Friday, May 10, 2024

బీఆర్‌ఎస్‌లోకి నాగం జనార్దన్ రెడ్డి

తప్పక చదవండి
  • కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన నాగం
  • మంత్రులు కేటీఆర్, హరీష్ రావుతో భేటీ
  • కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు
  • నాగర్ కర్నూలు టికెట్ ఆశించి భంగపాటు
  • రాజేశ్ రెడ్డికి టికెట్ ఇచ్చిన హస్తం
  • అసంతృప్తితో ఉన్న నాగం జనార్దన్ రెడ్డి

తెలంగాణ సీనియర్ రాజకీయవేత్త, మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ లభించకపోవడంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. నాగం జనార్దన్ రెడ్డి నాగర్ కర్నూలు టికెట్ ఆశించారు. అయితే కాంగ్రెస్ పార్టీ నాగర్ కర్నూలు టికెట్ ను కూచకుళ్ల రాజేశ్ రెడ్డికి కేటాయించింది. ఈ పరిణామంతో నాగం మనస్తాపానికి గురైనట్టు సమాచారం. పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న ఆయన నిరసన గళం వినిపించారు. ఈ సందర్బంగా బీఆర్‌ఎస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్వాన్న స్థితికి వచ్చిందని నాగం విమర్శించారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలు బాధ కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో పొద్దున చేరిన వాడికి సాయంత్రం టిక్కెట్ ఇచ్చారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఎవడో సర్వే చేస్తే, నాకు అనుకూలంగా లేదని చెప్పాడట. తెలంగాణలో ముఖ్య నాయకుడిని నేను. ఇంట్లో కూర్చొని సర్వే చేయటం కాదు. నియోజకవర్గానికి వచ్చి తెలుసుకోండి’ అంటూ నాగం మండిపడ్డారు.

నాగర్ కర్నూల్‌లో ఎవరో చిన్నపిల్లవాడికి టికెట్ ఇచ్చారంటూ ఎద్దేవా చేశారు. ఆయన ఎవరో నియోజకవర్గంలో కూడా తెలియదంటూ ఘాటు విమర్శలు చేశారు. అందుకే రెండు రోజులుగా ఆలోచించి, పార్టీకి రాజీనామా చేశానని తెలిపారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి హరీష్ రావు ఆదివారం సాయంత్రం గచ్చిబౌలిలోని నాగం జనార్ధన్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనతో సంప్రదింపులు జరిపారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. ‘నాగం పుట్టుకతో తెలంగాణ వాది’ అన్నారు. నాగం, కేసీఆర్ మధ్య నాలుగు దశాబ్దాలుగా అనుబంధం ఉందని చెప్పారు. పార్టీలో ఆయనకు సముచిత గౌరవం కల్పిస్తామని ప్రకటించారు. తన అనుచరులు, కార్యకర్తల అబీష్టం మేరకు బీఆర్‌ఎస్ పార్టీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నానని నాగం జనార్దన్ రెడ్డి తెలిపారు. ప్రగతి భవన్‌లో నేడు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలవనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తానని నాగం అన్నారు. మంచి ముహూర్తం చూసుకొని బీఆర్‌ఎస్‌లో చేరతానని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు రాసిన లేఖను మీడియా ప్రతినిధులకు అందజేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు