Friday, July 19, 2024

కబ్జాదారుల కబంధ హాస్తాల్లో ప్రభుత్వ భూమి..

తప్పక చదవండి
  • పటేల్‌ గూడ ప్రభుత్వ భూములను మింగేస్తున్న చంద్ర శేఖరుడు …
  • ఆర్డీఓ, డీపీఓ నివేదికతో అధికారులను తొలగించారు.. అక్రమ నిర్మాణాలను కూల్చడం మరిచారు..
  • ఎమ్మెల్యే అనుచరుడైతే ప్రభుత్వ భూమి కబ్జా చేసుకోవచ్చా..?
  • ప్రభుత్వం మారిన బీఆర్‌ఎస్‌ నాయకుడి పరపతి తగ్గలే…
  • కబ్జాదారులకు పరోక్ష సహకారం అందిస్తున్న రెవిన్యూ అధికారులు
  • అన్యాక్రాంతం అవుతున్న ప్రభుత్వ భూములను కాపాడేది ఏవరు..?
  • మంత్రి దామోదరా..! అధికారుల పనితీరు పై దృష్టి సారించి అక్రమ నిర్మాణాలను అరికట్టండి..

రాజు తల్చుకుంటే దెబ్బలు కొదవ అన్న చందంగా ఉంది.. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటె మాకేంటి..స్థానికంగా మా ఎమ్మెల్యే ఉంటె చాలు.. బీఆర్‌ఎస్‌ నాయకులు తలుచుకుంటే ప్రభుత్వ స్థలాలే ఉండవు… అనే విధంగా ఉంది..ఈ చంద్ర శేఖరుని తీరు.. ప్రస్తుత ప్రభుత్వంలోని అధికారుల తీరు నిమ్మకు నీరెత్తినట్లు ఉండటంతో కబ్జా దారులు పెట్రేగి పోతున్నారన్నది జగమెరిగిన సత్యం.. ఓ వైపు కళ్లెదుటే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం చేస్తున్న ప్రస్తుత ఎమ్మెల్యే అనుచరుడు చంద్రశేఖర్‌ భూ మాయాజాలాలు.. మాయల ఫకీర్‌ ను మించిపోతున్నాయి..అంతా మాయల అనిపిస్తున్న ఇది మాయ కాదు..నిజమేనండోయ్‌.. ఎక్కడో అనుకుంటున్నారా..! ఒక్కసారి వివరాల్లోకి వెళ్దాం..

హైదరాబాద్‌ : సంగారెడ్డి జిల్లా అమీన్‌ పూర్‌ మండలం పటేల్‌ గూడ గ్రామ పంచాయితీ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హాయంలో కనుమరుగవ్వడం ఒకతంతు అయితే.. ప్రస్తుత ప్రభుత్వంలో కూడా అదే తంతు కొనసాగుతోంది.. గత ప్రభుత్వంలో ఆ పార్టీ నాయకులూ కొనసాగించిన కబ్జాల పర్వం.. ప్రభుత్వం మారీనా బిఆర్‌ఎస్‌ పార్టీ నాయకుల పరపతి మాత్రం నేటికీ యథేచ్ఛగా కొనసాగుతోంది.. అందుకు నిదర్శనం పటేల్‌ గూడా సర్వే నెంబర్‌ 12 లో జరుగుతున్న ప్రభుత్వ స్థలం కబ్జా వ్యవహారం.. పఠాన్‌ చెరువు నియోజిక వర్గం బిఆర్‌ఎస్‌ పార్టీ నాయకుడు, స్థానిక ఎమ్మెల్యే అనుచరుడు చంద్రశేఖర్‌ చేస్తున్న అక్రమ నిర్మాణాల పై ప్రభుత్వ అధికారులతో పాటు, స్థానిక ఎమ్మెల్యే మహిపాల్‌ రెడ్డి సంపూర్ణ మద్దతు ఉందని స్థానికులు కోడై కూస్తున్నారు .. ప్రభుత్వ స్థలంలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను సంబంధిత రెవిన్యూ,పంచాయితి అధికారులు గతంలో రెండుసార్లు కూల్చినప్పటికీ యథేచ్ఛగా నిర్మాణాలు చేపట్టడం..ప్రస్తుత రెవిన్యూ అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడక పోవడం సర్వత్రా చర్చ నియాంశంగా మారింది..ఇదే విషయం పై సంగారెడ్డి జిల్లా ఆర్డీఓ,జిల్లా పంచాయితీ అధికారి సంయుక్తంగా విచారణ జరిపి, గత జిల్లా కలెక్టర్‌ శరత్‌ కు లెటర్‌ నెంబర్‌ సి 1/5569/2023, తేదీ : 13-07-2023 గల లేఖ ద్వారా ప్రభుత్వ భూమి కబ్జాకు గురైనా విషయం వాస్తవమేనని..అక్రమ నిర్మాణాలకు సహకరించిన అధికారుల తీరు పై నివేదిక సమర్పించారు..స్పందించిన కలెక్టర్‌ అధికారులను తొలగించి అక్రమ నిర్మాణాలను కూల్చి వేయాలయాని ఆదేశాలు జారీ చేశారు..నాటి స్థానిక అధికారులైన అమీన్‌ పూర్‌ మండల రెవిన్యూ ఇన్స్‌ పెక్టర్‌ తో పాటు పటేల్‌ గూడ పంచాయితీ కార్యదర్శి ని విధుల నుండి తొలగించారు..అక్రమ నిర్మాణాలను కూల్చి వేయడానికి వెళ్లిన జెసిబి వాహనాలను గతంలో బి.ఆర్‌.ఎస్‌ ప్రభుత్వం ఉండటంతో ఎమ్మెల్యే కు అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తి అవ్వడంతో అధికారులకు ఎమ్మెల్యే మహిపాల్‌ కూల్చద్దని చెప్పడంతో నాటి అధికారులు వెనుదిరిగి వెళ్లినట్లు బలమైన విశ్వసనీయ సమాచారం.. బీ.ఆర్‌.ఎస్‌. నాయకుడై ఉండి, ఎమ్మెల్యే అనుచరుడిగా కొనసాగితే ప్రభుత్వ స్థలాలను కబ్జాచేసి నిర్మాణాలు చేపట్టినా..వీరికి చట్టాలు వర్తించవా అని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు.. బి.ఆర్‌.ఎస్‌ ప్రభుత్వం మారి కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన పఠాన్‌ చెరువు నియోజిక వర్గ ఎమ్మెల్యే బి.ఆర్‌.ఎస్‌ పార్టీ అవ్వడంతో నేటికీ పటేల్‌ గూడ లోని అక్రమ నిర్మాణాలను రెవిన్యూ అధికారులు కూల్చక పోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.. సర్వేనెంబర్‌ 12 ప్రభుత్వ భూమిలో జరుగుతున్న కబ్జాలలో బీఆర్‌ఎస్‌ నాయకుడు చంద్రశేఖర్‌ కబ్జా వ్యవహారం ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున చర్చ నియాంశంగా మారింది.. ప్రభుత్వం మరీనా నేటికీ ఇతగాడి పరపతి మాత్రం తగ్గలేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు.. అమీన్‌ పూర్‌ మండలంలోని పేదలు కట్టుకున్న ఇళ్లను కూల్చిన గత రెవెన్యూ అధికారులకి ,బీ.ఆర్‌.ఎస్‌. నాయకులు పటేల్‌ గూడా సర్వేనెంబర్‌ 12లో నిర్మిస్తున్న భవనాలు కనిపించకపోవడం ఏంటని ముక్కున వేలేసుకుంటున్నారు ఆ వైపు వెళ్లే ప్రజలు.. బీఆర్‌ఎస్‌ నాయకులకి ప్రత్యేక చట్టాలు ఉన్నాయా.. ? అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. సర్వేనెంబర్‌ 12 ప్రభుత్వ స్థలంలో బహిరంగంగానే కబ్జాదారులు నిర్మాణాలు చేపడుతుంటే చర్యలు తీసుకోవాల్సిన అమీన్‌ పూర్‌ తహశీల్దార్‌ .. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడం చూస్తుంటే.. అంతా వారికీ తెలిసే జరుగుతుందని స్పష్టం అవుతుంది. విధి నిర్వహణలో అలసత్వాన్ని ప్రదర్శిస్తూ, కబ్జాదారుల కొమ్ముకాస్తున్న ప్రభుత్వ భూములను పరి రక్షించడంలో విఫలమైన తహశీల్దార్‌ పై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు.. ఇప్పటికైనా బి.ఆర్‌.ఎస్‌ నాయకుడి కబ్జా వ్యవహారం పై మంత్రి దామోదర రాజా నర్సింహా స్పదించి సంగారెడ్డి జిల్లా ఆర్డీఓ,జిల్లా పంచాయితీ అధికారి జాయింట్‌ ఇన్స్‌ పెక్షన్‌ చేసి ఇచ్చిన నివేదికతో ఆర్‌.ఐ,కార్యదర్శి లను తొలగించి, అక్రమ నిర్మాణాలను కూల్చక పోవడం పై దృష్టి సారించి,తక్షణమే కూల్చివేసే విధంగా ఆదేశాలు జారీచేసి, అన్యాక్రాంతం అవుతున్న ప్రభుత్వ భూమిని కాపాడాలని పలువురు స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు..సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ కు మంత్రి ఆదేశాలు జారీ చేస్తారా..?లేదా మవునంగా ఉంటారా..? అన్నది వేచి చూడాల్సి ఉంది.. అదేవిధంగా అమీన్‌ పూర్‌ మండలంలో జరుగుతున్న భూ కబ్జాలపై,అక్రమ నిర్మాణాల పై ,కబ్జాదారులకి సహకరిస్తున్న అధికారుల వ్యవహారా తీరు పై మరిన్ని కథనాలు మీ ముందుకి తేనుంది ‘ ఆదాబ్‌ హైదరాబాద్‌ ‘
‘ మా అక్షరం అవినీతిపై అస్త్రం ‘.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు