Tuesday, May 7, 2024

మనసుగల నేతకే మా మద్దతు..

తప్పక చదవండి

( పఠాన్ చెరు నియోజకవర్గంలో పెరిగిన కాటా దంపతుల గ్రాఫ్ )

  • ప్రజానాయకుడికే పట్టం గట్టాలని ఓటర్ల నిర్ణయం..
  • విధి నిర్వహణలో గతి తప్పని లీడర్..
  • ప్రజల్లో ఉంటూ.. సమస్యలు పరిష్కరిస్తూ.. అలుపెరుగని నేత..
  • నేనున్నాననీ భరోసా ఇస్తూ.. పార్టీ ఔన్నత్యాన్ని నిలబెడుతూ..
  • మకిలిపట్టిన రాజకీయాల్లో ఉనికిని కోల్పోకుండా శ్రమిస్తూ..
  • రాజకీయ ఎత్తుగడను యుక్తిగా ఎదుర్కుంటూ..
  • ఎక్కడ సమస్య ఉంటే అక్కడ వాలిపోయే ప్రజానాయకుడు..
  • విలక్షణ రాజకీయ ప్రస్థానం కాటా శ్రీనివాస్ గౌడ్ కే సొంతం..
  • పఠాన్ చెరులో కాంగ్రెస్ ను ఓడించడానికి మంత్రి వేసిన పథకం..
  • కానీ కాటా వైపే ప్రజలు మొగ్గుచూపుతున్నారంటున్నా విశ్లేషకులు..
  • పఠాన్ చేరు కోటపై ఎగిరేది కాంగ్రెస్ జెండానే..

పార్టీయే తన జీవితం అనుకున్నారు.. ప్రజలే తనకు ప్రాణం అని ఎప్పుడూ తలుస్తారు.. సమాజ శ్రేయస్సే ఆయన జీవిత పథం.. అహర్నిశలు పార్టీ ప్రయోజనాలకోసం తపన.. సమస్యలు ఎక్కడ ఉన్నా క్షణాల్లో అక్కడ వాలిపోతారు.. సమస్య పరిష్కారమయ్యేంతవరకు పోరాటం సాగిస్తారు.. నేనున్నాననే ధైర్యాన్ని కలిగిస్తారు.. అనుక్షణం ప్రజల్లో ఉంటూ.. కార్యకర్తలకు చేదోడు వాదోడుగా.. నిజమైన నాయకుడు అనే పదానికి సంపూర్ణ అర్ధాన్ని తెలియజేస్తున్నాడు.. కాంగ్రెస్ అధిష్టానం ఆయన జీవన శైలిని, ఆయనలోని నిబద్ధతను గమనించి, ఎవరెన్ని పథకాలు రచించించినా ఆయనకే తమ మద్దతును ప్రకటించింది.. ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది.. ముందొచ్చిన చెవులకంటే వెనుకొచ్చిన కొమ్ములు వాడి అన్న చందంగా మధ్యలో వచ్చి చక్రం తిప్పాలనుకున్న వారికి సరైన పాఠం చెప్పింది.. దాంతో అప్పటికే పార్టీని నమ్ముకున్న తనకు అన్యాయం జరగదనే ధీమాతో ప్రచార పర్వంలో తనదైన శైలిలో సాగిపోయారు కాటా శ్రీనివాస్ గౌడ్ దంపతులు.. పఠాన్ చెరు నియోజకవర్గంలో వారికి అడుగడుగునా ప్రజలు నీరాజనాలర్పించారు.. వారి గెలుపే ప్రజల లక్ష్యంగా చేయి చేరి కలిపారు.. ఇటు పార్టీ ప్రతిష్టతను, అటు కార్యకర్తల పరిరక్షణను, ప్రజా సంక్షేమాన్ని సమానంగా చూస్తూ కాటా శ్రీనివాస్ గౌడ్ విమర్శకులను సైతం మెప్పిస్తున్నారు.. కాటా శ్రీనివాస్ గౌడ్ కి టికెట్ వచ్చింది కాబట్టి.. ఇక ఖచ్చితంగా పఠాన్ చెరు కోటపై కాంగ్రెస్ జెండా ఎగురుతుందనే నమ్మకాన్ని విశ్లేషకులు సైతం వ్యక్తం చేస్తున్నారు.. దీనికి ఒకటే కారణం కాటా శ్రీనివాస్ గౌడ్ తన కర్తవ్యాన్ని చిత్తశుద్ధితో నిర్వర్తిస్తున్నారు..

- Advertisement -

హైదరాబాద్( ఆదాబ్ హైదరాబాద్ ) : ఈసారి తెలంగాణ రాష్ట్రంలో రాబోతున్న సార్వత్రిక ఎన్నికలు ఒకింత ఆసక్తికరంగా మారాయి.. పదేళ్లు పరిపాలన సాగించిన బీ ఆర్ ఎస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేకత మూటగట్టుకుంది.. తొలిసారి తెలంగాణ రాష్ట్ర అధికార పగ్గాలు చేపట్టినప్పుడు ఒక సూపర్ పార్టీగా అనిపించినా బీ ఆర్ ఎస్ కాలగమనంలో కుటుంబ పాలనకు, అవినీతి వ్యవహారాలకు, రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన దయనీయ స్థితికి దిగజారిపోయింది.. రాష్ట్రంలోని అన్ని వర్గాలను అణగారిపోయేలా, చేసిన వాగ్ధానాలను తుంగలో తొక్కి చేయకూడని తప్పిదాలను చేసుకుంటూ పోతోంది.. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడటంతో తాము బంగారు తెలంగాణ కలను సాకారం చేస్తున్నామని, దేశంలోనే తెలంగాణను నెంబర్ వన్ గా నిలబెట్టామని బీరాలు పలుకుతూ ప్రజలను మోసపూరిత మాటలతో మభ్యపెడుతూ తిరిగి మూడో సారి అధికార పీఠం అధిరోహించడానికి పథకాలు రచిస్తోంది.. కాగా బీజీపీ కొన్ని రోజుల క్రితం ఫైర్ అవుతున్నట్టుగానే అనిపించినా.. బీ ఆర్ ఎస్ పార్టీతో లోపాయికారి ఒప్పొందం కుదుర్చుకుని తెలంగాణ ప్రజలను మోసం చేస్తోంది అన్న భావం ప్రజల్లో ఏర్పడగానే బీజేపీ గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయింది.. ఇప్పుడు తన ఉనికిని కాపాడుకోవడానికి మాత్రమే పోరాటం చేయాల్సి వస్తోంది అన్నది రాజకీయ విశ్లేషకులు వాదిస్తున్నారు.. ఇక ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా బీ ఆర్ ఎస్, కాంగ్రెస్ మధ్య మాత్రమే పోటీ అని వారంటున్నారు..

కాగా కర్ణాటకలో విజయభేరి మ్రోగించిన కాంగ్రెస్ నూతనోత్సాహంతో తెలంగాణలోనూ స్వీప్ చేసి తమ సత్తాను చాటాలని భావిస్తోంది.. తెలంగాణాలో ఓట్లు అడిగే హక్కు తమకు మాత్రమే ఉందని వారు వాదిస్తున్నారు.. వేల ప్రాణాలు బలైపోయి, బలంగా తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకుంటున్న తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షను తీర్చాలనే కృత నిశ్చయంతో తమకు, తమ పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినా తెగువ చూపి, తెలంగాణ రాష్ట్రాన్ని అందించి, తమ నిబద్ధతను చాటుకుంది.. తొలుత రాష్ట్రం అనౌన్సుమెంట్ జరిగాక అప్పటి టి.ఆర్.ఎస్. పార్టీ అధినేత కేసీఆర్ కుటుంబసమేతంగా ఢిల్లీ వెళ్లి సోనియా కాళ్ళు మొక్కి కృతజ్ఞతలు తెలియజేశారు.. అవసరం అయితే తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తానని మాటకూడా ఇచ్చారు.. కాగా ఆ తరువాత జరిగిన పరిణామాలు విదితమే.. ఈమధ్య కాలంలో అయితే ప్రతి ప్రజా సభలోనూ కేసీఆర్ మాట్లాడుతూ ఎన్నో పోరాటాలు చేస్తే తెలంగాణ వచ్చిందని, ఇది ఒకరిచ్చిన భిక్ష కాదంటూ మాట్లాడుతుండటం కూడా చూస్తున్నాం.. ఈ విపరీత పరిణామం తెలంగాణ ప్రజల్లో కేసీఆర్ మీద ఉన్న కాస్తో.. కూస్తో.. గౌరవాన్ని సైతం చంపేసింది అని రాజకీయ మేధావులు అంటున్నారు.. ఈ క్రమంలో రాబోవు ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించుకోవాలని ఆకాంక్షను బలంగా తమ మదిలో నిమ్పున్నారు జనాలు..

ఒక ప్రత్యేకతను సంతరించుకున్న పఠాన్ చెరు నియోజకవర్గం :

ఇక తెలంగాణ రాష్ట్రంలో పఠాన్ చెరు నియోజకవర్గం ఒక ప్రత్యేకతను సన్థరించుకుంది.. దేశంలోని వివిధ ప్రాంతాల, రాష్ట్రాల ప్రజలు ఇక్కడ నివాసం ఉంటున్నారు.. పారిశ్రామిక వాడగా పేరుండటం.. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెండుగా ఉండటం ఇక్కడ ప్రత్యేకత.. ఎంతో మంది పల్లెటూర్ల నుంచి తమకు సంబంధించిన పొలాలు, ఆస్తులు అమ్ముకుని ఇక్కడికొచ్చి తృణమో, ఫణమో వెచ్చించి ఒక గుడిసెను ఏర్పాటు చేసుకుని, తమకు చేతనైన పనిని చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు.. అత్యంత ఖరీదైన ప్రాంతంగా కూడా పఠాన్ చెరు పేరొందింది.. ఇక్కడ అధికార బీ ఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే గూడెం మహీపాల్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.. ఈయన వెనుక రాష్ట్ర మంత్రి హరీష్ రావు వుంటున్నాడన్నది విశ్లేషకుల మాట.. వీరిద్దరికీ వ్యాపార లావాదేవీలు, రియల్ ఎస్టేట్ దందాలు సైతం నడుస్తున్నాయన్నది వారంటున్నారు.. ఇక ఇదే పార్టీలో ఉంటూ ఒక యువసేనను స్థాపించి, ప్రజా సేవ చేస్తున్నట్టుగా కనికట్టు చేస్తున్న మరో నాయకుడు నీలం మధు ముదిరాజ్.. ఇటీవల కాలంలో నీలం మధు తరచూ వార్తల్లో నిలుస్తున్నారు.. సిట్టింగ్ ఎమ్మెల్యే గూడెం మహీపాల్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు ఉండటంతో.. ఆయన సోదరులు పలు అవినీతి కార్యక్రమాలకు, కబ్జాలకు పాల్పడుతూవుండటంతో పార్టీ అధినాయకత్వంలో ఆయనకు చెడ్డపేరు ఉందని కనుక తనకే బీ ఆర్ ఎస్ బాస్ టికెట్ ఇస్తాడని ఆశించారు.. కాలనీ అయన ఆశలను వమ్ము చేస్తూ కేసీఆర్ మహిపాల్ రెడ్డి కే టికెట్ కేటాయించడంతో ఖిన్నుడయ్యాడు.. కాంగ్రెస్ పార్టీ ఆహ్వానంతో మధు ఢిల్లీ వెళ్లి మల్లికార్జున ఖర్గే సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు.. తనకే టికెట్ కన్ఫర్మ్ అని అందరికీ చెప్పుకున్నారు.. ప్రచారం కూడా సాగించారు..

పఠాన్ చెరులో కాంగ్రెస్ ను అడ్రస్ లేకుండా చేయాలన్నదే మంత్రి ఎత్తుగడ :
ఇక్కడి రాజకీయ విశ్లేషకులు మతిపోయే మరో విషయాన్ని బలంగా వినిపిస్తున్నారు.. పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిన మంత్రి హరీష్ రావు, స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యే గూడెంతో కలిసి తన అవినీతి కార్య కలాపాలను కొనసాగించాడని, లెక్కలేనన్ని ఆస్తులు అక్రమంగా కూడబెట్టాడని, తన వ్యాపారాలలో గూడెం మహిపాల్ రెడ్డిని భాగస్వామిని చేసుకుని, స్థానికంగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా మేనేజ్ చేశాడని విమర్శిస్తున్నారు.. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి బలంగా వీస్తున్న క్రమంలో పఠాన్ చెరు నియోజక వర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే గూడెం ఒకవేళ ఓడిపోవడం అంటూ జరిగితే తన అవినీతి వ్యవహారాలు బయటపడతాయనే భయంతోనే ఎలాగైనా ఈసారి కూడా గూడెంనే గెలిపించుకోవాలని జిత్తులమారి ఎత్తులు వేస్తున్నాడన్నది వారి వాదన.. అందుకనే తెరమీదకు నీలం మధును తీసుకొచ్చాడని వారంటున్నారు.. నిజానికి నీలం, గూడెం కి ఫాలోయర్ అన్న సంగతి విదితమే.. ఈ బంధాన్ని అడ్డుపెట్టుకుని, ఎలాగోలా పైరవీలు నెరపి కాంగ్రెస్ పార్టీలోకి మధుని చేర్చారని విశేషకులు అంటున్న మాట.. స్థానికులు సైతం ఇదే విషయాన్ని చర్చించుకుంటున్నారు.. ఇందులో భాగంగానే టికెట్ రాకుండానే మధు ప్రచారం కొనసాగించడం.. తానే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అన్న అబద్దాన్ని జనాల్లో నిజమే అని భావించేలా చేయడం ఈ ఎత్తుగడలో భాగం.. ముదిరాజ్ కులాన్ని అడ్డం పెట్టుకుంటూ.. బహుజన వాదాన్ని వాడుకుంటూ కాంగ్రెస్ పార్టీకి పడే ఓట్లను చీల్చి, కాటాను ఎలాగైనా ఓడించాలన్నదే వారి కుట్రలో భాగమని అంటున్నారు.. ఒకవేళ మధు ఆడుతున్న ఆటలో పడిపోయి అధిష్టానం ఆయనకే టికెట్ ఇస్తే ఇక ఎదురే ఉండదన్నది వారి వాదన..

ఖలేజా కలిగిన ప్రజా నాయకుడు కాటా శ్రీనివాస్ గౌడ్ :
ఎంతో కాలంగా పార్టీని అంటిపెట్టుకుని ఉండటం.. పార్టీ ప్రతిష్ట ఎక్కడా దిగజారకుండా బ్యాలెన్స్ గా కార్యకలాపాలు సాగించడం.. ప్రజల్లో ఉంటూ వారికి ఎప్పటికప్పుడు అండగా నిలుస్తుండటం.. తాను ఎప్పుడూ తోడుగా ఉంటానని వారికి ధైర్యాన్ని, భరోసాని కలిగించడం.. సమస్య ఎంత పెద్దదైనా తన భుజస్కందాలపై వేసుకుని, పరిష్కారం కోసం పోరాడటం.. ఆయన సతీమణి సైతం ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు చేస్తుండటం.. మహిళా సాధికారతకోసం ఎంతగానో తపిస్తుండటం.. ఐలాపూర్ లో మొన్న జరిగిన నిరుపేదల గుడిసెల కూలగొట్టబడిన అమానుష కాండలో నిరుపేదలకు అండగా నిలబడి తన వాయిస్ ని బలంగా వినిపించడం.. ఇటీవల ఇబ్బడి ముబ్బడిగా కాంగ్రెస్ పార్టీలోకి చేరికలను ప్రోత్సహించడం.. మరీ ముఖ్యంగా ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకపోవడం.. మంచి మనసున్న నాయకులుగా భార్య భర్తలు ఇద్దరూ పేరు తెచ్చుకోవడం.. అదీ కాకుండా అన్ని సామాజిక వర్గాల ఓటర్లలో సమానంగా పేరు తెచ్చుకోవడం.. తన గెలుపును నల్లేరుమీద నడకలాగా కృషి చేయడం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో..ఏది ఏమైనా పఠాన్ చెరు నియోజకవర్గంలో ఓటర్ డిసైడ్ అయ్యాడు.. వార్ వన్ సైడ్ అయిపొయింది.. కాటా శ్రీనివాస్ గౌడ్ గెలుపు ఖాయం అయిపోయిందని రాజకీయ విశ్లేషకులు బలంగా చెబుతున్నారు…

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు