Sunday, April 28, 2024

3 నిమిషాల్లో 3 సార్లు మైక్ కట్

తప్పక చదవండి
  • రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షం గొంతు నొక్కింది
  • ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఖూనీ చేసింది
  • నిరసనకు కూడా అవకాశం ఇవ్వకుండా పారిపోయింది
  • మిరప పంటలో తెలంగాణ మొదటి స్థానంలో వుంది
  • ప్రత్తి పంటలో దేశంలో రెండవ స్థానంలో తెలంగాణ వుంది
  • తెలంగాణలో రైతు ఆత్మహత్యలు తగ్గాయి
  • మీడియా పాయింట్ వద్ద మాజీ మంత్రి టి. హరీష్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రతిపక్షాల గొంతును నొక్కిందంటూ మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. మూడు నిమిషాల్లో మూడు సార్లు మైక్ కట్ చేశారని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఖూనీ చేసిందని చెప్పారు. నిరసనకు కూడా అవకాశం ఇవ్వట్లేదని అన్నారు. ఎంఐఎం, బీజేపీకి కూడా అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వం భయపడిందని చెప్పారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి అసత్యాలు చెప్పారని హరీశ్ రావు అన్నారు. తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారన్నారు. కాంగ్రెస్ తప్పులు బయటపెడతామని ప్రభుత్వం భయపడిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ పీవీ నరసింహారావును అవమానించిందని అన్నారు. శనివారం అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం ఆయన మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. ప్రతిపక్ష సభ్యులకు కనీసం మాట్లాడే అవకాశం కూడా కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ను విమర్శించే నైతిక అర్హత కాంగ్రెస్ కు లేదని, పూర్తి ప్రజాస్వామ్యంగా ఉంటామని చెప్పిన కాంగ్రెస్ నేతలు ప్రతిపక్షాల గొంతు నొక్కారని అన్నారు. బీఆర్ఎస్ సభ్యులకే కాదని, బీజేపీ, ఎంఐఎం సభ్యులకు కూడా మాట్లాడే అవకాశం లేదని చెప్పారు. అసెంబ్లీ సీఎం రేవంత్ రెడ్డి సహా, మంత్రులు అసత్యాలు మాట్లాడారని విమర్శించారు. ఎన్నికల సభల్లో చెప్పినట్లు అబద్ధాలు చెప్పారని దుయ్యబట్టారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు విమర్శలు గుప్పించారు. ‘పీవీ నర్సింహరావును ఢిల్లీ నాయకత్వం అవమానిస్తే నోరు విప్పలేదు. ఆనాడు టి.అంజయ్యను రాజీవ్ గాంధీ ఎలా అవమానించారో మర్చిపోయారా.?. మేం ప్రతి కార్యక్రమంలో అమరవీరులను తలుచుకుంటూనే ఉంటాం. సమైక్యవాదుల అడుగులకు మడుగులు ఒత్తింది రేవంత్ రెడ్డి. విపక్ష నేతలు మాట్లాడకుండా సభను వాయిదా వేసుకుని పారిపోయారు.’ అంటూ మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటాయని, కానీ చేతలే గడప దాటడం లేదని ఎద్దేవా చేశారు. తప్పులు ఎత్తి చూపుతున్నందుకే సభలో తమను మాట్లాడనీయకుండా చేశారని అన్నారు.

- Advertisement -

అసెంబ్లీలో ప్రతిపక్షాల గొంతు నొక్కాలని ప్రభుత్వం చూసిందని హరీష్ రావు విమర్శించారు. ‘సీఎం రేవంత్ రెడ్డి గంటన్నర సేపు మాట్లాడారు. మేం పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తితే స్పీకర్ మా మైక్ కట్ చేశారు. క్లారిఫికేషన్ కు కూడా అవకాశం లేదు. సీఎం మాట్లాడిన తర్వాత క్లారిఫికేషన్ ఇచ్చేందుకు అవకాశం ఇస్తామని చెప్పి 3 నిమిషాల్లో మూడుసార్లు మైక్ కట్ చేశారు.’ అని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో అమరులకు నివాళిగా సచివాలయం ఎదుటే అమరవీరుల స్మారకాన్ని నిర్మించుకున్నామని, ఆ ఘనత కేసీఆర్ కే దక్కుతుందని చెప్పారు. ఆనాడు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమాన్ని అడుగడుగునా వ్యతిరేకించి, ఇవాళ ఉద్యమకారులపై ప్రేమ ఉన్నట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గత పదేళ్లలో వ్యవసాయ రంగంలో తెలంగాణ 6.59 శాతం వృద్ధి సాధించి దేశంలోనే రెండో స్థానంలో నిలిచిందని, నీతి ఆయోగ్ నివేదికలో ఈ విషయం స్పష్టమైందని గుర్తు చేశారు.

తెలంగాణ శాసనసభ సమావేశాలు ఈ నెల 20 (బుధవారం)కి వాయిదా వేశారు. ఆ రోజు ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. గవర్నర్ తమిళిసై ప్రసంగంపై ధన్యవాద తీర్మానానికి శనివారం అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అనంతరం తెలంగాణ శాసనసభ బుధవారానికి వాయిదా పడింది. అంతకు ముందు సభలో వాడీవేడీగా చర్చ జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి డ్రగ్స్, పేపర్ లీకేజీ, ప్రగతి భవన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మార్పులు లాంటి అంశాలపై ప్రసంగించగా.. మాజీ మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు