Monday, May 20, 2024

ఉమ్మడి జిల్లాలవారీగా బీజేపీ కార్యాచరణ

తప్పక చదవండి
  • ప్రజల్లోకి మరోమారు కమలం నేతలు
  • లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా వ్యూహాలు

హైదరాబాద్‌ : అసెంబ్లీ ఎన్నికలు ముగిసాయి. లోక్‌సబ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ క్రమంలో తెలంగాణపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించింది. బండిసంజయ్‌ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఉన్న జోష్‌ ఇప్పుడు బీజేపీలో కానరావడం లేదని మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టమ య్యింది. కనీసం 20 సీట్లు వస్తాయన్న చోట కేవలం 8 సీట్లు మాత్రమే దక్కాయి. అందులో గోషామహల్‌ రాజాసింగ్‌ గెలుపు కేవలం ఆయన వ్యక్తిగతంగానే భావించాలి. బీజేపీ కోసం ప్రస్తుత అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి కష్టపడుతున్నట్లు కనిపిస్తున్నా.. క్షేత్రస్థాయిలో పని కావడం లేదు. ప్రజలు కూడా పెద్దగా గుర్తించడం లేదు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బండిని దింపి కిషన్‌రెడ్డికి పగగ్గాలు అప్పగించినా పరిస్థితి మారలేదు. ఎంతగా దూకుడు ప్రదర్శించినా… బిఆర్‌ఎస్‌ తో పార్టీ మిలాఖత్‌ అయ్యిందన్న ప్రచారం నుంచి బిజెపి తప్పించుకోలేక పోయింది. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో అటు బిఆర్‌ఎస్‌ను, ఇటు బిజెపిని దెబ్బకొట్టారు. రెండు పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే అన్ని సీట్లు వస్తాయని భావించి భంగపడ్డారు. మోడీ, అమిత్‌ షా,ఇతర కేంద్రమంత్రులు ఉద్వగపూరిత ప్రసంగాలు చేసినా ..వచ్చేది బిజెపి ప్రభుత్వమే అని చెప్పినా ఎందుకో అందులో కిక్కులేకుండా పోయింది. తెలంగాణలో అధికారంలోకి వస్తామన్న ఆకాంక్ష నెరవేరలేదు. బండిని ఎందుకు మార్చారన్న ప్రశ్న సామాన్య కార్యకర్తల్లో గట్టిగా వినిపిస్తోంది. ఈ క్రమంలో తెలంగాణలో మరోమారు ఎంపి సీట్లు లక్ష్యంగా బిజెపి కసరత్తుముమ్మరం చేస్తోంది. ప్రధాని మోదీ పాలన, ప్రజల మద్దతుతో తెలంగాణలో బీజేపీ అత్యధిక సీట్లను గెలుస్తుందన్న ధీమాలో ఉన్నారు. అందుకే అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో బీజేపీ పార్లమెంట్‌ ఎన్నికలపై దృష్టి సారించింది. గ్రేటర్‌లోని 24 నియోజక వర్గాల్లో.. గోషామహల్‌లో విజయం సాధించిన పార్టీ పలుచోట్ల ఓట్ల శాతాన్ని పెంచుకుంది. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. గ్రేటర్‌ పరిధిలో హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, చేవెళ్ల లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. వీటిలో సికింద్రాబాద్‌ బీజేపీ ఖాతాలోనే ఉండగా.. ఆ స్థానాన్ని నిలుపుకోవడం తోపాటు ఈసారి మల్కాజిగిరి నుంచి జెండా ఎగురేయాలని కమలనాథులు కలలు కంటున్నారు. హైదరాబాద్‌ లోక్‌సభ పరిధిలో మజ్లిస్‌ ఆధిపత్యం ఉండడంతో మిగతా రెండు సికింద్రాబాద్‌, మల్కాజిగిరి పార్లమెంట్‌ స్థానాలు బీజేపీకి కీలకం. సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. మల్కాజిగిరి నుంచి గత లోక్‌సభ ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్సీ ఎన్‌.రామచందర్‌రావు పోటీ చేసి ఓడిపోయారు. సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ కంటే ఈసారి మల్కాజిగిరి పార్లమెంట్‌ టికెట్‌పై ఎక్కువ మంది అభ్యర్థులు ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే టికెట్‌పై కన్నేసిన నాయకులు ఎవరికి వారు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇందులో ఈటెల రాజేందర్‌, రాంచందర్‌ రావు తదితరులు ఉన్నారు. ఇందుకు కారణాలు లేకపోలేదు. మల్కాజిగిరి లోక్‌సభ పరిధిలో బీజేపీ ఓటు బ్యాంక్‌ గణనీయంగా పెరిగింది. దీని పరిధిలో మేడ్చల్‌, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్‌, ఉప్పల్‌, ఎల్బీనగర్‌, కంటోన్మెంట్‌, కూకట్‌పల్లి సెగ్మెంట్లు ఉన్నాయి. కూకట్‌పల్లి మినహా మిగతా ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లలో పోటీ చేసిన బీజేపీ మంచి ఓట్లు రాబట్టింది. ఉప్పల్‌లో 55,427, మేడ్చల్‌లో 50,535, మల్కాజిగిరిలో 47,332, కంటోన్మెంట్‌లో 41,888, ఎల్‌బీనగర్‌లో 89,075, కుత్బుల్లాపూర్‌లో 1,02,423 ఓట్లు బీజేపీ అభ్యర్థులకు వచ్చాయి. ఈ ఆరు నియోజకవర్గాల్లో కలిపి మొత్తం ఓట్లు 3,86,680. గత లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే 82,398 ఓట్లు అదనం. ఇందులో బీజేపీ పొత్తుతో జనసేన పోటీ చేసిన కూకట్‌పల్లి కాకుండానే మంచి ఆధిక్యతను కనబర్చిచిందని నాయకులు భావిస్తున్నారు. కూకట్‌పల్లిలో జనసేన అభ్యర్థికి 39,830 ఓట్లు పోలయ్యాయి. దీంతో ఈసారి మల్కాజిగిరిలో బలమైన అభ్యర్థిని బరిలోకి దించితే సులువుగా గెలుస్తామనే ధీమాతో పార్టీ ఉంది. మల్కాజిగిరి లోక్‌సభ టికెట్‌ కోసం కుత్బుల్లాపూర్‌ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్‌ దృష్టి పెట్టారు. ఇటీవల ఆయన అగ్రనేతలను కలిసి మల్కాజిగిరి ఎంపీ టికెట్‌ ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. గత పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్సీ ఎన్‌.రామచందర్‌ రావు, బీజేపీ సీనియర్‌ నేత మురళీధర్‌రావు కూడా మల్కాజిగిరి నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది. పార్టీ ఆదేశిస్తే మల్కాజిగిరి నుంచి పార్లమెంట్‌కు పోటీ చేస్తానని ఆ పార్టీ నేత ఈటల రాజేందర్‌ ప్రకటించారు. ఈ క్రమంలో ఇప్పుడు అధికార కాంగ్రెస్‌ను ఢీకొని గెలుస్తారా అన్నదే అనుమానాం. ఈ సీటులో సిఎం రేవంత్‌ రెడ్డి గతంలో ఎంపిగా గెలిచారు. మొత్తంగా బిజెపి మొన్నటి ఓట్లను లెక్కలు వేసుకుని రంగంలోకి దిగాలని చూస్తోంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు