Monday, April 29, 2024

అసమ్మతి సుడిగుండంలో రాజస్థాన్‌ కమలం

తప్పక చదవండి

జైపూర్‌ : రాజస్థాన్‌ లోని అధికార, విపక్షాలను అసమ్మతి బెడద పీడిస్తోంది. ముఖ్యంగా బీజీపీకి ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తోంది. శాసనసభ ఎన్నికలకు సంబంధించి 41 మంది అభ్యర్థుల పేర్లతో బీజేపీ ఇటీవల తొలి జాబితా విడుదల చేసింది. ఇందులో ఏడుగురు ఎంపీలకు టికెట్లిచ్చింది. రాష్ట్రంలో 200 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్‌సభ స్థానాలున్నాయి. అంటే ఒక్కో పార్లమెంట్‌ నియోజక వర్గ పరిధిలో సగటున 8 అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తాయి. ఆ లెక్కన టికెట్లు పొందిన ఏడుగురు ఎంపీలు వారి లోక్‌సభ స్థానాల పరిధిలోని 56 అసెంబ్లీ స్థానాలను ప్రభావితం చేస్తారని, దాంతో గెలుపు సునాయాసమవుతుందని అధిష్ఠానం భావిస్తోంది. అయితే టికెట్‌ లభించని సిట్టింగ్‌ ఎమ్మెల్యేలతో పాటు టికెట్‌ ఆశించి భంగపడ్డ నాయకులూ అధిష్ఠానంపై అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. వారిలో కొందరు స్వతంత్రంగా పోటీ చేస్తామని తిరుగుబావుటా ఎగరేశారు. విద్యాధర్‌ నగర్‌ నియోజక వర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నర్సత్‌ సింగ్‌ రజ్వీని కాదని ఎంపీ దియా కుమారికి టికెట్‌ ఇవ్వడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.సిట్టింగ్‌ ఎమ్మెల్యే మాజీ ఉప రాష్ట్రపతి బైరాన్‌ సింగ్‌ షెకావత్‌ అల్లుడు కావడం రాజకీయంగా ప్రాముఖ్యం సంతరించుకుంది. తనను కాదని ఎంపీకి టికెట్‌ ఎలా ఇస్తారని రజ్వీ బహిరంగంగానే అధిష్ఠానాన్ని నిలదీశారు. తిజ్‌రా సిట్టింగ్‌ ఎమ్మెల్యే తాను స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. మరోచోట తన తండ్రి జయరామ్‌ జాటవ్‌కు టికెట్‌ ఇస్తే మరో తిరుగుబాటు నేతను గెలిపిస్తానని అతని కుమార్తె ప్రకటించింది. సాంచోర్‌ టికెట్‌ పొందిన మరో ఎంపీ దేవీ పటేల్‌ సొంత గ్రామంలో పూజలు చేయడానికి వెళ్లగా అతడిపై రాళ్ల దాడి జరిగింది. టికెట్‌ ఆశించి భంగపడ్డ దానారాం చౌదరి వర్గీయులు ఈ దాడి చేసి ఉంటారని భావిస్తున్నారు. అయితే పార్టీలో అసంతృప్తులపై చర్యలు తీసుకుంటామని అధిష్ఠానం సంకేతాలిస్తున్నది. ఈ మేరకు ఇప్పటికే 11 మందిని ఆరేళ్ల పాటు పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. అయినా టికెట్‌ దక్కని నాయకుల్లో అసంతృప్తి చల్లారడం లేదు. కాగా, ఎన్నికల వేళ సీఎం అభ్యర్థిని ప్రకటించకపోవడం అసంతృప్తికి దారి తీసింది. మాజీ సీఎం వసుంధర రాజే రాష్ట్ర బీజేపీలో బలమైన నేత. అయితే ఆమెకు ప్రధాని మోడీతో సత్సంబంధాలు లేవనేది బహిరంగ రహస్యమే. ఈ ఎన్నికల్లో ఆమె వర్గీయులకు టికెట్లు ఇవ్వకుండా ఆమెను రాజకీయంగా తొక్కేస్తున్నారని ఆరోపణలున్నాయి. ఆమెను రాజకీయంగా దెబ్బతీయడానికే మోడీ వ్యూహాత్మకంగా సిట్టింగ్‌ ఎంపీలను అసెంబ్లీ బరిలోకి దించారని భావిస్తున్నారు. ఈ పరిస్థితులను అధిష్టానం ఎలా ఎదుర్కొంటుందో చూడాల్సి
వుంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు