Monday, April 29, 2024

మునుగోడు కాంగ్రెస్‌లో ముసలం.!

తప్పక చదవండి
  • రాజగోపాల్‌ రెడ్డి రాకను వ్యతిరేకిస్తున్న కీలకమైన నాయకులు
  • రేపు గెలిచిన తర్వాత అయినా పార్టీలో ఉంటాడనే నమ్మకం ఏంటని కార్యకర్తల అంతర్మధనం..
  • రానురాను అంటూనే బీజేపీలోకి వెళ్లిన చలమల్ల కృష్ణారెడ్డి
  • స్రవంతి అనుచరులు సైలెన్స్‌.. సహకరించే వీలుందో లేదో.!
  • రాజగోపాల్‌ రెడ్డి పునరాగమనంతో మునుగోడు కాంగ్రెస్‌ చల్లాచెదురు..

హైదరాబాద్ ; ఉమ్మడి నల్గొండ జిల్లాలో మునుగోడు అంటే ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట. ఆ నియోజకవర్గం ఏర్పడిన దగ్గర నుంచి కాంగ్రెస్‌, సీపీఐ మధ్యే పోటీ ఉండేది. పాల్వాయి, ఉజ్జని కుటుంబాలే అక్కడ రాజకీయ పెత్తనం చేశాయి. అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత బీ.ఆర్‌.ఎస్‌ పార్టీ మునుగోడులో గణనీయంగా పుంజుకుంది. 2014 సాధారణ ఎన్నికలతో పాటు 2022 ఉపఎన్నికలో బీఆర్‌ఎస్‌ పార్టీ స్వల్ప మెజార్టీతో గెలిచింది. ఇక 2018లో మహాకూటమి పొత్తుతో లాభపడి, ఎమ్మెల్యేగా కాంగ్రెస్‌ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ఎన్నికయ్యారు. అతివిశ్వాసంతో నిరుడు ఉపఎన్నికకు వెళ్లి బీజేపీ అభ్యర్థిగా ఓటమి పాలయ్యరు. ఇక అప్పటి నుంచి బీజేపీతో అంటీ ముట్టనట్లుగా వ్యవహరించారు. తెలంగాణలో బీజేపీ కంటే కాంగ్రెస్‌ పార్టీనే బలంగా ఉందని భావించిన రాజగోపాల్‌ రెడ్డి తిరిగి హస్తం గూటికి చేరుకున్నారు. అలా ఆయన పార్టీలో చేరారో లేదో.. అధిష్టానం వెంటనే రాజగోపాల్‌కు టికెట్‌ ఇచ్చింది. దీంతో పార్టీని నమ్ముకొని ఉన్న పలువురు నాయకులు తమ దారి తాము చూసుకుంటున్నారు.
మునుగోడులో కాంగ్రెస్‌ పార్టీకి పాల్వాయి కుటుంబం పెద్ద దిక్కుగా ఉంటూ వస్తోంది. 2014లో టికెట్‌ ఆశించి భంగపడిన పాల్వాయి గోవర్ధన్‌ రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతి ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగారు. ఆ ఎన్నికల్లో ఆమె రెండో స్థానంలో నిలవడం గమనార్హం. ఇక 2018లో అధిష్టానం బుజ్జగించడంతో రాజగోపాల్‌ రెడ్డి కోసం పని చేశారు. పాల్వాయి కుటుంబానికి సంప్రదాయంగా వస్తూ ఉన్న ఓటు బ్యాంకు రాజగోపాల్‌ రెడ్డి గెలుపు కోసం పని చేసిందని స్థానికులు చెబుతుంటారు. 2022లో రాజగోపాల్‌ రెడ్డి రాజీనామా చేయడంతో ఉపఎన్నికల్లో పాల్వాయి స్రవంతికి కాంగ్రెస్‌ టికెట్‌ ఇచ్చింది. కానీ పార్టీలో ఉన్న నాయకుల నుంచి సరైన మద్దతు లేకపోవడంతో స్రవంతి మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. అయిన్పటికీ ఆమె పార్టీలోనే ఉంటూ వచ్చారు. మునుగోడులో పాల్వాయి స్రవంతి కాంగ్రెస్‌కు పెద్దదిక్కుగా మారారు. కష్టకాలంలో పార్టీని ఆదుకున్నా.. చివరకు స్రవంతికి భంగపాటు తప్పలేదు. అప్పటికప్పుడు పార్టీలో చేరిన రాజగోపాల్‌కు టికెట్‌ ఇవ్వడంతో స్రవంతి తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఆమె పార్టీ మారతారనే ప్రచారం జరిగినా.. చివరకు ఆ ప్రచారాన్ని ఖండిరచారు.

రాను రాను అంటూనే.. బీజేపీలోకి వెళ్లిన చలమల్ల కృష్ణారెడ్డి

- Advertisement -

గడిచిన ఉపఎన్నికలోనే టికెట్‌ ఆశించిన చలమల్ల క్రిష్ణారెడ్డి కూడా ఈ సారి టికెట్‌ కోసం గట్టిగానే ప్రయత్నించారు. టికెట్‌ వస్తుందన్న ఆశతో ఆయన గడప గడపకు కాంగ్రెస్‌ అనే కార్యక్రమంతో మునుగోడులో గట్టి ప్రచారాన్ని నిర్వహించారు. పార్టీని కాపాడుకునే దశలో ఆయన కొన్ని కోట్ల రూపాయలు పార్టీ ప్రచారానికి ఖర్చు పెట్టారు. కానీ టికెట్‌ రాకపోవడంతో నిరాశ చెందారు. రాజగోపాల్‌ రెడ్డి అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన క్రిష్ణారెడ్డి తాను ఇండిపెండెంట్‌గా అయినా పోటీ చేస్తానని ప్రకటించారు. చివరకు ఆయన బీజేపీలో చేరారు. అయితే బీజేపీ క్రిష్ణారెడ్డికి టికెట్‌ ఇస్తుందా లేదా అనే విషయంపై సందిగ్దం నెలకొన్నది కానీ ఈయనను మించిన నేత బిజేపిలో అక్కడ ఎవరూ లేరు కాబట్టి ఖచ్చితంగా బిజెపి టికెట్‌ మీదనే పోటీ చేసే అవకాశం ఉంది. రాజగోపాల్‌ రెడ్డి టార్గెట్‌ గానే కృష్ణారెడ్డి ఈ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు.

కాంగ్రెస్‌లోని కీలకమైన నాయకులే రాజగోపాల్‌ రెడ్డి రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు..
అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారని.. ఇలా పార్టీలు మారే వ్యక్తికి టికెట్‌ ఇస్తారా! అని వ్యాఖ్యానిస్తున్నారు. గతంలో కాంగ్రెస్‌లో ఉండి.. రాజగోపాల్‌తో బీజేపీలోకి వెళ్లిన నాయకులు చాలా మంది తిరిగి రాలేదు. రాజగోపాల్‌ వెళ్లినా, తాము మాత్రం బీజేపీతోనే ఉంటామని చెబుతున్నారు. ఇక ఇప్పటికే పార్టీని నమ్ముకొని ఉన్న నాయకులు, కార్యకర్తలు కూడా రాజగోపాల్‌ విషయంలో వ్యతిరేకంగా ఉన్నారు. పార్టీలో స్థిరంగా ఉండే వారికే టికెట్‌ ఇచ్చి ఉంటే బాగుండేదని.. ఒక వేళ రేపు గెలిచినా రాజగోపాల్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలోనే ఉంటాడనే నమ్మకం లేదని, కాంగ్రెస్‌ క్యాడర్‌ అంతర్మధనంలో ఉన్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలోనీ చౌటుప్పల్‌, చండూర్‌, మునుగోడు ప్రాంతంలో కీలకమైన కాంగ్రెస్‌ నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. చల్లమల క్రిష్ణారెడ్డితో ఇప్పటికే కొంత క్యాడర్‌ బయటకు వెళ్లిపోగా.. స్రవంతి అనుచరులు మాత్రం సైలెంట్‌గా ఉన్నారు. రాజగోపాల్‌ రెడ్డి ప్రచారానికి వీళ్లు కూడా సహకరించే అవకాశం లేదని పార్టీలో ప్రచారం జరుగుతోంది. పైగా సీపీఐ సైతం రాజగోపాల్‌కు టికెట్‌ ప్రకటించడంపై గుర్రుగా ఉంది. సీపీఐ నుంచి ఒక రెబెల్‌ క్యాండిడేట్‌ బరిలో ఉండే అవకాశం ఉన్నట్లు వినికిడి. జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న రాజగోపాల్‌ రెడ్డి కూడా సందిగ్దంలో పడినట్లు సమాచారం. కీలకమైన నాయకుల మద్దతు లేకుండా తన గెలుపు కష్టంగా మారుతుందని రాజగోపాల్‌ కొంత ఆందోళన చెందుతున్నట్లు తెలియ వచ్చింది. మొత్తానికి రాజగోపాల్‌ రెడ్డి పునరాగమనంతో మునుగోడు కాంగ్రెస్‌ చెల్లాచెదురైంది. ఇది తప్పకుండా ఎన్నికల్లో ప్రభావం చూపిస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు