Monday, April 29, 2024

సీఎం జాబ్ ఆఫర్‌పై స్పందించిన నళిని

తప్పక చదవండి
  • తనకు ఇప్పుడు ఉద్యోగం అవసరం లేదని చెప్పిన మాజీ డీఎస్పీ
  • సాయం చేయాలనుకుంటే సనాతన ధర్మానికి అవసరమైన నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి
  • సీఎం రేవంత్ ఆఫర్ పై నళిని కీలక నిర్ణయం

తెలంగాణ ఉద్య‌మంలో కీల‌క పాత్ర పోషించిన మాజీ డీఎస్పీ న‌ళిని సంచ‌ల‌నంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి త‌న గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించ‌డంపై సుదీర్ఘ లేఖ రాశారు. ఆమె వ్య‌క్తం చేసిన అభిప్రాయాల‌తో కూడిన ఈ ఉత్త‌రం ఇప్పుడు క‌ల‌క‌లం రేపుతోంది. సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో తన డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేసిన నళినిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే. మాజీ డీఎస్పీ నళినికి పోలీస్ శాఖలో అదే ఉద్యోగాన్ని ఇవ్వడానికి ఇబ్బంది ఏంటని రేవంత్ అధికారులను ప్రశ్నించారు. నళినికి ఉద్యోగం చేయాలని ఆసక్తి ఉంటే వెంటనే విధుల్లోకి తీసుకోవాలని సీఎస్, డీజీపీలను ఆదేశించారు. పోలీస్ శాఖలో మార్గదర్శకాలకు సంబంధించి అవరోధాలేమైనా ఉంటే అదే హోదాలో ఇతర శాఖలో ఉద్యోగాన్ని ఇవ్వాలని రేవంత్ రెడ్డి సూచించారు. అయితే తనకు తిరిగి ఉద్యోగం ఆఫర్ చేయటంపై మాజీ డీఎస్పీ నళిని స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి తనపై చూపిస్తున్న అభిమానానికి కళ్లు చెమ్మగిల్లుతున్నాయన్నారు. గతం ఒక రీల్‌లో తన కళ్ల ముందు కదలాడుతుందని చెప్పారు. తనకు తిరిగి ఉద్యోగం చేసే ఆసక్తి లేదని.. తనలోని డైనమిక్ ఆఫీసర్‌ని గతంలోనే హత్య చేశారని ఫేస్‌బుక్‌లో సుదీర్ఘ పోస్టు రాశారు.

‘గౌరవనీయులైన సీఎం గారు.. మీరు నాపై చూపిస్తున్న అభిమానానికి నా కళ్లు చెమ్మగిల్లుతున్నాయి. మీ ఆత్మీయత నా హృదయానికి గొప్ప స్వాంతన కలిగించింది. ఈ నేపథ్యంలో గతం ఒక రీల్ లా నా కళ్ల ముందు కదులుతుంది. ఇన్నాళ్లు నేను ఒక సస్పెండ్ ఆఫీసర్ గా ‘ సోషల్ స్టిగ్మా ( మరక) ‘ను మోసాను. నన్ను ఆనాటి ప్రభుత్వం 3 ఏండ్లు చాలా ఇబ్బంది పెట్టింది. ఒక్క మాటలో చెప్పాలంటే క్షణక్షణం ఒక గండంలా గడిచింది. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచినప్పుడు, 2009 డిసెంబర్ 9న నేను చేసిన రాజీనామా చాలా సంచలనం రేకెత్తించింది. అదే రాత్రి చిదంబరం గారు చేసిన ప్రకటన ఉద్యమాన్ని చప్పున చల్లార్చింది.

- Advertisement -

కానిస్టేబుల్ కంటే హీనంగా ట్రీట్ చేశారు
నాటి సీఎం రోశయ్య గారు మహిళ దినోత్సవం రోజున నాకు నా ఉద్యోగాన్ని కానుకగా తిరిగి ఇస్తున్నట్లు ప్రకటిస్తే ,నేను రాజీనామాను విత్ డ్రా చేసుకొని డిపార్ట్మెంట్ లో చేరాను. నా జీవితంలో నేను చేసిన అతి పెద్ద తప్పు అదే. 18 నెలలు పద్మవ్యూహంలో చిక్కుకున్నట్లు నేను ఎదుర్కొన్న ఒత్తిడి, అవమానాలు నాకు బ్యూరోక్రసిపైనే నమ్మకం పోయేలా చేశాయి. ఉమెన్ ప్రొటెక్షన్ సెల్‌లో పోస్టింగ్ ఇచ్చి నాకు ఛార్జ్ మెమోలు ఇచ్చి ఎక్స్ప్లనేషన్స్ రాయమనడం, అనువల్ కాంఫిడెన్సిల్ రిపోర్ట్స్ లో అడ్వర్స్( చెడు) రిమార్క్ రాయడం, బ్యాచ్‌లో నా ఒక్క దానికే ప్రమోషన్‌ను ఆపేయడం, ప్రొబేషన్ పీరియడ్ ఎక్స్టెండ్ చేయడం వంటివి చేశారు. నన్ను ఒంటరిని చేసి ఒక కానిస్టేబుల్ కంటే హీనంగా ట్రీట్ చేశారు.

ఆ రోజే హత్య చేశారు
ఈ విషయాలు అన్ని నన్ను ఆనాటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారికి మొర పెట్టుకునేలా చేశాయి. ఉమ్మడి రాష్ట్రంలో నాకు వారి అపాయింట్‌మెంట్ కూడా దొరకలేదు. బయట ఉద్యమ నాయకులను సంప్రదిస్తే వాళ్లు నాకు సహాయం చేయకపోగా నన్ను ఎగతాళి చేశారు. సుష్మా స్వరాజ్ గారికి, సోనియా గాంధీజీకి లేఖలు రాసి నా పరిస్తితిని, రాష్ర్ట దుస్థితిని వివరించా. ప్రత్యక్ష ఉద్యమంలో నేను మళ్ళీ పాల్గొనడం అనివార్యం అనిపించింది. అందుకే 1.11.2011న ఫార్మాట్‌లో డీజీపీకి రాజీనామా ఇచ్చేసి ప్రజల్లోకి వెళ్ళాను. శ్రీ కృష్ణ కమిటీ ప్రభావంగా జరుగుతున్న జాప్యాన్ని ప్రశ్నిస్తూ నా ఉద్యమ కార్యాచరణ ప్రకటించా. ప్రభుత్వం వెంటనే నన్ను సస్పెండ్ చేసింది. దేశ ద్రోహం వంటి తీవ్ర ఆరోపణలు అందులో ఉన్నాయి. అన్ని పత్రికల్లో నా ఫోటోలు వేసి ఈ వార్తను పెద్దగా రాసి హైలైట్ చేశారు. ఆ నాడే నాకు డిపార్ట్‌మెంట్ పట్ల ఏహ్య భావం కలిగింది. నాలోని ఒక డైనమిక్ కమిటెడ్ ఆఫీసర్‌ను ఆ రోజే హత్య చేశారు.

అందరూ నన్ను వెలివేశారు
ఈ నాడు 12 ఏండ్లు పూర్తి అయిన తర్వాత తెలంగాణ మూలాలు కల ఒక సీఎంగా మీరు నా కేసును పూడ్చిన శవాన్ని వెలికితీయడం చేస్తున్నారు. మరణ కారణం తెలుసుకోవాలి అనుకుంటున్నారు. చాలా చాలా సంతోషం. ఇన్నాళ్లకు నా పోరాటాన్ని, సంఘర్షణను జనం తెలుసుకొనే ఒక సందర్భం సృష్టించారు. మీకు నా హృదయ పూర్వక కృతజ్ఞతలు. మీ ద్వారా తెలంగాణ ఉద్యమంలో బ్రతికి బయటపడి సర్వస్వం కోల్పోయిన వాళ్లలో నేను ముందు వరుసలో ఉన్నానన్న విషయం ప్రజలకు అర్థం అయ్యింది. నిజం నిలకడ మీద తెలుస్తుంది అన్నది నిరూపణ అయ్యింది. ఉద్యమంలో నేను నిర్వహించిన కీలక మైన పాత్ర నన్ను ప్రజలకు దగ్గర చేసింది. కానీ నా బంధు మిత్ర పరివారం మాత్రం అందరూ నన్ను వెలివేశారు. పర్యవసానంగా ఇల్లు, కుటుంబం, ఆరోగ్యం, మనశ్శాంతి అన్నీ కోల్పోయాను. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాను. జీవచ్చవంలా బతికాను.

ఇంకెటువంటి త్యాగమూ చేయలేను
రెండేండ్ల క్రితం దేవుడి దయ వల్ల నా జీవితంలోకి మహర్షి దయానంద సరస్వతి ప్రవేశించాడు. వేదమాత, యజ్ఞ దేవతలు నాలో తిరిగి ప్రాణం పోశారు. అందుకే నేను నా జీవితాన్ని ఆ మహనీయుని చరణాలకు సమర్పించుకున్నాను. జీవితంలో పది జన్మలకు సరిపడా కష్టాలు పడ్డాను. ఇక చాలు. ఇంకా నేను ఎవరి కోసం ఇంకెటువంటి త్యాగమూ చేయలేను. జన్మ రాహిత్యం కోసం అష్టాంగ యోగ మార్గంలో నడుస్తున్నాను. వేద ప్రచారకురాలిగా.. వైదిక యజ్ఞ బ్రహ్మగా సనాతన ధర్మాన్ని ప్రచారం చేయడమే నా ముందున్న కర్తవ్యం. దీని వల్ల నా ఆత్మ ఉన్నతితో పాటు, సమాజ ఉన్నతికి కూడా పాటు పడొచ్చు. కాబట్టి నా పంథా మర్చుకొలేను.

ఈ ఉద్యోగం నుండి ఎవరూ సస్పెండ్ చేయలేరు
మీరు భావిస్తున్నట్లు పోలీస్ కాకుండా వేరే ఉద్యోగం కూడా నేను చేయలేను. ఎందుకంటే నా అమూల్య సమయాన్ని బ్యూరోక్రసికి వెచ్చించలేను. శ్రేయో మార్గం విడిచి మళ్ళీ ప్రేయో మార్గం వైపు రాలేను. అన్ని దానాల్లో గొప్పదైన విద్యా దానాన్ని చేస్తూ, పుణ్యం మూటకట్టుకోవాలనే కోరిక తప్ప నాకు ఇంకేమీ లేదు. పరమేశ్వరుడు నన్ను క్రిమినాలోజీ( న్యాయ దర్శనం) నుండి ఫిలాసఫీ( తత్త్వ శాస్త్రం) వైపు నడిపించాడు. గన్ స్థానంలో నా చేత వేదం పట్టించాడు. నా వాణిలో మాధుర్యం నింపి నన్ను ఆచార్యను చేశాడు. నా ఈ ప్రస్థానం (డీఎస్పీ నుండి డీఎన్ఏగా మారడం) చాలా సంఘర్షణ మయం, వేదనా భరితం. నన్ను ఈ ఉద్యోగం నుండి ఎవరూ సస్పెండ్ చేయలేరు. నేను దీనికి రాజీనామా చేయాల్సిన పరిస్థితులు ఎన్నడూ కలగవు.

స్టేటస్ కోకు అనుమతించండి
కాబట్టి అంతిమంగా నేను సీఎంగా మిమ్మల్ని కోరేది ఏమిటంటే నాపై కరుణ చూపి స్టేటస్ కోకు అనుమతించండి. నాలా ఇంకే ఆఫీసర్ డిపార్ట్‌మెంట్‌లో ఇబ్బందులు పడకుండా తగిన చర్యలు తీసుకోండి. మీలో మంచి స్పార్క్ ఉంది. మీ నుండి చక్కని పాలన ఆశించవచ్చు అనిపిస్తుంది. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని నా జీవితంలో రుజువైంది. కాబట్టి నాలో లోకేషన, విత్తేషనలు కూడా పోయాయి. ఇక నాకు మీరు న్యాయం చేయాలంటే నాకు ఉద్యోగం ఇవ్వడానికి బదులుగా నా ధర్మ ప్రచారానికి ఉపయోగ పడేలా ఏదైనా సహాయం చేస్తే స్వీకరిస్తాను. ఎందుకంటే మీరు రాజు, నేను బ్రాహ్మణిని. మీరు ఇచ్చే ప్రభుత్వ ఫండ్‌ను నేను స్వతంత్రంగా ఉంటూనే ఒక వేద, యజ్ఞ ,సంస్కృత సంబంధ ధార్మిక కేంద్ర ఏర్పాటుకు వినియోగిస్తాను.’ అని నళిని సుదీర్ఘ పోస్టులో వెల్లడించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు