Saturday, November 2, 2024
spot_img

వారణాసిలో మోడీ నామినేషన్‌

తప్పక చదవండి
  • రిటర్నింగ్ అధికారి ఎదుట ప్రమాణం చేసి పత్రాల అందజేత
  • ప్రతిపాదకుల్లో ప్రముఖ జ్యోతిష్యుడు పండిట్ గణేశ్వర్ శాస్త్రి
  • మోదీతో కలసి కలెక్టర్ కార్యాలయంలోకి వెళ్లిన యూపీ సీఎం యోగి

మంగ‌ళ‌వారం వారణాసి లోక్‌సభ స్థానానికి ప్రధాని మోడీ నామినేషన్‌ దాఖలు చేశారు. పుష్యా నక్షత్రం, గంగా సప్తమి కలసి వచ్చిన సుముహూర్తాన ప్రధాని మోదీ వారణాసి నుంచి వరుసగా మూడోసారి నామినేషన్‌ వేశారు. పండితులు నిర్ణయించిన ముహూర్త సమయం ఉదయం 11:40 గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు కాన్వాయ్ లో వచ్చిన మోదీ.. కారు దిగి నడుచుకుంటూ ఒక్కరే లోపలికి వెళ్లారు. అప్పటికే ఆ కార్యాలయంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు. మోదీ పేరును నాలుగు కులాలకు చెందిన సామాన్యులు ప్రతిపాదించారు. వారిలో ఇద్దరు ఓబీసీలు, ఒక దళితుడు ఉన్నారు. ప్రతిపాదకుల్లో మరొకరైన ప్రముఖ జ్యోతిష్యుడు, అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్టకు ముహూర్తాన్ని నిర్ణయించిన పండిట్ గణేశ్వర్ శాస్త్రి ఈ పత్రాలపై తొలి సంతకం చేశారు. తన నామినేషన్ పత్రాల్లో పేర్కొన్న వివరాలన్నీ నిజమైనవేనంటూ మోదీ రాజ్యాంగంపై ప్రమాణం చేసి ప్రమాణపత్రాన్ని చదివి వినిపించారు. ఆపై ఆ పత్రాలను రిటర్నింగ్ అధికారి అయిన జిల్లా కలెక్టర్ కు సమర్పించారు. అంతకుముందు గంగా నదిలో పుణ్యస్నానం ఆచరించిన ప్రధాని మోదీ ముందుగా దశాశ్వమేథ ఘాట్ లో గాంగా నదికి పూజలు చేశారు. అనంతరం నమో ఘాట్ కు చేరుకొని అక్కడ కూడా పూజలు నిర్వహించారు. ఆ తర్వాత కాల భైరవ ఆలయంలో పూజలు చేపట్టి అక్కడి నుంచి కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకొని నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. తన నామినేషన్ దాఖలుకు ముందు మోదీ సోషల్ మీడియాలో ఓ భావోద్వేగ వీడియోను పంచుకున్నారు. వారణాసితో తనకున్న అనుబంధాన్ని ఆ వీడియోలో తెలియజేశారు. 2014 నుంచి వారణాసి నియోజకవర్గంతో తనకు ఏర్పడిన అనుబంధాన్ని, జ్ఞాపకాలను నెమరేసుకున్నారు.

‘2014లో నేను కాశీకి వచ్చినప్పుడు.. గంగమ్మ నన్ను ఒడిలోకి తీసుకుంది. ఒక తల్లి తన బిడ్డను ఎలా అక్కున చేర్చుకుంటుందో గత పదేళ్ల కాలంలో నన్ను కాశీ అలా స్వీకరించింది. తల్లితో బిడ్డకు ఉండే బంధం నాకు ఈ నగరంతో ఏర్పడింది. ఇది మాటల్లో వర్ణించలేని అనుభూతి’ అంటూ మోదీ చెమర్చిన కళ్లతో చెప్పారు. ఒక ప్రజాస్వామ్య దేశంలో ప్రజల ఆశీర్వాదం ఉండాలని, అది తనకు ఇకపైనా కొనసాగుతుందన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు