Friday, July 26, 2024

మనసిక్కడ… పోటీ అక్కడ..!

తప్పక చదవండి
  • సికింద్రాబాద్‌ ఎంపీ స్థానంలో విచిత్ర పరిస్థితి!
  • బరిలో ఇద్దరు ఎమ్మెల్యేలు!
  • ఎమ్మెల్యే పదవిపైనే ఆసక్తి!
  • ఎంపీగా పోటీపై ఇద్దరిలోనూ అయిష్టత..!
  • మొక్కుబడిగా ఎన్నికల ప్రచారం!
  • పద్మారావు, దానం తీరుపై కార్యకర్తల్లో అసహనం!

రాజకీయ నాయకులలో ఎక్కువ శాతం ఎంపీ పదవి కంటే ఎమ్మెల్యే పదవి పైనే ఎక్కువ మక్కువ చూపిస్తారు! ఎమ్మెల్యేగా ఉంటేనే స్థానికంగా తమ అడ్డాలో పూర్తిస్థాయిలో పరపతి ఉంటుందని, అధికార యంత్రాంగం, రాజకీయాలు కూడా తమ నియంత్రణలో ఉంటాయనే ఆలోచన కూడా ఉంటుంది. ఎమ్మెల్యేగా పనిచేసినవారిలో తొంబై శాతం మంది నాయకులు ఎంపీలుగా వెళ్ళడానికి అస్సలు ఇష్టపడరు. ఒక స్థాయి, హోదా కలిగిన క్లాస్‌ లీడర్స్‌ మాత్రమే ఎంపీ పదవులను కోరుకుంటారు! ప్రజల్లో ఎక్కువగా ఉండే మాస్‌ లీడర్స్‌ మాత్రం ఎమ్మెల్యేగా ఉండాలని గట్టిగ కోరుకుంటారు! ఈసారి ఎంపీ ఎన్నికలు రాష్ట్రంలో విచిత్ర పరిస్థితులకు అద్దం పడుతున్నాయి! కాంగ్రెస్‌ పార్టీకి ఉన్న ముగ్గురు ఎంపీలు రేవంత్‌ రెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డిలు ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో ఎమ్మెల్యేలుగా గెలిచారు. రేవంత్‌ ముఖ్యమంత్రి కాగా, వెంకటరెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిలు మంత్రులయ్యారు. ఎంపీ పదవులకు రాజీనామా కూడా చేసేసారు. దింతో గతేడాది డిసెంబర్‌ నుండి రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి ఒక్క పార్లమెంట్‌ సభ్యుడు కూడా లేకుండా పోయారు. అసెంబ్లీ ఎన్నికల విజయంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీకి రాష్ట్రంలో ఒక్కసారిగా రాజకీయ పరమైన ఆధరణ పెరిగింది. బీఆర్‌ఎస్‌ అధికారం కోల్పోవడంతో డీలా పడిపోయింది. పలువురు ఆ పార్టీ ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్‌ పార్టీలో చేరడం మొదలెట్టారు! వారిలో ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ కూడా ఒకరు! అధికారం కోల్పోయాక పూర్తిగా డీలా పడిన బీఆర్‌ఎస్‌.. ఇపుడు ఎంపీ ఎన్నికలలో సత్తా చాటాడమనేది తప్పనిసరి పరిస్థితి. అయితే ఆ పార్టీకి పోటీ చేయడానికి కనీసం అభ్యర్థులు కరువైన పరిస్థితులు దాపురించాయి. ఇదిలా ఉంటే అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్ర వ్యాప్తంగా గణనీయమైన సీట్లు సాధించిన కాంగ్రెస్‌ పార్టీ కీలకమైన హైదరాబాద్‌ నగర పరిధిలో మాత్రం ఒక్క సీటు గెలుచుకోలేకపోయింది . అదే సమయంలో అధికారం కోల్పోయిన బీఆర్‌ఎస్‌ మాత్రం నగర పరిధిలో పూర్తి స్థాయిలో సత్తాచాటుకోవడమే కాకుండా భారీ మెజారిటీతో సీట్లను సాధించింది. రాజధాని పరిధిలో తమకు తిరుగులేదని నిరూపించుకుంది. ఈ నేపథ్యంలో రాజధాని పరిధి కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ లకు అత్యంత కీలకంగా మారింది. ఎంపీ ఎన్నికలలో సికింద్రాబాద్‌ స్థానంలో సత్త చాటడం ద్వారా నగరంపై తమ పట్టుతగ్గలేదని కాంగ్రెస్‌ పార్టీ నిరూపించుకోవాలనుకుంటోంది. బీఆర్‌ఎస్‌ కూడా ఇక్కడ ఎంపీ గా విజయం సాధించి…పట్టు కోల్పోలేదని నిరూపించుకోవాలని పట్టుదలతో ఉంది! సికింద్రాబాద్‌ ఎంపీగా ప్రస్తుతం బీజేపీ పార్టీకి చెందిన కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరోసారి ఆయనే బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ముక్కోణపు పోటీలో గెలిచి తీరాలని, లేదంటే కనీసం రెండవ స్థానంలో అయినా నిలవాలనే పట్టుదలతో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ఉన్నాయి. ఈ క్రమంలో సికింద్రాబాద్‌ ఎమ్మెల్యేగా ఉన్న పద్మారావును ఎంపీ అభ్యర్థిగా బీఆర్‌ఎస్‌ ఎంపిక చేయగా… బీఆర్‌ఎస్‌ నుండి ఖైరతాబాద్‌ ఎమ్మెల్యేగా గెలిచి తమ పార్టీలో చేరిన దానం నాగేందర్‌ ను కాంగ్రెస్‌ పార్టీ బరిలోకి దింపింది. అయితే ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు అయిష్టాంగానే…తప్పనిసరి పరిస్థితుల్లో ఎంపీ అభ్యర్థులుగా బరిలోకి దిగినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే అభ్యర్థులుగా గెలుపు కోసం మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడి ప్రచారం నిర్వహించిన ఈ ఇద్దరు… ఇపుడు మొక్కుబడిగా, అయిష్టంగా ప్రచారం నిర్వహిస్తున్నారని స్వయంగా వారి అనుచరులే చెబుతున్నారు. ఎండలు మండుతున్నాయని, ఆరోగ్యం సహకరించట్లేదంటూ సాధ్యమైనంత వరకు ప్రచారాలకు దూరంగా ఉండటానికే ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రచారాలను ఎగ్గొట్టడానికి సాకులు వెతుక్కుంటున్నట్లు తెలుస్తోంది! గెలుపోటముల సంగతి పక్కన బెడితే తాము ఎంపీగా గెలిస్తే ఎమ్మెల్యే పదవి వదులుకోవాల్సి వస్తుందనే బెంగ నే ఇద్దరిలోనూ ఉందని, ఓడిపోతే తమకు వ్యక్తిగతంగా వాటిల్లే నష్టం కూడా ఏమిలేదు కాబట్టి ఈ ఎన్నికల్లో తాము అభ్యర్థులమే కాదు! అన్నట్లుగా మొక్కుబడి గా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు ప్రత్యక్ష పరిశీలకులు చెబుతున్నారు! సాధారణంగా ఎన్నికలంటే కార్యకర్తలకు అభ్యర్థి చుట్టూ ఉండే చోటామోటా నాయకులకు ఒక పండగలా ఉంటుంది. డబ్బు పంపిణీ, ప్రచార ఆర్భాటాలు, ఎదో విధంగా ఆర్థికంగా నాలుగు రాళ్లు పోగేసే వాతావరణం ఉంటుంది. కానీ ఈ రెండు పార్టీల నేతలు కార్యకర్తలు మాత్రం పూర్తిగా డీలా పడిపోయినట్లు కనిపిస్తోంది. ప్రచారాలకు అంటీముట్టనట్లుగా వస్తున్న అభ్యర్థులు డబ్బుల మాటెత్తితేనే మాటలు దాటవేస్తున్నారని. చూద్దాం చేద్దాం అంటూ తప్పించుకుంటున్నారని, వీళ్ళు అభ్యర్థులుగా ఉండటం తమకు నష్టదాయకంగా మారిందనే అసంతృప్తిని అసహనాన్ని చోటామోటా నేతలు, కార్యకర్తలు అంతర్గత చర్చల్లో వెళ్లగక్కుతున్నట్లు తెలుస్తోంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు