Tuesday, April 30, 2024

ఢిల్లీ గుప్పిట నుంచి తెలంగాణను దక్కించుకోవాలి

తప్పక చదవండి
  • కాంగ్రెస్‌ హామీలను నెరవేర్చడం కష్టమే
  • కష్టపడితేనే ఎంపి సీట్లను సాధించుకోగలం
  • పార్టీ నిలవాలంటే మనమంతా గట్టిగా పనిచేయాలి
  • వరంగల్‌ సమీక్షలో వర్కింగ్‌ ప్రసిడెంట్‌ కెటిఆర్‌

హైదరాబాద్‌ : ఢిల్లీ చేతుల్లోకి వెళ్లిన తెలంగాణను మళ్లీ మన గుప్పిట్లోకి తెచ్చుకోవాల్సి ఉందని, అందుకు పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలవడమే మార్గమని బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ కెటిఆర్‌ అన్నారు. అందుకు మనమంతా కలసికట్టుగా కృషి చేయాల్సి ఉందన్నారు. కొన్ని తప్పిదాల వల్ల అసెంబ్లీ ఎన్నికల్లో మనం ఓటమి పాలయ్యాం. ఇప్పుడు ఢిల్లీ చేతుల్లోకి తెలంగాణ వెళ్ళింది. మన తెలంగాణ మన చేతుల్లోకి తెచ్చుకునే సమయం ఆసన్నమైంది. రాబోయే పార్లమెంట్‌ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోండి. కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలు ప్రజలు నమ్మే పరిస్థతిలో లేరు. తెలంగాణ గళం, బలం డిల్లీలో వినిపించాలంటే మనం రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలవాల్సిన అవసరం ఉందని కెటిఆర్‌ పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ వరంగల్‌ పార్లమెంట్‌ సమీక్ష సమావేశం 8వ రోజు తిరిగి ప్రారంభమైంది. వరంగల్‌ పార్లమెంట్‌ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గ ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీటీసీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీఆర్‌ఎస్‌ నేతలు కేటీఆర్‌, కడియం శ్రీహరి,పోచారం శ్రీనివాస రెడ్డి, మధు సుధనాచారి, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌, పొన్నాల లక్ష్మయ్య, రావుల చంద్రశేఖర్‌ రెడ్డి హాజరయ్యారు.సమావేశానికి లేటుగా మాజీ ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌ వచ్చారు. ఈ క్రమంలోనే వినయ్‌ భాస్కర్‌కు కేటీఆర్‌ చురకలు అంటించారు. అసెంబ్లీకీ లేటే, మీటింగ్‌కు లేటేనా అని ప్రశ్నించారు. ఇక ఈ సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడుతూ..రాబోయే పార్లమెంట్‌ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ సమావేశాలు నిర్వహిస్తున్నాము. తల్లడిల్లి ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏళ్ల పాటు చల్లగా కాపాడుకున్నాం. ఇప్పుడు మళ్లీ మనం పట్టు సాధిస్తేనే మనగలుగుతామని అన్నారు. స్వల్పకాలంలోనే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయే లక్షణం కాంగ్రెస్‌ పార్టీ సొంతమని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. ఆ పార్టీ గత చరిత్రను పరిశీలిస్తే అర్థమయ్యేది అదేనని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఓటమికి గల కారణాలను లోతుగా విశ్లేషించారు. లోటుపాట్లు సవరించుకుంటే భవిష్యత్తు అంతా బీఆర్‌ఎస్‌దేనని చెప్పారు. వాగ్దానాలను నిలుపుకునే చిత్తశుద్ధి కాంగ్రెస్‌కు ఉండదని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటై నెలదాటింది. అధికారంలోకి వచ్చిన తెల్లారినుంచే హామీలను అమలు చేస్తామని ప్రకటించిన ఆ పార్టీ.. ఇప్పుడు ఉద్దేశపూర్వకంగా కాలాయపన చేస్తున్నది. కాంగ్రెస్‌ నెల రోజుల పాలనా పోకడలే అందుకు సాక్ష్యం. ప్రభుత్వ తీరుతో ప్రజల్లో అప్పుడే అసహనం ప్రారంభమైంది. హామీల అమలు కోసం కాంగ్రెస్‌ పార్టీ మీద ఒత్తిడి తెస్తూ రాష్ట్ర ప్రజల కోసం బీఆర్‌ఎస్‌ పార్టీ పోరాడుతుంది. ఆ దిశగా బీఆర్‌ఎస్‌ శ్రేణులు కార్యోన్ముఖులు కావాలని పిలుపునిచ్చారు. ప్రతిపక్షంలో ఉంటేనే మరింత పోరాట పటిమ చూపగలమని కేటీఆర్‌ అన్నారు. ఉద్యమంలో గట్టిగా పోరాడిన చరిత్రను గుర్తుచేశారు. బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్‌ అధికారంలో ఉండటం కన్నా ప్రతిపక్షంలో ఉండటమే కాంగ్రెస్‌ పార్టీకి ప్రమాదకరమని చెప్పారు. రెండుమూడు నెలలకోసారి అన్ని స్థాయిల కమిటీల సమావేశాలు క్రమం తప్పకుండా ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు రాజకీయ అస్థిత్వంగా నిలిచిన బీఆర్‌ఎస్‌ పార్టీ, కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణను గెలిపించిందని కేటీఆర్‌ పేర్కొన్నారు. పదేండ్ల అనతికాలం లోనే తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలబెట్టిన ఘనత కేసీఆర్‌దేనని చెప్పారు. ’తెలంగాణ గళం బీఆర్‌ఎస్‌. తెలంగాణ బలమూ బీఆర్‌ఎస్సే. బీఆర్‌ఎస్‌ వేయబోయే ప్రతి అడుగులో కేసీఆర్‌ దళంగా ఐకమత్యంగా ముందుకు సాగుదాం. తెలంగాణ సాధించిన ఘనతకు, వెలుగొందుతున్న ప్రభకు ఏమాత్రం భంగం కలిగించకుండా చూసుకోవాల్సిన బాధ్యత బీఆర్‌ఎస్‌ శ్రేణులపై ఉన్నది. ఉద్యమ స్ఫూర్తిని, నిన్నటిదాకా సాధించిన ప్రగతిని తిరిగి నిలబెట్టుకుందాం. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీని గెలిపించుకుందాం’ అని పిలపునిచ్చారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు