Saturday, April 27, 2024

ఆసుపత్రి కాదది.. రోగుల రక్తం పీల్చే విషకీటకం..

తప్పక చదవండి

(ఎం.ఎన్.జె. ప్రభుత్వ ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ రోగుల నుండి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న డైరెక్టర్ జయలత)

  • చట్ట విరుద్ధంగా యూజర్ చార్జీల మోత మోగిస్తున్న యాజమాన్యం..
  • ప్రయివేట్ ఆసుపత్రిలో రేట్ కార్డు తప్పనిసరిగా ఉండాలన్నది రూల్..
  • యూజర్ చార్జీలు తీసుకుంటున్నప్పుడు రేట్ కార్డు ఎందుకు లేదు
  • ప్రభుత్వ ఆసుపత్రిలో క్యాష్ కౌంటర్ నిర్వహించడం ఏమిటి..?
  • యూజర్ చార్జీలు వసూలు చేసిన లెక్కలేవి..? ఈ లెక్కలపై అడిట్ జరిగిందా..?
  • ప్రభుత్వానికి ఇదంతా తెలిసే జరుగుతోందా..? దీని వెనుక ఎవరున్నారు..?
  • ఆరోగ్యశ్రీ ఉద్దేశ్యాన్ని నీరుగారుస్తున్న డైరెక్టర్ జయలత
  • కొత్త ప్రభుత్వం దృష్టిపెట్టి ఈ సమస్యను పరిష్కరించాలంటున్న ప్రజలు..

ప్రభుత్వం చేపట్టే పథకాలు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి తప్ప.. వారిని పీడించే విధంగా ఉండకూడదు.. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి మేధస్సులో పురుడుపోసుకున్న ఆరోగ్య శ్రీ పథకం వలన ఎన్నో వేల కుటుంబాలు బాగుపడ్డాయి.. రోగాల బారినుంచి తప్పించుకుని నవ జీవనం వైపు సాగాయి.. ఖరీదైన వైద్యం చేయించుకోలేని నిరుపేదలు ఆరోగ్య శ్రీ ద్వారా ఎంతో లబ్ధిని పొందారన్నది నిజం.. కానీ కొన్ని ప్రభుత్వ ఆసుపత్రులు అడ్డదారులు తొక్కుతుంటే.. ఎవరికీ చెప్పుకోవాలో తెలియక బిక్క మొహం వేసుకుని నిర్వేదంగా అమాయకులు ఉండిపోవడం జరుగుతోంది.. అల్లాంటి ఘటనే ఇప్పుడు వెలుగు చూసింది..

- Advertisement -

హైదరాబాద్ : ఆరోగ్యశ్రీ స్కీంలో ట్రీట్మెంట్ కోసం వచ్చే రోగుల నుండి ఎలాంటి పద్ధతుల్లో కూడా డబ్బు వసూలు చేయకూడదని స్పష్టమైన ఆదేశాలున్నప్పటికీ హైదరాబాద్ నాంపల్లిలోని ఎం.ఎన్.జె ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ రీజినల్ క్యాన్సర్ సెంటర్ (ఎం.ఎన్.జె) ప్రభుత్వ ఆస్పత్రి యాజమాన్యం పేద రోగుల నుండి వేల రూపాయిల యూజర్ చార్జీలు వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది.. సిటీ స్కాన్ / ఎం.ఆర్.ఐ. ల ఫిల్మ్ ఖర్చుల కోసం చార్జీ వసూలు చేస్తున్నామని ఆ తర్వాత రీఫండ్ చేస్తున్నామని హాస్పిటల్ డైరెక్టర్ జయలత నిస్సిగ్గుగా చెప్పడం విస్మయానికి గురిచేస్తుంది. . యూజర్ చార్జీల వసూలుపై సామాజిక కార్యకర్తల ఫిర్యాదుపై ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ విచారణ జరిపింది. ఈ విచారణ నివేదికలో (9-1-2020) యూజర్ చార్జీలు వసూలు చేస్తున్నట్లు హాస్పిటల్ డైరెక్టర్ అంగీకరించారు. ఆరోగ్యశ్రీ రోగులకు ఉచితంగా ట్రీట్మెంట్ చేయకుండా ఇలా చార్జీలు వసూలు చేయడం ఎందుకు? రిఫండ్ చేయడం ఎందుకు? ట్రీట్మెంట్ తీసుకుని వెళ్ళిపోయిన రోగులు తిరిగి వచ్చి బిల్లులు సబ్మిట్ చేసి రిఫండ్ పొందే అవకాశం ఉంటుందా? ఈ హాస్పిటల్ రీజినల్ హాస్పిటల్ కావడంతో ఉమ్మడి రాష్ట్రానికి ఒకటే క్యాన్సర్ హాస్పిటల్ ఉన్నది. ఆంధ్రాలో క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణం చేశారా లేదా..? అన్నది పక్కన పెడితే. ఈ హాస్పిటల్ 10వ షెడ్యూల్లో ఉన్నప్పుడు గవర్నర్ నుండి ఎలాంటి అనుమతులు లేకుండా యూజర్ చార్జెస్ ఏ విధంగా ఆరోగ్య శ్రీ రోగుల నుండి తీసుకుంటారు? అంతేగాక తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి యూజర్ చార్జెస్ తీసుకుంటూ చికిత్సను అందిస్తున్నారు. మరి ఎలాంటి తెల్ల రేషన్ కార్డు లేకుండా ఉన్న పేద రోగుల సంగతేంటి, మరి ఈ రాష్ట్రం కాకుండా చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల నుండి కూడా ప్రజలు క్యాన్సర్ హాస్పిటల్ కు చికిత్స కొరకు రావడం జరుగుతుంది.. వారు యూజర్ చార్జెస్ చెల్లించలేని పరిస్థితిలో ఉంటే మరి వారి పరిస్థితి ఏంటి? తెలంగాణ రాష్ట్రంలోని ఏ ప్రైవేట్ హాస్పిటల్లో అయినా ఆరోగ్యశ్రీ రోగుల నుండి రూపాయి తీసుకోకుండా ఉచితంగా మెరుగైన వైద్యాన్ని అందించాలని ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాల నుండి కఠిన నియమ నిబంధనలు ఏర్పాటుచేసి, పేద రోగులకు చికిత్స అందిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన అనంతరం ప్రైవేట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ పేషంట్ల నుండి ఎలాంటి డబ్బులు తీసుకోవడం లేదు.. కానీ ప్రభుత్వ క్యాన్సర్ హాస్పటల్లో యూజర్ చార్జెస్ తీసుకోవడం అత్యంత బాధాకరం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో కొనసాగుతున్న ప్రభుత్వ దవాఖానాలో ఎవరి అనుమతితో యూజర్ చార్జెస్ తీసుకున్నారో డైరెక్టర్ జయలత చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉన్నది.

డైరెక్టర్ జయలతపై చర్యలు తీసుకోవాలి..
యూజర్ చార్జీల ద్వారా ఇప్పటి వరకు ఎంత వసూలు చేశారో, ఎంత రిఫండ్ చేశారో తేల్చాలని సామాజిక కార్యకర్తలు కోరుతున్నారు. చట్ట విరుద్ధంగా పేద రోగుల నుండి యూజర్ చార్జీలు వసూలు చేస్తున్న డైరెక్టర్ పై చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్తలు కోరుతున్నారు. ఎం.ఎన్.జె. ఆస్పత్రిలో మందులు, ఆధునిక యంత్రాలు, పరికరాల కొనుగోళ్ళు, భవన నిర్మాణాలు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకాల్లో భారీగా జరిగిన అవినీతిపై, ప్రభుత్వం నుంచి వచ్చే బడ్జెట్టు, ఖర్చుల వివరాలు, ఆరోగ్యశ్రీ నిధులు, వసూలు చేసిన యూజర్ చార్జీల లెక్కల్లో జరిగిన అవకతవకలపై పూర్తి సమాచారంతో మరో కథనం ద్వారా మీ ముందు తేనుంది ‘ఆదాబ్ హైదరాబాద్’ ‘మా అక్షరం అవినీతిపై అస్త్రం’..

ఆరోగ్యశ్రీ రోగుల నుండి యూజర్ చార్జెస్ తీసుకుంటున్న విషయంపై డైరెక్టర్ జయలత ను ఆదాబ్ ప్రతినిధి వివరణ కోరగా.. ఎలాంటి చార్జెస్ వసూలు చేయడం లేదని తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు