Sunday, May 19, 2024

జె ట్యాక్స్‌ చెల్లించాల్సిందే

తప్పక చదవండి
  • డిప్యూటేషన్‌ పై వచ్చి వసూళ్ల దందా చేస్తున్న జనార్థన్‌
  • జీహెచ్‌ఎంసీలోని రాజేంద్రనగర్‌ సర్కిల్‌లో కమీషన్లు కంపల్సరీ.!
  • కాంట్రాక్టర్‌ లకు చుక్కలు చూపుతున్న ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌
  • బిల్లులు రావాలంటే పర్సంటేజీ ఇచ్చుకోవాల్సిందే
  • ఏడాదిగా కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేయని జీహెచ్‌ఎంసీ
  • బిల్లులో పర్సంటేజీ ఇస్తే పని అయిపోయినట్టే
  • లంచం ఇచ్చినోళ్లకు మాత్రమే బకాయిలు క్లీయర్‌
  • నాసిరకం పనులకు 20శాతం వరకు కమీషన్‌ వసూలు
  • ఆదాబ్‌ చేతిలో జనార్థన్‌ లంచాల వీడియోలు, ఆడియోలు

వడ్డించేటోడు మనోడు అయితే ఏ బంతిలో కూర్చున్న ముక్కలు పడుతాయన్నట్టుగా జీహెచ్‌ఎంసీలో జె.ట్యాక్స్‌ చెల్లిస్తే ఎంత పెద్ద పనిఅయినా అయిపోతుంది. కాంట్రాక్టర్‌ కు రావాల్సిన బిల్లులు వెంటనే క్లీయర్‌ అయ్యేలా చూస్తాడు అకౌంట్స్‌ సెక్షన్‌ లో ఉండే సారువారు. ప్రభుత్వం, పాలకులు ఎవరైనా సరే అంతా తనదే పెత్తనం. వివరాల్లోకి వెళితే.. జీహెచ్‌ఎంసీ లోని సౌత్‌ జోన్‌ రాజేంద్రనగర్‌ పరిధిలో ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌ సెక్షన్‌ లో ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌ గా కొలువు చేస్తున్నారు కె.జనార్థన్‌. అసలు ఆయన ఇక్కడికి డిప్యూటేషన్‌ పై వచ్చాడు. కానీ పెత్తనం మాత్రం అంతా ఆయనదే. ప్రభుత్వ పనుల నిమిత్తం కొందరు కాంట్రాక్ట్‌ లు దక్కించుకొని అట్టి పనులు చేసి బిల్లుల కోసమనీ వెళ్తే అక్కడ జె.ట్యాక్స్‌ చెల్లించాల్సిందే. ఎవరైనా సరే ఈ రూల్‌ తప్పనిసరిగా ఫాలో కావాలి. అకౌంట్స్‌ సెక్షన్‌ లో పనిచేసే ఇతగాడిదే ఆమ్దానీ అంతా. ఏళ్లుగా రాజ్యమేలుతున్న ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌ కె.జనార్థన్‌ పరిస్థితి తెలిసిన వాళ్లు ముక్కున వేళ్లు వేసుకుంటున్నారు.

రోజురోజుకు జనార్థన్‌ అక్రమ దందాలు ఒక్కొక్కటిగా బహిర్గతం అవుతున్నాయి. ఏన్నో ఏళ్లుగా అదే సీటులో కూర్చున్న లంచాలవీరుడు అక్రమ మార్గంలో డబ్బులు సంపాదిస్తూ కోట్లు వెనకేసినట్లు తెలుస్తోంది. కాంట్రాక్టర్లు పనిపూర్తి చేస్తే చాలు అదీ నాసిరకంగా ఉన్న పర్లేదు కమీషన్‌ ఇస్తే ఇట్టే బిల్లులు చెల్లింపులు అయ్యేలా చూస్తాడు. ‘అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్లుస తనకు పర్సంటేజీ ఇస్తే చాలు వెంటనే పని అయిపోతుంది. రావాల్సిన డబ్బులను చెల్లింపులు అయ్యేలా తన హస్తానికి పనిచెబుతాడు. కాంట్రాక్ట్‌ లో భాగంగా ఆయా పనులు పూర్తిచేసినప్పటికి 10 నుంచి 20శాతం లంచం ఇవ్వాల్సిందే. కాంట్రాక్ట్‌ తీసుకొని లక్షలు అప్పు జేసి పనిపూర్తిచేస్తే చివరికి చెల్లింపుల కాడికి వచ్చేసరికి జె.ట్యాక్స్‌ పేరుతో పర్సంటేజీ (లంచం) వసూలు చేస్తుండడంతో కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
‘అసలుకే లేదే అంటే పెసరపప్పు ఒండరాదే పెండ్లమా’ అన్నట్టు ఉంది ప్రభుత్వ తీరు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానా ఖాళీ కావడంతో ఉద్యోగులకు జీతాలు ఇచ్చేటందుకే తక్లీబ్‌ అయితుంటే ఇంకా కాంట్రాక్టర్లకు డబ్బులు ఎక్కడ్నుంచి చెల్లిస్తుంది. అందుకోసమే గత కేసీఆర్‌ ప్రభుత్వం పలువురు కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులు అన్ని పెండిరగ్‌ లో పెట్టింది. అయితే అనంతరం గత డిసెంబర్‌ లో కొత్తగా వచ్చిన రేవంత్‌ సర్కార్‌ సైతం పైసలకు ఇబ్బందులు పడుతోంది. అసలుకే ప్రభుత్వాన్ని కష్టతరమవుతుంటే కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వలేకపోతోంది. మొత్తంగా ఏడాదిగా జీహెచ్‌ఎంసీలో కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి. కానీ జె.ట్యాక్స్‌ కట్టే వారికి మాత్రం ఈ నిబంధనలు వర్తించడం లేదు. కమీషన్లు దండుకోని పైకం ముట్టచెప్తున్నాడు. కాకపోతే జోనల్‌ కమిషనర్‌ స్థాయి అధికారులకూ తాము పర్సంటేజీ ఇచ్చుకోవాల్సి ఉంటది అని మాయమాటలు చెబుతూ జనార్థన్‌ పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆదాబ్‌ కు వీడియోలు, ఆడియోలతో సహా కీలక ఆధారాలు లభించాయి.
త్వరలోనే జనార్థన్‌ అక్రమ దందాలపై ఏసీబీ, విజిలెన్స్‌ కు ఆదాబ్‌ కంప్లైంట్‌ చేయనుంది. ఉన్నతాధికారులు, ప్రభుత్వ పెద్దలు చర్యలకు తీసుకోకపోవడంపై సదరు వ్యక్తి ఆదాయానికి మించిన ఆస్తులపై దర్యాప్తు చేయాలని డిమాండ్‌ చేస్తుంది. మరో కథనం ద్వారా కె. జనార్థన్‌ అవినీతి బాగోతాలు సమాజం దృష్టికి తీసుకురానుంది ఆదాబ్‌ హైదరాబాద్‌.. మా అక్షరం.. అవినీతిపై అస్త్రం.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు