Wednesday, May 8, 2024

అమరజీవి ఆత్మార్పణ…

తప్పక చదవండి

1952 డిసెంబర్‌ 19…ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు గురించి ప్రధానమంత్రి నెహ్రూ ప్రకటించిన దినం
ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు విషయం ప్రస్తావనకు వస్తే, అమరజీవిగా ప్రాచుర్యం పొందిన పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్ష గుర్తుకు రాక మానదు. 1952 డిసెంబర్‌ 19న భారత తొలి ప్రధాని పండిట్‌ నెహ్రూ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు గురించి పార్లమెంట్‌ లో ప్రకటన చేశారు. ఈ విషయం గురించి మననం చేసు కోవాలంటే పొట్టి శ్రీరాములు ఆత్మార్పణం చేసుకున్న నేపథ్యం గురించి తెలుసుకోవాల్సిన అవసరం అనివార్యం. మహాత్మా గాంధీ వ్యక్తిత్వానికి ప్రభావితులై, ఉద్యోగం వదిలి దాదాపు రెండు దశాబ్దాలు శ్రీరాములు సన్నిహితంగా మెదిలి, జాతిపిత అహింస సిద్ధాంతాన్ని విశ్వసించి, పలుమార్లు ఆచరించి.. విజయం సాధించారు. వివిధ రాష్ట్రాల్లో సత్యాగ్రహ ఉద్యమాలు చేస్తూ జైలుకెళ్లిన శ్రీరాములు బీహారు వంటి రాష్ట్రాల్లో కూడా సేవలు చేశారు. అనంతరం నెల్లూరులో దళితులకు ఆలయ ప్రవేశం, అస్పృశ్యత నివారణ మొదలైన వాటికోసం ప్రచారం, నిరాహార దీక్షలు చేసి విజయం సాధించారు. ఆంధ్ర రాష్ట్రం కోసం చేసిన 58 రోజుల ఆమరణ దీక్షకు ముందు శ్రీరాములు ఐదు సార్లు నిరాహార దీక్షలు చేశారు. 1952 సెప్టెంబర్‌ 15వ తేదీన శ్రీరాములు నెల్లూరు నుంచి భాగవతుల లక్ష్మీ నారాయణకు ఒక లేఖ రాశారు. అందులో.. ‘‘ఆంధ్ర రాష్ట్ర సమస్య అనేక మందికి, అనేక పార్టీలకు, అనేక అభిప్రాయాలకు, అనేక భావాలకు అనేక రకాలుగా పుట్టిల్లు అయ్యింది. ప్రతి ఒక్కరి స్వార్థమూ వేర్వేరుగా ఉంది. ప్రత్యక్ష ఆర్థిక లాభాలున్నాయి. కాబట్టి అందరూ పరమార్థ దృష్టితో ఆలోచిస్తే తప్ప ఏకాభిప్రాయానికి రాలేరు. అధికారంలో ఉన్న మహా నాయకుల దృష్టి మార్చాలంటే సామాన్యం కాదు. ఇందుకు ఒక్కటే మార్గం కనబడుతోంది. నిష్కామ దృష్టితో, ద్వేష రహితంగా, నిశ్చింతగా ప్రాణాలర్పించటమే. ఇక ఈ సమస్యను ఉపేక్షించటం పాపమని నిన్నే (1952 సెప్టెంబర్‌ 14) అనిపించింది’’.
స్వామి సీతారాం అక్టోబర్‌ 2వ తేదీన శ్రీరాములుకు తన స్పందన తెలియజేస్తూ లేఖ రాశారు. ఆ లేఖకు శ్రీరాములు స్పందిస్తూ, ప్రజాభీష్టాన్ని అమలు జరపడమే పండిట్‌ నెహ్రూ వంతు’’ అని పేర్కొన్నారు. 1952 అక్టోబరు 19వ తేదీన తన దీక్ష ప్రారంభించడానికి ముందు పత్రికలకు శ్రీరాములు ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో.. ‘‘మద్రాసు నగర భవిష్యత్తు విషయమై మద్రాసు పౌరుల్లో ఏకాభిప్రాయం సాధించడానికి తీవ్రమైన కృషి జరగాలి’’ అని పేర్కొన్నారు. దీక్షకు ఐదు రోజుల ముందు మద్రాసు పౌరులకు చేసిన విజ్ఞప్తిలో ఆయన ఇలా పేర్కొన్నారు.. ‘‘ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయాలని తగినంత ప్రచారం, ఆందోళన, లెక్కల సేకరణ మొదలైనవి ఇప్పటికే జరిగాయి. 1916లోనే ఆంధ్రోద్యమ ప్రచారం ముమ్మరం కావటంతో ప్రత్యేకాంధ్ర రాష్ట్ర స్థాపన సమస్య అందరి దృష్టినీ ఆకర్షించింది. దానివలన కలిగిన తక్షణ ఫలితం అనిబిసెంటు అధ్యక్షతన 1917 డిసెంబరులో కలకత్తాలో జరిగిన కాంగ్రెస్‌ మహాసభలో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెసు సంఘాన్ని ఏర్పాటు చేయడం. ‘ఆ రాష్ట్ర కాంగ్రెసు సంఘం మదరాసు నగరం మీద తక్కిన మదరాసు రాష్ట్ర కాంగ్రెసు సంఘంతో సమానంగా హక్కు కలిగి ఉంటుంది అని ఒక తీర్మానం కూడా ఆ సందర్భంగా ఆమోదించ బడిరది.
ఆయన దీక్షను చేపట్టాక, విరమించడానికి రెండు షరతులు పేర్కొన్నారు…1) మద్రాసు నగర భవిష్యత్తు విషయమై మద్రాసు పౌరుల్లో ఏకాభిప్రాయం ఏర్పడటం. 2) భారత ప్రభుత్వం రాజ్యాంగం లోని 3వ ఆర్టికల్‌ కింద ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించటం. శ్రీరాములు ఒక సందర్భంలో.. ‘‘నేను చచ్చిపోవాలని చెయ్యడం లేదు. మనకు న్యాయమైన హక్కు ఉన్నదనటం కోసం చేస్తున్నాను. అదివస్తే సంతోషిస్తాను. రాకపోతే చచ్చిపోతాను. నేను పోతే దీన్ని సాధించటానికి ఎవరికైనా అవకాశం ఉండవచ్చు’’ అన్నారని (ఆంధ్ర పత్రిక: 18 డిసెంబర్‌ 1952)లో పేర్కొనబడిరది. ప్రకాశం పంతులు మాటల్లో చెప్పాలంటే.. ‘‘ఉపవాసం చెయ్యడానికి ఎవ్వరూ స్థలం ఇవ్వకపోతే అట్టలు కట్టుకొని, వీధుల్లో తిరిగి ప్రాణాలైనా అర్పిస్తానన్న పట్టుదల గల మనిషి శ్రీరాములు’’. ఆయనకు ఆశ్రయం ఇచ్చేందుకు బులుసు సాంబమూర్తి ముందుకు వచ్చారు. పొట్టి శ్రీరాములు 1952 అక్టోబర్‌ 19వ తేదీన బులుసు సాంబమూర్తి ఇంట్లో ఆమరణ దీక్ష ప్రారంభించారు. 1952 అక్టోబర్‌ 19వ తేదీ నుంచి డిసెంబర్‌ 15వ తేదీ వరకు ఆమరణ నిరాహార దీక్ష చేశారు.
మద్రాసు లేకుండా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు డిసెంబర్‌ 19వ తేదీన లోక్‌సభలో ప్రధాన మంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రకటించారు. ఈ మేరకు వాంఛూ కమిటీని ఏర్పాటు చేశారు. 11 జిల్లాలు, బళ్ళారి జిల్లాలోని 3 తాలూకాలు ఇందులో భాగంగా ఉంటాయని ప్రకటించారు. శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలతో పాటు, బళ్ళారి జిల్లాలోని రాయదుర్గం, ఆదోని, ఆలూరు తాలుకాలను కలుపుకుని 1953 అక్టోబర్‌ 1వ తేదీన కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిరది. బళ్ళారి జిల్లాలోని బళ్ళారి తాలూకాను ఎల్‌.ఎస్‌ మిశ్రా సంఘం నివేదిక ననుసరించి మైసూరు రాష్ట్రంలో కలిపేసారు. 1937 నాటి శ్రీబాగ్‌ ఒడంబడిక ననుసరించి కొత్త రాష్ట్రానికి కర్నూలు ముఖ్యపట్టణం అయింది. టంగుటూరి ప్రకాశం ముఖ్యమంత్రి అయ్యారు. సి.ఎం. త్రివేది గవర్నరు అయ్యారు. నెహ్రూ చేతుల మీదుగా జరిగిన ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో ఆంధ్రుల చిరకాల స్వప్నం ఫలించింది.
రామ కిష్టయ్య సంగన భట్ల…
9440595494 ఆంధ్ర రాష్ట్ర అవతరణ
1952 డిసెంబర్‌ 19…ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు గురించి ప్రధానమంత్రి నెహ్రూ ప్రకటించిన దినం

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు