Friday, May 3, 2024

కండువాల పండుగ..

తప్పక చదవండి
  • నాయకులకు కండువాల పండగ.. నేతన్నలకు ఉపాధి పండగ
  • పొద్దునో పార్టీ.. రాత్రికో పార్టీ మారుతున్న జెండాలు, కండువాలు…
  • కాలు కదపకుండానే జెండాలు ఆన్‌ లైన్‌ షాపులో మీముందుకు..

(పెరుమాళ్ల నర్సింహారావు, ఆదాబ్‌ హైదరాబాద్‌ ప్రత్యేక ప్రతినిధి) : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఈసారి చాలా ప్రత్యేకంగా మారాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి ఫిరాయింపులు జరుగుతున్నాయి. ఒక్కొకరు కనిష్టంగా ఒకటి, గరిష్టంగా రెండు పార్టీల్లోకి మారుతున్నారు. మారిన వాళ్లే మళ్లీ మళ్లీ మారిపోతున్నారు. ఈ క్రమంలో వారి మెడలో కండువాలు కూడా మారిపోతున్నాయి. ఆ కండువాల ఆర్డర్లతో చేనేత కార్మికులకు ఉపాధి అయితే పెరిగింది. ఎన్నికలేవైనా జెండాలు, పార్టీ కండువాలకు సిరిసిల్ల బాగా ఫేమస్‌. రెండు తెలుగు రాష్ట్రాలకు ఇక్కడినుంచి కండువాలు, జెండాలు సప్లయ్‌ చేస్తుంటారు. ఎలక్షన్‌ సీజన్లో కోట్ల రూపాయల్లోనే వ్యాపారం జరుగుతుంది. ఈ ఏడాది బిజినెస్‌ పెరిగిందని అంటున్నారు మాస్టర్‌ వీవర్స్‌. సిరిసిల్లలో 35వేలకు పైగా మరమగ్గాలు, వేల సంఖ్యలో కార్మికులు ఉన్నారు. మొత్తంగా ఈ ఏడాది ఎలక్షన్‌ సీజన్‌ లో సుమారు రూ.5కోట్ల వరకు వ్యాపారం జరిగే అవకాశముందని ఒక అంచనా.
ఇటీవలే బతుకమ్మ చీరల తయారీతో నేతన్నలకు చేతినిండా పని దొరికింది. ఆ సీజన్‌ పూర్తయిన వెంటనే ఎన్నికల సీజన్‌ మొదలు కావడంతో వర్క్‌ ఆర్డర్లు కంటిన్యూ అయ్యాయి. అయితే ఈ ఏడాది కండువాలు, జెండాలకు గిరాకీ మరింత పెరిగింది. ఆ గట్టు, ఈ గట్టు మారుతూ.. నాయకుల ఇళ్లలో అన్ని రకాల కండువాలు ఉండే పరిస్థితి వచ్చింది. దీంతో అన్ని పార్టీల కండువాలకు గిరాకీ పెరిగింది. సిరిసిల్ల నేతన్నలకు కూడ ఉపాధి మెరుగైంది. ఈ సీజన్‌ అయిపోగానే.. సార్వత్రిక ఎన్నికల పని మొదలవుతుంది. అప్పుడు మిగతా రాష్ట్రాలనుంచి కూడా సిరిసిల్లకు అధిక సంఖ్యలో ఆర్డర్లు వచ్చే అవకాశం ఉంది.

ఆన్‌ లైన్‌ షాపులో మీ ముందుకు..
ప్రస్తుతం అంతా ఆన్‌లైన్‌ షాపింగ్‌ యుగం నడుస్తోంది. గుండు సూది నుంచి మొదలు.. పెద్ద స్టీమర్ల స్పెయిర్స్‌ వరకు ఇప్పుడు ఆన్‌లైన్‌లో లభిస్తున్నాయి. ఏ వస్తువు కావాలన్నా.. ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ పెడితే నిర్ణీత సమయంలో మన దగ్గరకు వచ్చేస్తోంది. గతంలో దుకాణాలు, మాల్స్‌కు వెళ్లి కావల్సిన వస్తువులు వెతుక్కుని, బిల్లింగ్‌ కోసం కాసేపు వెయిట్‌ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు అనేక వెబ్‌ సైట్‌లు మనకు కావల్సిన అన్ని వస్తువులు ఇంటి వద్దకే డెలివరీ చేస్తున్నాయి. దీంతో ఫోన్‌ తీసుకుని కావల్సిన వస్తువులు ఆర్డర్‌ పెట్టేస్తున్నారు చాలా మంది. ఇప్పుడు రాజకీయ పార్టీల జెండాలు కూడా ఈ జాబితాలో వచ్చి చేరాయి. మీరు ఒక క్లిక్‌ చేస్తే చాలు మీ పార్టీ కండువా, టోపీ, జెండా ఇలా అన్ని మీ ఇంటి ముంగిట్లో వచ్చి వాలిపోతాయి. మీరు వీటి కోసం తిరగాల్సిన పనిలేదు. ఎందుకంటే ఇప్పుడు అన్ని పార్టీల వస్తువులు అమెజాన్‌ వంటి ఈ కామర్స్‌ సైట్స్‌లొ అందుబాటులోకి వచ్చాయి. మామూలుగా రాజకీయ పార్టీలు కార్యకర్తలకు జెండాలు, కండువాలు ఉచితంగా పంపిణీ చేస్తాయి. ఇక ఎన్నికలు, బహిరంగ సభలు ఇలాంటివి జరిగినప్పుడు విచ్చలవిడిగా రోడ్లపైనే పడేసి కనిపిస్తూ ఉంటాయి. ఇంత ఫ్రీగా దొరికే రాజకీయ పార్టీల కండువాలు, జెండాలు ఆన్‌ లైన్లో ఆర్డర్‌ చేసి మరి కొంటున్నారు.
సేల్స్‌ కూడ బాగానే జరుగుతున్నాయట.. ప్రస్తుతానికి జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల గుర్తులు, గుర్తులతో కూడిన జెండాలు కండువాలు టోపీలు ఇలా రకరకాల వస్తువులు అమ్ముతుంది ఆన్లైన్‌ మార్కెట్‌. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు.. మీ పార్టీ జెండాలను కొనేయండి నాయకా…

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు