Saturday, April 27, 2024

బీజేపీ అవకాశం ఇస్తే పోటిచేస్తా..

తప్పక చదవండి
  • భాగ్యనగరాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా..
  • ఆమె అడుగు నవ సమాజ నిర్మాణం వైపు
  • మహిళా సాధికారత.. నిరక్షరాస్యత నిర్మూలన..
  • నిరుద్యోగ యువతకు ఉపాధి.. బడుగుబలహీన వర్గాలకు చేయూత..
  • హైదరాబాద్‌ పార్లమెంట్‌ బీజేపీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటున్న నడిరపల్లి యమునా పాఠక్‌తో ‘‘ఆదాబ్‌ హైదరాబాద్‌’’ చిట్‌ చాట్‌

హైదరాబాద్‌ :- యువతలో దాగి ఉన్న శక్తిని మేల్కొల్పి వారిని సమాజానికి, దేశానికి ఉపయోగపడే విధంగా తయారుచేయడంలో తనవంతు భాద్యతను శక్తివంచనలేకుండా చేస్తానని నడిరపల్లి యమునా పాఠక్‌ పేర్కొన్నారు. ప్రతి వ్యక్తి స్వతంత్రంగా ఎదగాలని తమ లక్ష్య సాధనలో ముందుకు సాగాలని ఆమె యువతకు పిలుపునిచ్చారు. యువతలో ఎన్నో అతీత శక్తులు దాగివున్నాయని యువత తమ శక్తి సామర్ధ్యాలను గుర్తించి సమర్ధవంతమగా వినియోగించుకున్నప్పుడే ఉన్నత లక్ష్యాలను చేరుకుంటారని ఆమె అన్నారు. నిరుద్యోగ యువతకు శిక్షణ ఇప్పించి ఉపాధి కల్పిస్తూ వారి అభివృద్ధికి తోడ్పడుతున్నారు. మల్కాజ్గిరిలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థినులకు ఆత్మరక్షణలో శిక్షణ అందిస్తున్నారు ఇప్పటి వరకు ఇరవై వేల మందికి పైగా విద్యార్థినులకు ఆమె ఆత్మరక్షణలో శిక్షణను ఇప్పించారు. ఇక పేద విద్యార్థులకు ఉచితంగా ట్యూషన్లు చెప్పిస్తున్నారు.తన చిన్నతనం లో పేద విద్యార్థుల బాధలను చూసి చలించిన ఆమె ఆపన్నులకు అండగా ఉండాలని నిర్ణయంతో 2005 సంవత్సరంలో ట్రస్టు ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఆమె సేవా పరంపర కొనసాగుతూ వస్తోంది. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా అప్పడాల తయారీ, టైలరింగ్‌, బ్యూటీషియన్‌, కంప్యూటర్‌ తదితర కోర్సుల్లో శిక్షణ ఇప్పిస్తున్నారు. ప్రపంచం లో మనుషులంతా సమానమే అంటూ పలు అవ గాహన కార్యక్రమాలను సైతం నిర్వహిస్తూ ప్రజలను చైతన్యపరుస్తున్నారు. హైదరాబాద్‌ పార్లమెంట్‌ బీజేపీ అభ్యర్థిగా ఆమెకు సీటు కేటాయిస్తే గెలుపు నల్లేరుపై నడకే అంటున్నారు హైదరాబాద్‌ ఓటర్లు.. సేవ కార్యక్రమాలతో ప్రజలకు చేరువయిన యమునా పాఠక్‌ తో ఆదాబ్‌ హైదరాబాద్‌ ముచ్చటించింది.

మీ పరిచయం..
మా కుటుంబ పెద్దలు (తాత) స్వాతంత్య్ర ఉద్యమంలో కీలక భూమిక పోషించారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయాల్లో కూడా వారు ఎంతో క్రియాశీలకంగా వ్యవహరించారు. మా తాతగారు భూగోళ శాస్త్రవేత్త టోక్యో లో పిహెచ్డీ పూర్తి చేశారు..స్వర్గీయ ఎన్టీఆర్‌ తో వారికి విడదీయని బంధం ఉంది. నేను నా 19 వ ఏట.. నా కెరీర్‌ ప్రారంభించడం జరిగింది.. ఉగ్రవాదం నిర్మూలన,ప్రపంచ శాంతి నెలకొల్పడం కోసం ఆస్ట్రేలియాలో ఏర్పాటు చేసిన సదస్సులో ఇండీయా తరుపున పాల్గొనడం జరిగింది. నేను పీజీ చేస్తున్న సమయంలోనే నలుగురికి సేవచేయాలనే లక్ష్యంతో గ్లోబల్‌ ఏంజెల్స్‌ జై చారిటబుల్‌ ట్రస్ట్‌ ను 2005 లో స్థాపించాను. మా పేరెంట్స్‌ ఇచ్చిన మనీని సరదాలకు ఖర్చు చేయకుండా ఓల్డేజ్‌ హొమ్స్‌ కు ఖర్చు చేశాను..అప్ప్పుడు చవుకగా దొరికే అరటిపండ్లు లాంటి వి ఛారిటీకి డొనేట్‌ చేసేవాళ్ళం. ఆ సర్వీస్‌ కొనసాగాలనే లక్ష్యంతో అమ్ముకుటీర్‌ అనే వృద్ధాశ్రమము ఏర్పాటు చేసి నిరాశ్రయులైన ఎంతోమందికి ఆశ్రయం కల్పించాను.స్వయం , స్వశక్తి మీదే బ్రతకాలన్నదే నా లక్ష్యం .. నేను అలానే పనిచేసుకుంటూ ఎదిగాను.. . నేను ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థలన్నింటితో కలిసి పనిచేశాను. భారత దేశానికి రెండవ ప్రతినిధిగా ఉన్న ఓ అంతర్జాతీయ సంస్థతో కలిసి పనిచేశాను. దేశంలోని 9 రాష్ట్రాలలోని పలు విభాగాలతో కలిసి పనిచేశాను. అంతేకాకుండా దేశంలో, ప్రపంచంలో వివిధ రంగాల్లో ప్రముఖులైన అబ్దుల్‌ కలాం గారు,ఎంఎస్‌ స్వామినాథన్‌ గారు,ప్రొఫెసర్‌ ఎస్పాల్‌ గారు ఇలా ఏంతో మంది ప్రముఖులతో స్పూర్తితో ప్రేరణ పొందాను.. వారితో కలిసి పనిచేశాను. వారి నుంచి ఎంతో నేర్చుకున్నాను. వారితో కలిసి పనిచేసే అవకాశం రావడం కూడా నా అదృష్టమే..

- Advertisement -

ఎలా సాధ్యమయ్యింది మీకు ఆ స్థాయికి ఎదగడానికి ..
ఒక మనిషి మనిషిలా కాకుండా ఒక వ్యవస్థలా మారాలి.. ఒక వ్యక్తి వ్యవస్థగా మారడానికి చాలా అంశాలు దోహదపడుతాయి. విభిన్న వ్యక్తులతో కలిసి పనిచేసినప్పుడు ఆ వ్యక్తుల వ్యక్తిగత జీవితం,వారి జీవితంలో ఒక మంచి స్థాయికి ఎదగడానికి దోహదపడ్డ అంశాలు.. పొరపాట్లు.. వారికి ప్రేరణ కల్పించిన అంశాలు.. ఇవన్నీ నేర్చుకునే నైపుణ్యాలుగా చెప్పుకోవచ్చు.. నేను ఎంతో మంది గొప్పవ్యక్తులతో కలిసి పనిచేశాను. వారి నుంచి నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. వారు జీవితంలో పొందిన విజయాలు దానికి దోహదపడ్డ అంశాలు అధ్యయనం చేశాను వారిని స్ఫూర్తిగా తీసుకుని నేను ఒక మంచి వ్యక్తిగా ఎదగగలిగాను.. నలుగురికి మంచి చేడు చెప్పగలిగే స్థితికి చేరుకోగలిగాను..

ఆడపిల్లలు. ఆడవాళ్ల ప్రొటెక్షన్‌ ఫస్ట్‌ ఏజెండగా ఎందుకు పెట్టుకున్నారు.
సమాజంలో అవసరంతోనో, అమాయకత్వంతోనో, కొందరిని నమ్మో చాలా మంది చిన్న పిల్లలు,మహిళలు వ్యభిచారం అనే ముసుగులోపడి మగ్గిపోతున్నారు. పసి పిల్లల శరీర భాగాలు ఎదగాలనే రాక్షసత్వంతో వ్యభిచార ముఠాలు ఇంజెక్షన్లను ఇచ్చి పసి పిల్లల బాల్యాన్ని చిదిమేస్తున్నారు. నేను నా జీవితంలో కొన్ని సంఘటనలు చాలా దగ్గరగా చూశాను అప్పుడే నేను నిర్ధారించుకున్నాను.. నా జీవితంలో మొదటి లక్ష్యం పసి పిల్లలు. ఆడవాళ్ల రక్షణ భాద్యత స్వీకరించాలని.. వారి రక్షణ కోసం ఎంత దూరం ఆయిన పరిగెడతాను.. ఎంతటి వారితోనైనా తలపడతాను..

రాజకీయాల్లో ప్రవేశం గురించి ఏమైనా చెబుతారా.. ?
మోడీ నాయకత్వం కారణంగానే బీజేపీ లోకి వచ్చాను ..వచ్చిన తరువాత ఆర్‌ ఎస్‌ ఎస్‌ సిద్దాంతాలను ఆకళింపు చేసుకున్నాను. నిస్వార్ధంగా పనిచేసీ తమ జీవితాలను త్యాగం చేసిన నాయకులను..వారి జీవితాలను నేను ఆదర్శంగా తీసుకున్నాను .. నా కున్న కోరిక ఒక్కటే నేను లేను అన్న రోజు ప్రపంచం ఒక్క నిమిషం మౌనం పాటించాలి. ఆ స్థాయికి నేను ఎదగాలన్నదే నా కోరిక.ప్రజలకు మంచి చేయాలనే లక్ష్యంతో ఓ వైపు సేవ కార్యక్రమాలు నిర్వహిస్తూనే గ్లోబల్‌ ఏంజెల్స్‌ జై చారిటబుల్‌ ట్రస్ట్‌ ను స్థాపించాను… గ్రామాలకు శుద్ధి చేసిన మంచి తాగు నీటిని అందిస్తున్నా.. అసోం, నాగాలాండ్‌, మణిపూర్‌, మేఘాలయ, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, ఢల్లీి కేంద్రంగా.., యువ పారిశ్రామికవేత్తలు అభివృద్ధి గ్రామీణాభివృద్ధి వంటి శాంతి సమానత్వం ,సామాజిక న్యాయం ,పర్యావరణ పరిరక్షణ ,వంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. వయసుమళ్లిన వారికి ఉచిత కంటి పరీక్షలు, ఆపరేషన్లు చేయించి కళ్లద్దాలను ఉచితంగా అందజేస్తున్నాం. వృద్ధుల నిత్యావసర సరుకులందిస్తూ వారిని ఆదుకుంటున్నాం. అనాథలుగా మారిన వృద్ధులను చేరదీసి వారికి కడుపునిండా అన్నం పెడుతున్నాం.. కరోనా సమయంలో కరోనా వ్యాధి బారిన పడినవారికి ఆహారం, మందులను అందించడం జరిగింది. నియోజ కవర్గ పరిధిలలో పనిచేసే విలేకరుల కుటుంబాలకు అవసరమైన సహాయం అందిచడం జరిగింది.ప్రజాప్రతినిధిగా బీజేపీ పార్టీ పోటీ చేసే అవకాశం కల్పిస్తే మరిన్ని ప్రజా కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు మరింత నిస్వార్ధంతో సేవ చేస్తాను.

హైదరాబాద్‌ పార్లమెంట్‌ బీజేపీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటున్నారా.?
అవును పార్టీ అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా పోటీ చేస్తాను..ఎంఐఎం పార్టీకి హైదరాబాద్‌ పార్లమెంట్‌ స్థానం కంచుకోటలా మారింది. నిజానికి ఈ పార్లమెంట్‌ పరిధి మొత్తం పాతబస్తీ ప్రాంతం కావడంతో.. ఎంఐఎం బలమైన పార్టీగా ఎదిగింది. హైదరాబాద్‌ లోక్‌సభ పరిధిలో.. మలక్‌పేట, కార్వాన్‌, గోషామహల్‌, చార్మినార్‌, చాంద్రాయణగుట్ట, యాకత్‌పురా, బహదూర్‌పురా అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.ఒక్క గోషామహల్‌ మినహాయించి మిగిలిన ఆరు నియోజకవర్గాల్లో కొన్నెండ్లుగా ఎంఐఎం పార్టీ అభ్యర్థులే గెలుస్తున్నారు.ఈ ప్రాంతాలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయి.. అస్తవ్యస్తమైన విద్యుత్తు.. తాగునీటి సమస్య, నిరుద్యోగ సమస్యతో పాటు పలు స్థానిక సమస్యలు ఇక్కడి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పలు పథకాలు లబ్దిదారులకు చేరడం లేదన్న విమర్శలు గట్టిగానే వినబడుతున్నాయి. బీజేపీ పార్టీ అవకాశం ఇస్తే ఖచ్చితంగా ప్రజలకు చేరువయ్యి కార్యక్రమాలు చేపడుతూ గెలుపే లక్ష్యంగా పనిచేస్తా..హైదరాబాద్‌ పార్లమెంటు ప్రజలు ఆదరిస్తే మునుపెన్నడూ లేని భాగ్యనగరాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు