Wednesday, May 22, 2024

సేవ కాదు.. రియల్ దందా..!

తప్పక చదవండి
  • ఛారిటబుల్ ట్రస్ట్ కు ఇచ్చిన భూమి అమ్మకం
  • ఐ ఆసుపత్రి పేరుతో యవ్వారం
  • ట్రస్ట్ భూమిని ప్లాట్స్ గా కొట్టి అమ్మిన వైనం
  • ప్రభుత్వ, రెవెన్యూ నిబంధనలకు పాతర
  • అధికారుల చర్యలతో హైకోర్టులో రిట్ పిటిషన్
  • లేని కట్టడాలను ఉన్నట్లు చూపించి.. కోర్టును బురిడీ కొట్టించిన వైనం
  • రంగారెడ్డి జిల్లా ఉప్పర్ పల్లి శివారులోని.. సర్వే నెంబర్ 36లో దృష్టి ఛారిటబుల్ ట్రస్ట్..
  • మ్యానేజింగ్ ట్రస్టి పీబీ వెంకటేశ్ చిత్ర, విచిత్రాలు

హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలో మరో దిమ్మదిరిగే స్కాం బయటపడింది. సేవ పేరుతో రియల్ దోపిడికి తెగబడిన ఓ చారిటబుల్ ట్రస్ట్ యవ్వారం ఆదాబ్ దృష్టికొచ్చింది. పేద ప్రజలకు సేవ చేస్తానని చెప్పి రాష్ట్ర సర్కార్ ను బోల్తా కొట్టించిన వైనం వెలుగు చూసింది. హైకోర్టుకూ తప్పుడు సమాచారమిచ్చి యధేచ్చగా సదరు భూమిని ప్లాట్స్ చేసుకొని అమ్ముకొని సోమ్ము చేసుకున్న వ్యవహారం బయటపడింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం ఉప్పర్ పల్లిలో దృష్టి చారిటబుల్ ట్రస్ట్ కు 25 జూన్ 2005న అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సర్వే నెంబర్ 36లో 3 ఎకరాల భూమిని కేటాయించింది. దృష్టి చారిటబుల్ ట్రస్ట్ ను డా.రంగారెడ్డి పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ అని కూడా పిలుస్తుంటారు. ఈ ట్రస్టుకే జీవో1262 ద్వారా గజానికి రూ.450 ఖరీదు చొప్పున అప్పటి స్పెషల్ చీఫ్ సెక్రటరీ వీపీ జహరి ల్యాండ్ ను అలకేషన్ చేయడం జరిగింది. ప్రభుత్వం కేటాయించిన 3.00 ఎకరాల భూమిలో (ప్రస్తుత ఈ భూమి విలువ సుమారు రూ. 300 కోట్ల పై మాటే) రంగారెడ్డి పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ వారు వరల్డ్ క్లాస్ ఐ ఆసుపత్రి నిర్మించి పేద ప్రజలకు సేవల చేస్తామనే హామీపైనే రాష్ట్ర సర్కార్ అప్పట్లో ఈ భూమిని దృష్టి చారిటబుల్ ట్రస్ట్ కు కేటాయించింది.

అయితే ప్రభుత్వం రంగారెడ్డి పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ కు 2005లో ల్యాండ్ ను అలకేషన్ చేసినప్పటికీ..ఈ భూమిలో ముందుగా ఇచ్చిన హామీ ప్రకారం ఎలాంటి ఐ ఆసుపత్రిని నిర్మించకపోవడం గమనార్హం. దీంతో 29 జూన్ 2013న ప్రభుత్వం ఈ వ్యవహారంపై నిగ్గు తేల్చే ప్రయత్నాలను ప్రారంభించింది. దృష్టి చారిటబుల్ ట్రస్ట్ కు రాష్ట్ర సర్కార్ కేటాయించిన ల్యాండ్ కు సంబంధించిన యుటిలైజేషన్ పై సమాధానం ఇవ్వాలని ట్రస్ట్ నిర్వాహకులకు నోటీసులు జారీ చేసింది. అయితే ట్రస్ట్ కు సంబంధించిన యాజమాని రంగారెడ్డి అప్పటికే మరణించడంతో.. అతని కుమారుడు, మ్యానేజింగ్ ట్రస్టి పీబీ వెంకటేశ్ ప్రభుత్వానికి ఎలాంటి రిప్లై ఇవ్వలేదు. అంతేకాక ఈ భూమిని తిరిగి రాష్ట్ర సర్కార్ స్వాధీనం చేసుకునే అవకాశాలు మెండుగా ఉండడంతో.. పీబీ వెంకటేశ్ ఆగమేఘాల మీద ప్రభుత్వ ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ.. అప్పటి ఉమ్మడి రాష్ట్ర హైకోర్టులో(20690/2013)రిట్ పిటిషన్ దాఖలు చేశారు.

- Advertisement -

ఈ నేపథ్యంలోనే ట్రస్ట్ కు ప్రభుత్వం కేటాయించిన భూమిలో ఐ ఆసుపత్రి కోసం ఎలాంటి నిర్మాణాలు జరపనప్పటికీ.. హైకోర్టులో హాస్పిటల్ కోసం ఇప్పటికే నిర్మాణాలు ప్రారంభించినట్లు రిట్ పిటిషన్ లో మెన్షన్ చేయడం గమనార్హం. అందువల్ల ప్రభుత్వం కాని, మరెవ్వరైనా థర్డ్ పార్టీ కానీ.. ఈ ల్యాండ్ లో ఇన్వాల్వ్ కాకుండా ఆదేశాలు జారీ చేయాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలను కూడా కోర్టు ముందుంచినట్లు తెలుస్తోంది. దీంతో హైకోర్టు తదుపరి ఉత్తర్వులు వెలువరించే వరకూ ఎలాంటి చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర సర్కార్, సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయడం విశేషం. అయితే ఇదిలా ఉంటే దృష్టి చారిటబుల్ ట్రస్ట్ కు కేటాయించిన 3 ఎకరాల భూమిని ఇప్పటికే రంగారెడ్డి కుమారుడు, మ్యానేజింగ్ ట్రస్టీ పీబీ వెంకటేశ్ ప్లాట్స్ చేసి అమ్ముకొని సోమ్ము చేసుకోవడం గమనార్హం. ఈ వ్యవహారంలో అధికారులు ఒక విధంగా వెంకటేశ్ కు తమ సంపూర్ణ సహాయ, సహకారాలను అందించినట్లు తెలుస్తోంది. అధికారులు ఇచ్చిన ఇమ్మత్ తోనే వెంకటేశ్ ఈ రకమైన దందాకు పాల్పడినట్లు అర్థమవుతోంది.

ఈ మొత్తం భూమి విలువ బహిరంగ మార్కెట్ లో సుమారు రూ.300 కోట్లు పలకవచ్చని రియల్ వ్యాపారాలు అంచనా. కేవలం కంటి ఆసుపత్రి నిర్మాణం పేరుతో ప్రజలకు సేవ చేస్తానంటే ప్రభుత్వం ద్వారా కేటాయించబడ్డ ఈ భూమిలో పీబీ వెంకటేశ్ లాంటి ప్రబుద్ధుడు ఈ స్థాయి అవినీతికి పాల్పడడం నిజంగా విస్మయం కల్గిస్తోంది. అయితేే ఇంతటితో ఆగకుండా మధుసూదన్ రెడ్డి, మహ్మద్ రియాజుద్దీన్ లతో కలిసి 3 ఎకరాల పక్కనున్న మరో 6 ఎకరాల భూమి కబ్జా చేసారని, స.నెం. 316గా చూపిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

అయితే ఈ మొత్తం వ్యవహారంలో రాజకీయ అండదండలు వెంకటేశ్ కు పుష్కలంగా ఉండడం వల్లే.. ఆయన ఈస్థాయి కుంభకోణానికి పాల్పడేందుకు అవకాశం చిక్కిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అందువల్ల కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ సర్కార్ ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశిస్తే.. అసలు నిజాలు బహిర్గతం అయ్యే అవకాశాలున్నాయి. ఈ కబ్జా భాగోతం వెనుక ఉన్న ప్రముఖ నాయకుల వివరాలతో మరో కథనం ద్వారా వెలుగులోకి తేనుంది ఆదాబ్ హైదరాబాద్.. మా అక్షరం మా అవినీతిపై అస్త్రం.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు