Tuesday, April 30, 2024

కారుకు సర్వీసింగ్‌

తప్పక చదవండి
  • అసెంబ్లీ ఎన్నికల ఓటమికి నేనే బాధ్యుడ్ని
  • కార్యకర్తలను పట్టించుకోలేకపోయాను
  • బీఆర్‌ఎస్‌ నాయకులు అలా మాట్లాడవద్దు
  • ప్రజలు తప్పు చేశారనడం సరికాదు..
  • దళితబంధు స్కీమ్‌ వల్ల పార్టీ దెబ్బతిన్నది
  • భూస్వాములకూ రైతుబంధు ఇచ్చి తప్పు చేశాం
  • లోక్‌ సభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తుపై క్లారిటీ
  • కాంగ్రెస్‌ ఇచ్చిన హామీల అమలుపై పోరాటం
  • భువనగిరి పార్లమెంట్‌ సమీక్షా సమావేశంలో కేటీఆర్‌

ఓటమి కొత్తేం కాదు.. అది స్పీడ్‌ బ్రేకర్‌ వంటిదే.. పదేండ్ల పాటు విరామమెరుగక పనిచేసిన కారు మరింత స్పీడుగా పనిచేసేందుకు సర్వీసింగ్‌కు పోయిందే తప్ప షెడ్డులోకి పోలేదు.. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కారు జయకేతనం ఎగరేయడం ద్వారా ఆ తర్వాత వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు నేతలు తమ సత్తాచాటాలని పార్టీ వర్కింగ్‌ ప్రసిడెంట్‌, ఎమ్మెల్యే కేటీఆర్‌ పిలుపునిచ్చారు..

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసేంత వరకు ప్రజల తరుపున పోరాటం చేయాలని బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఐదేళ్లు కాంగ్రెస్‌ పార్టీని వదిలి పెట్టే ప్రసక్తే లేదన్నారు. ఆ పార్టీ ఇచ్చిన హామీల పుస్తకంను బైబిల్‌, ఖురాన్‌, భగవద్గీత లాగా చదవి, అవి అమలు చేసేంత వరకు వదలొద్దు అని కార్యకర్తలకు కేటీఆర్‌ దిశా నిర్దేశం చేశారు. ఒక్క నెలలోనే ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న ప్రభుత్వం ఒక్క కాంగ్రెస్‌ మాత్రమేనని కేటీఆర్‌ విమర్శించారు. తెలంగాణ భవన్‌ లో జరిగిన భువనగిరి పార్లమెంట్‌ సమీక్ష సమావేశంలో కేటీఆర్‌ పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓటమికి తానే బాధ్యుడినని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్‌కు ఓటములు కొత్త కాదని.. ఇది కేవలం స్పీడ్‌ బ్రేకర్‌ మాత్రమేనని చెప్పుకొచ్చారు. పదేళ్ల పాటు విరామం లేకుండా పనిచేసిన కారు.. మరింత స్పీడ్‌గా దూసుకెళ్లేందుకు ప్రస్తుతం సర్వీసింగ్‌కు వెళ్లిందని.. షెడ్డుకు వెళ్లలేదని కేటీఆర్‌ పేర్కొన్నారు. పదేళ్ల పాటు పాలన మీద దృష్టి పెట్టి.. పార్టీని పట్టించుకోలేదని అందుకు తనదే బాధ్యత అని కేటీఆర్‌ చెప్పుకొచ్చారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే కేంద్రంగా పార్టీని నడపడం సరికాదని కేటీఆర్‌ అభిప్రాయపడ్డారు. పదేళ్లలో పార్టీ కార్యకర్తల ఆర్థిక పరిస్థితిని పట్టించుకోలేదని ఒప్పుకున్నారు. ఇక నుంచి ఎమ్మెల్యే చుట్టూ పార్టీ తిరిగే విధానం ఉండదు.. పార్టీ చుట్టే ఎమ్మెల్యే తిరిగే విధానాన్ని ఉంటుందని పేర్కొన్నారు. ముఖ్యంగా దళితబంధు కొందరికే రావడంతో మిగిలిన వాళ్లు పార్టీకి వ్యతిరేకమయ్యారనన్నారు. దళితబంధుపై ఇతర వర్గాల్లోనూ వ్యతిరేకత వచ్చిందన్నారు. భూస్వాములకు రైతుబంధు ఇవ్వడానికి చిన్న రైతులు ఒప్పుకోలేదని కూడా కేటీఆర్‌ తెలిపారు. పథకాలపై ప్రజా వ్యతిరేకతను సరిగ్గా అంచనా వేయలేకపోయామని కేటీఆర్‌ అభిప్రాయపడ్డారు. తెలంగాణ వచ్చాక రెండుసార్లు మనల్ని గెలిపించింది అదే ప్రజలు అనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. ప్రజలు మన పార్టీని పూర్తిగా తిరస్కరించలేదని గుర్తించాలన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి, మనకు ఓట్ల తేడా కేవలం 1.8 శాతం మాత్రమే అన్నారు. పద్నాలుగు చోట్ల అతి స్వల్ప తేడాతో మన అభ్యర్థులు ఓడిపోయారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి ప్రత్యామ్నాయం బీఆర్‌ఎస్‌ మాత్రమే అన్నారు.
మరోవైపు.. ఎన్నికల్లో ప్రజలు తప్పుచేశారనటం సరైంది కాదని.. బీఆర్‌ఎస్‌ నేతలు ఇకపై అలా మాట్లాడొద్దని కేటీఆర్‌ సొంత పార్టీ నేతలకు సున్నితంగానే చురకలంటించారు. గతంలో రెండు సార్లు తమకు గెలిపించింది కూడా ఈ ప్రజలేనని గుర్తు పెట్టుకోవాలన్నారు. పార్టీని ప్రజలు పూర్తిగా తిరస్కరించలేదని… 14 చోట్ల అతి తక్కువ తేడాతోనే బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఓడిపోయారని గుర్తు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం బీఆర్‌ఎస్‌ మాత్రమేనని కేటీఆర్‌ స్పష్టం చేశారు. ఓటమిని సమీక్షించుకుని రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో రెట్టించిన ఉత్సాహంతో పాల్గొందామని కేటీఆర్‌ పిలుపునిచ్చారు. ప్రజలు ఫలితాల్లో భిన్నత్వాన్ని చూపించారని.. ఎందుకు ఇలా జరిగిందో విశ్లేషించుకుని భవిష్యత్తు గురించి ఆలోచించాలన్నారు కేటీఆర్‌.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు