- అభివృద్ది ఎక్కడో చూపితే అక్కడికే వస్తా
- నాతోపాటు మేధావులు, ప్రతిపక్షాలూ వస్తాయి
- వైవి సుబ్బారెడ్డికి సవాల్ విసిరిన షర్మిల
- శ్రీకాకుళం నుంచి జిల్లా పర్యటనలు ప్రారంభం
- బస్సులో ప్రయాణిస్తూ ప్రజలతో మమేకం
శ్రీకాకుళం : అభివృద్ది ఎక్కడ జరిగిందో చూపిస్తే వచ్చి చూడానికి తాను సిద్దంగా ఉన్నానని వైసిపికి కాంగ్రెస్ ఎపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సవాల్ విసిరారు. జిల్లా పర్యటనల్లో ఉన్న షర్మిల వైసీపీ నేతలకు ఘాటు రిప్లై ఇచ్చారు. వైవీ సుబ్బారెడ్డి చెప్పనట్టు చర్చకు తాను సిద్ధమని తనతోపాటు మేథావులు, ప్రతిపక్షనేతలు వస్తారని టైం ప్లేస్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇకపై జగన్‌ను అన్నయ్యగారూ అని పిలుస్తానంటూ కామెంట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్‌గా నియమితురాలైన వైఎస్ షర్మిల జిల్లాల పర్యటన ప్రారంభించారు. సోమవారం ఆమె ప్రకటించినట్టుగానే ఎన్నికలకు ముందు ఆమె శ్రీకాకుళం జిల్లాల్లో పర్యటించి.. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తొలుత ఉత్తరాంధ్ర జిల్లాల్లోని కీలకమైన శ్రీకాకుళం నుంచి షర్మిల తన యాత్రను ప్రారంభించారు. జిల్లాలోని పలాస నియోజకవర్గంలో ఆర్టీసీ బస్సు ఎక్కిన షర్మిలా రెడ్డి ఇచ్ఛాపురం వరకు బస్సులోనే ప్రయాణించారు. ఆమె వెంట కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాకూర్, ఏపీసీసీ మాజీ చీఫ్ గిడుగు రుద్రరాజు, మాజీ మంత్రి రఘువీరా రెడ్డి తదితరులు ఉన్నారు. పలాస నుంచి బస్సులో ప్రయాణించిన వైఎస్ షర్మిల.. ఈ సందర్భంగా బస్సులోని ప్రయాణికులతో ముచ్చటించారు. సాధారణ ప్రయాణికుల మాదిరిగా వారి పక్కనే కూర్చున్న షర్మిల రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతోపాటు.. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో పరిస్థితులు, అభివృద్ధి, సంక్షేమ పథకాలతో వారికి జరుగుతున్న ప్రయోజనం వంటివాటిని కూడా ఆరా తీశారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిలను మీడియా పలకరించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఉత్తరాంధ్ర జిల్లాల ఇంచార్జి సుబ్బారెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. ముఖ్యంగా రాష్ట్రంలో అభివృద్ధి లేదన్న షర్మిల వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇస్తూ.. రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎంతో అభివృద్ధి చేసిందని, ఎవరు వచ్చినా.. అభివృద్ది ఎక్కడ ఎలా జరిగిందో చూపిస్తామని ఆయన వ్యాఖ్యానించారు. అదేవిధంగా జగన్‌రెడ్డి అని సంబోధించడాన్ని వైవీ తప్పుబట్టారు. ఈ వ్యాఖ్యలపై షర్మిల స్పందిస్తూ.. సుబ్బారెడ్డి గారు. .జగన్ రెడ్డిగారు అనటం నచ్చలేదంటున్నారు. సరే జగన్ అన్నగారూ అనే అందాము. దానికి ఏమీ అభ్యంతరం లేదని వ్యాఖ్యానించారు. వైవీ సుబ్బారెడ్డి రాష్ట్రంలో అభివృద్ది చూపిస్తామన్న వ్యాఖ్యలపై వైఎస్ షర్మిల స్పందించారు. వైవీ సుబ్బారెడ్డి గారు ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూపిస్తామన్నారు. మేము చూడటానికి సిద్దంగా ఉన్నాం. టైం,డేట్ మీరు చెప్పిన సరే,మమ్మల్ని చెప్పమన్నా సరే రెడీ. మీరు చేసిన అభివృద్ధి చూసేందుకు మేమే కాదు, మీడియా, మేధావులు, ప్రతిపక్ష పార్టీల వారు కూడా వస్తారు. మీరు చేపట్టిన అభివృద్ధి, మీరు నిర్మించిన రాజధాని ఎక్కడ, మీరు కట్టిన పోలవరం ప్రాజెక్టు ఎక్కడ? మీరు నడుపుతున్న మెట్రో ఎక్కడో చూపించండి. చూడటానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తున్నాం. చూపించండి‘ అని షర్మిల వ్యాఖ్యానించారు. వైవీ సుబ్బారెడ్డి చేసిన సవాల్‌ను స్వీకరిస్తున్న వైఎస్ షర్మిల ప్రకటించడంతో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ, కాంగ్రెస్ పార్టీలమధ్య రాజకీయం మరింత వేడెక్కింది. అభివృద్ధి చూపించాలని షర్మిల సవాల్ విసరడంతో ఇప్పుడు వైవీ ఎలా స్పందిస్తారు? ఎక్కడ అభివృద్ది చూపిస్తారు? లేక.. సాధారణ రాజకీయ సవాళ్లు ప్రతిసవాళ్లుగానే ఈ అంశాన్ని వదిలేస్తారా? అనేది ఆసక్తిగా మారింది. ఎన్నికలకు ముందు.. అభివృద్ధి విషయాన్ని లేవనెత్తడం.. సవాళ్లు విసురుకోవడం, టైండేట్ వంటి కామెంట్లు చేయడం మరింతగా రాజకీయ సెగ పెంచిందనే చెప్పాలి. చూడాలి ఏం జరుగుతుందో. ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ విపక్షాల మధ్య విమర్శలు
ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు వైసీపీని తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ నేతలు ధాటిగా విమర్శించేవారు. ఇప్పుడు ఆ జాబితాలో ఆంధప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల చేరిపోయారు. పీసీసీ చీఫ్ పదవీ చేపట్టిన వెంటనే జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఇచ్చాపురం పర్యటనలో వైసీపీ, వైవీ సుబ్బారెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వైఎస్ షర్మిల ఏపీ పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత వైవీ సుబ్బారెడ్డి మాట్లాడారు. షర్మిలకు ఇక్కడి అభివృద్ధి ఏం తెలుసు అని ఆయన ప్రశ్నించారు. ఆ వ్యాఖ్యలపై ఈ రోజు షర్మిల స్పందించారు. ’మీరు చేసిన అభివృద్ధి చూపించండి. డెవలప్ మెంట్ చూడటానికి సిద్ధంనా ఉన్నా. డేట్, టైం మీరు చెబుతారా..? నన్ను చెప్పమన్నా చెబుతా. ఆ డిబేట్‌కు మేధావులను పిలుద్దాం. నాతో పాటు మీడియా వస్తుంది. ప్రతిపక్షాలు వస్తాయి. గత నాలుగున్నరేళ్లలో మీరు చేసిన అభివృద్ధిని మా అందరికీ చూపించండి. మీరు అభివృద్ధి చేసింది ఎక్కడ ? మీరు చెప్పిన రాజధాని ఎక్కడా? పోలవరం ప్రాజెక్ట్ ఎక్కడా? మీ అభివృద్ధి ఆంధప్రదేశ్ ప్రజలు చూడాలని అనుకుంటున్నారు. మీ సవాల్‌ను స్వీకరిస్తున్నా అని’ వైఎస్ షర్మిల ఓపెన్ ఛాలెంజ్ చేశారు. షర్మిల ఛాలెంజ్‌పై వైవీ సుబ్బారెడ్డి స్పందించాల్సి ఉంది. షర్మిల తన సోదరుడు ఏపీ సీఎం జగన్‌ను ఇటీవల జగన్ రెడ్డి అని పిలిచారు. అలా పిలవడం వైవీరెడ్డికి నచ్చలేదట.. ఇక నుంచి ’జగన్ అన్న గారు’ అని పిలుస్తా అని ప్రకటించారు. జగన్‌ను అలా పిలవడానికి తనకేం అభ్యంతరం లేదని షర్మిల సెటైర్లు వేశారు.