- రక్తదానంతో సరిపెట్టుకున్న బిఆర్‌ఎస్ నేతలు
హైదరాబాద్ : బీఆర్‌ఎస్ పార్టీకి నిరాశ ఎదురైంది. దీక్షా దివస్‌కు పోలీస్ అధికారులు అనుమతి నిరాకరించారు. పోలీస్ కమిషనర్‌తో ఫోన్‌లో మాట్లాడిన బీఆర్‌ఎస్ నేత శంబీపూర్ రాజు, లీగల్ సెల్ నేత సోమ భరత్ పాల్గొననున్నారు. బీఆర్‌ఎస్ దీక్ష దివస్‌కు అనుమతి లేదని సీపీ తేల్చి చెప్పారు. కేటీఆర్ వచ్చి పార్టీ కార్యాలయంలో కూర్చుంటే సీపీ అభ్యంతరం లేదని చెప్పారు. ఎన్నికల కోడ్, 144 సెక్షన్ అమలులో ఉన్నందున దీక్ష దివస్ చేయొద్దని పోలీసులు తేల్చి చెప్పారు. తెలంగాణ భవన్‌లో కేటీఆర్ లేకుండానే రక్త దాన శిబిరం స్టార్ట్ చేశారు. తరవాత తెలంగాణ భవన్‌కు కేటీఆర్ వచ్చారు. రక్త దాన శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం స్వయంగా రక్త దానం చేశారు. కాగా, అంతకు ముందు బీఆర్‌ఎస్ భవన్‌కు చేరుకున్న కేటీఆర్‌కు తెలంగాణ భవన్‌లో దీక్షా దివస్ చేపట్టవద్దని ఎన్నికల స్క్వాడ్ అభ్యంతరం తెలిపింది. ప్రచారం గుడువు ముగిసినందున పార్టీ కార్యాలయాల్లో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టవద్దని సూచించింది. అయితే దీక్షా దివస్ ఎన్నికల కార్యక్రమం కాదని బీఆర్‌ఎస్ నేతలు తెలిపారు. తెలంగాణ భవన్‌లో రక్తదాన శిబిరం నిర్వహిస్తామని తెలుపడంతో అందుకు ఎన్నికల అధికారులు అంగీకరించారు. దీంతో పెద్ద ఎత్తున కేటీఆర్‌తో పాటు బీఆర్‌ఎస్ శ్రేణులు రక్తదానం చేశారు.