపెడుతున్నాయి. అయితే తెలంగాణలోని మూడు స్థానాలపై మాత్రమే ప్రధాన పార్టీలు ప్రత్యేక దృష్టి సారించాయి. ఈ సీట్లను ఎలాగైనా తమ ఖాతాలో వేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాయి. ఇక్కడి నుంచి బరిలో దిగే వారు సైతం అగ్రనేతలు కావడంతో పార్టీల అంచనాలు మించిపోతున్నాయి.

ఖమ్మంపై కాంగ్రెస్‌ గురి..
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంట్‌ ఎన్నికలపై గురి పెట్టింది. మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో వ్యూహాలకు పదును పెడుతోంది. ప్రధానంగా ఖమ్మం లోక్‌ సభ స్థానంపై ఫోకస్‌ పెంచిన హస్తం పార్టీ.. ఇక్కడి నుంచి సోనియాగాంధీని బరిలో దింపాలని చూస్తోంది. ఇప్పటికే పార్టీ పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీ, కాంగ్రెస్‌ విస్తృతస్థాయి సమావేశంలో కూడా దీనిపై తీర్మానం చేశారు. ఖమ్మం నుంచి సోనియా పోటీ చేస్తే.. తెలంగాణతో పాటు ఏపీలో కూడా ప్రభావం ఉంటుందని కాంగ్రెస్‌ భావిస్తోంది. ఈ పార్లమెంట్‌ స్థానం పరిధిలోని 7 సెగ్మెంట్లలో కాంగ్రెస్‌ పార్టీయే గెలుపొందిన క్రమంలో.. ఇక్కడ పోటీ చేసే అభ్యర్థి గెలుపు నల్లేరుపై నడకేనని భావిస్తోంది.

- Advertisement -

ఖమ్మం నుంచి పోటీ చేసేందుకు నేతల క్యూ..
ఒకవేళ సోనియాగాంధీ ఖమ్మం నుంచి పోటీ చేసేందుకు విముఖత చూపిస్తే.. ఇక్కడ బరిలో ఉండేందుకు చాలా మంది నేతలు క్యూ కడుతున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి సోదరుడు ప్రసాద్‌ రెడ్డి, మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోదరుడు యుగేందర్‌ పోటీ చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. వీరితోపాటు సీనియర్‌ కాంగ్రెస్‌ నేతలు రేణుకా చౌదరి, వీ.హనుమంతరావు సైతం ఖమ్మం సీటుపై గురి పెట్టారు. ఇక బీఆర్‌ఎస్‌ తరఫున సిట్టింగ్‌ ఎంపీ నామా నాగేశ్వరరావు మరోసారి బరిలో దిగే అవకాశం ఉంది. బీజేపీ మాత్రం కొత్త అభ్యర్థిని రంగంలో దింపాలని చూస్తోంది.

ఇక్కడి నుంచి ప్రధాని మోదీని బరిలోకి దింపాలని బీజేపీ ప్లాన్‌..
ఇక తెలంగాణలో మల్కాజిగిరి నియోజకవర్గం మరో హాట్‌ సిటీగా మారింది. ఈ సెగ్మెంట్‌ పై దృష్టి పెట్టిన బీజేపీ.. ప్రధాని మోదీని ఇక్కడి నుంచి బరిలో దింపాలనే ప్రతిపాదన తెరపైకి తెచ్చింది. మోదీ ఇక్కడి నుంచి పోటీ చేస్తే.. దక్షిణ భారతదేశంపై ప్రభావం చూపుతుందని కమలనాథులు లెక్కలు వేసుకుంటున్నారు. ఒకవేళ మల్కాజిగిరి నుంచి పోటీ చేసేందుకు నరేంద్ర మోదీ అంగీకరించకపోతే.. బీజేపీలోని ముఖ్యమైన నేతలు బరిలో నిలిచేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు.

అందరి కన్ను మల్కాజ్‌ గిరిపైనే..
బీజేపీ జాతీయ నాయకుడు మురళీధర్‌ రావు, మాజీ మంత్రి ఈటెల రాజేందర్‌, ఢల్లీి పబ్లిక్‌ స్కూల్‌ యజమాని కొమురయ్య, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు మల్కాజిగిరి నుంచి పోటీ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అటు కాంగ్రెస్‌ పార్టీ కూడా ఈ సీటుపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టింది. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి రేవంత్‌ రెడ్డి పోటీచేసి గెలుపొందారు. రేవంత్‌ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన ఈ సెగ్మెంట్‌ లో కచ్చితంగా గెలిచి తీరాలని చూస్తోంది హస్తం పార్టీ. కాంగ్రెస్‌ నుంచి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, నర్సారెడ్డి భూపతిరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు హరివర్ధన్‌ రెడ్డి బరిలో ఉండేందుకు సిద్ధమవుతున్నారు. ఇక మల్కాజిగిరిలో కొత్త అభ్యర్థిని పోటీకి దింపాలని బీఆర్‌ఎస్‌ చూస్తుండగా.. మేడ్చల్‌ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు.

మెదక్‌ నుంచి బరిలోకి కేసీఆర్‌?
మెదక్‌ లోక్‌ సభ సీటు ప్రతిసారి గులాబీ ఖాతాలోనే పడుతోంది. ఈసారి కూడా ఎలాగైనా విజయం సాధించాలని కసరత్తు చేస్తున్న బీఆర్‌ఎస్‌.. పార్టీ చీఫ్‌ కేసీఆర్‌ ను బరిలో దింపాలని చూస్తోంది. కేసీఆర్‌ పోటీలో ఉంటే ఈ సీటును సునాయాసంగా గెలవొచ్చన్నది గులాబీ దళం వ్యూహం. కేసీఆర్‌ బరిలో లేకపోతే.. మాజీ ఎమ్మెల్యే మదన్‌ రెడ్డి, ఒంటేరు ప్రతాప్‌ రెడ్డి, గాలి అనిల్‌ కుమార్‌, ఎమెల్సీ వెంకటరాంరెడ్డి టికెట్‌ ఆశిస్తున్నారు. ఇక ఇక్కడ బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌ రావు పోటీకి సిద్ధపడుతున్నారు. కాంగ్రెస్‌ తరఫున విజయశాంతి, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేదా ఆయన భార్య నిర్మల పోటీ చేయాలనే ప్లాన్‌ లో ఉన్నారు. మొత్తంగా ఈసారి పార్లమెంట్‌ ఎన్నికల్లో ఈ మూడు స్థానాలు హాట్‌ కేకుల్లా మారాయి. ప్రధాన పార్టీలకు చెందిన ముఖ్య నేతలంతా పోటీకి సై అంటుండటంతో రాజకీయం రసవత్తరంగా మారింది..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు