Friday, May 17, 2024

జడ్సన్ అంటే జంకెందుకు..?

తప్పక చదవండి
  • బీఆర్ఎస్ సర్కార్ ను ఫుట్ బాల్ ఆడిన జడ్సన్
  • కేసీఆర్ కు కంటిమీద కునుకు లేకుండా జేసిన బక్క
  • గులాబీ పార్టీనీ గద్దె దింపడంలో పరోక్ష పాత్ర
  • కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయనకు దక్కని గౌరవం
  • ఇటీవల బక్క జడ్సన్ ను సస్పెండ్ చేసిన పార్టీ
  • నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ
  • పునరాలోచనలో పడ్డ హస్తం పార్టీ
  • జడ్సన్ పై టీపీసీసీలో చర్చ.. సస్పెన్షన్ ఎత్తివేసే ఛాన్స్.?

రాష్ట్ర రాజకీయాల్లో అతనో ఓ గొప్ప ఫైటర్.. మంచి షూటర్ కూడా.. ఆయన ఒక్కడై పోరాడుతున్నాడు. ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు, బడా కంపెనీల బండారం బయటపెడుతూ కీలక ఆధారాలతో నిలదీసే ఏకైక వ్యక్తి. బెదిరింపులకు ఏనాడు భయపడలేదు. నాడు, నేడు ప్రభుత్వాలపైనే కొట్లాడుతున్నాడు మరీ. అతనే సస్పెన్షన్ కు గురైన కాంగ్రెస్ సీనియర్ లీడర్ బక్క జడ్సన్. ఇయాల అతనివెంట జనమంతా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. కేసీఆర్ సర్కార్ ను ఓ ఆట ఆడుకున్నాడు. కల్వకుంట్ల కుటుంబం చేసే కాళేశ్వరం, మిషన్ భగీరథ, ధరణీ పోర్టల్ వందలాది ఎకరాలు మాయం, ఓఆర్ఆర్ లీజ్ వంటి భారీ అవినీతి దందాలపై ఆర్టీఐ వివరాలతో బయటపెట్టిన ఘనత బక్క జడ్సన్ ది. గత పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ నేతలు చేసిన అవినీతి అంతా ఇంతా కాదనీ తెలంగాణ ప్రజలకు తెలియజెప్పి ఆ పార్టీని అధికారంలో నుంచి దించిన దాంట్లో ఆయనది పరోక్ష పాత్ర. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో జరిగిన అవకతవకలు, అవినీతిపై నిలదీస్తూ ఆధారాలతో సహా కోర్టుల్లో కేసులు వేశాడు. రాష్ట్రానికి పట్టిన కేసీఆర్ ఫ్యామిలీ పీడ విరిగిపోవాలంటూ అనేక ప్రెస్ మీట్ లు, ప్రసంగాలతో ఒంటికాలుతో (వికలాంగుడైన) పోరాటాలు చేసిండు. ఈ నేపథ్యంలో తెలంగాణ సమాజం ఆలోచన చేసి కారు పార్టీని ఓడగొట్టి కేసీఆర్ ను ఫామ్ హౌజ్ లో కూర్చొబెట్టిర్రు. ఇందిరమ్మ రాజ్యం అయినా బాగుంటదేమోనని హస్తం పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను నమ్మి చెయ్యి గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ ను అధికారంలో కూర్చొబెట్టిర్రు. అయితే ఇందులో కీలక పాత్ర పోషించిన బక్క జడ్సన్ ను మాత్రం పార్టీ నుంచి బయటకు వెళ్లగొట్టిర్రు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచే, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వంటి పెద్ద పెద్ద నాయకులతో కలిసి పనిచేసిన అనుభవం ఉంది. అంతేకాదు క్రమశిక్షణ గల లీడర్ గా పార్టీలో ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్నాడు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఏం జరిగిందో ఏమోగానీ ఆయనకు ఏదైనా పదవీ దక్కుడు సంగతి పక్కనబెడితే అసలు జడ్సన్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ‘అక్కర ఉన్నంత వరకు ఆదినారాయణ అక్కర తీరాక గుదినారాయణ’ అన్నట్టుగా ఉంది టీపీసీసీ తీరు.

పట్టుభద్రుల ఎమ్మెల్సీగా బరిలోకి:
డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ స్థానాలు గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే అంతకు ముందు 2021 మార్చిలో పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిచిన పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగాం ఎమ్మెల్యేగా గెలిచినందున ఆ స్థానంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. కాగా ఎమ్మెల్సీగా పోటీచేసేందుకు జడ్సన్ ఆసక్తి కనబరుస్తున్నాడు. అప్పటి నుంచే ఆయా ప్రాంతాల్లో తిరుగుతూ పలు సమస్యలు తెలుసుకుంటూ ప్రచారంలో ముందుకు వెళ్తున్నాడు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ మద్దతుతో బరిలో దిగేందుకు సన్నద్ధం అయ్యాడు. ఉమ్మడి జిల్లాలు తిరుగుతూ ఉద్యోగుల‌ను, నిరుద్యోగులను కలుస్తున్నాడు. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ కుటుంబంపై ఫైట్ చేసిన నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా బక్క జడ్సన్ కు మంచి ఫాలోయింగ్ పెరిగింది. ఇటీవల ఆయనను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసినందున కొంతమంది దానిని వ్యతిరేకించారు. జడ్సన్ కు జరిగిన అన్యాయంపై ఆయనకు అండగా నిలుస్తున్నారు. అందులో భాగంగా ప్రజలు ఆయనకు ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా యువతకు బక్క జడ్సన్ వెంట ఉన్నారు.

- Advertisement -

సస్పెండ్ పై పునరాలోచనలో టీపీసీసీ:
తెలంగాణలో ఎంపీ ఎలక్షన్స్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై నెగెటివ్ టాక్ వినిపిస్తోంది. నాలుగు నెలలు దాటిన ఆరు గ్యారెంటీలు అమలు చేయకపోవడం, బీఆర్ఎస్ పార్టీలో ఉండి, గత ప్రభుత్వ హయాంలో కీలక పాత్ర పోషించిన అవినీతి నాయకులను హస్తం పార్టీలోకి చేర్చుకోవడంతో ప్రజలు మండిపడుతున్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, అణగారిన వర్గాలను మరిచి, అన్నింట్లో రెడ్డిలకే ప్రాధాన్యత ఇస్తుండడంతో కాంగ్రెస్ పై తీవ్ర వ్యతిరేకత వస్తోంది. అయితే ఓ పక్క ఎంపీ అభ్యర్థులు బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారు లేదా రెడ్డిలు అత్యధికులు కావడం, మరో పక్క పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బక్క జడ్సన్ కాంగ్రెస్ కు పోటీగా రావడంతో టెన్షన్ మొదలైంది. అసలే జడ్సన్ అకారణంగా సస్పెండ్ చేశామనీ టీపీసీసీ పునరాలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. ఇప్పటికే నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలు తిరుగుతూ ఉద్యోగుల‌ను, నిరుద్యోగులను కలుస్తున్న జడ్సన్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. అయితే బక్క జడ్సన్ కు క్రేజ్ పెరిగినందున గాంధీ భవన్ లో ఆయన గురించి చర్చ నడుస్తోంది. సస్పెన్షన్ ఎత్తివేసి ఆయనను చల్లబరిచే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే బక్క జడ్సన్ కు కొందరి వ్యక్తుల ద్వారా రాయబారాలు పంపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. అత్యధిక ఎంపీ స్థానాలు రావాలన్నా, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం కాంగ్రెస్ ఖాతాలో పడాలంటే జడ్సన్ పట్ల టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి నెక్ట్స్ ఏ స్టెప్ తీసుకుంటారో చూడాలి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు