- పదవీ విరమణ పొందినా అందులోనే తిష్ట
- ఆయాచితంగా పదవులు కట్టబెట్టిన కేసీఆర్
- రిటైర్డ్ కాగానే మళ్లీ కొలువులోకి..
- వారికే దళిత బంధు స్కీం బాధ్యతలు
- అడ్డగోలు నిర్ణయాలు తీసుకున్న సదరు వృద్ధ జంబుకాలు
- కొత్త సర్కార్ నజర్ పెడితే వీరి అసలు లీలలు బయటపడే ఛాన్స్
హైదరాబాద్ : తెలంగాణ షెడ్యూల్డ్ క్యాస్ట్స్ కో-ఆపరేటివ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (టీఎస్సీసీడీసీ)లో రిటైర్డ్ వృద్ధ జంబుకాలు పాతుకుపోయాయి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చలువుతో ప్రభుత్వం మారినా.. అక్కడే తిష్టవేసి తమ మార్క్ రాజకీయాన్ని చూపించుకుంటున్నాయి. గత ప్రభుత్వ హయాంలో కీలకంగా పని చేసిన ఈముగ్గురు అధికారులు ఇప్పటికీ టీఎస్సీసీడీసీని వదలడం లేదు. గత బీఆర్‌ఎస్ సర్కార్ లో ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శిగా పనిచేసిన టి.విజయ్ కుమార్, పశుసంవర్ధక శాఖలో డైరెక్టర్ గా పనిచేసిన వి.లక్ష్మారెడ్డి, మరో కీలక అధికారిగా వర్క్ చేసిన వేణుగోపాల్ రావులు ఎప్పుడో రిటైర్ అయ్యారు. విజయ్ కుమార్ మే 31, 2023న పదవీ విరమణ పొందారు. అలాగే వి.లక్ష్మారెడ్డి జులై 31,2023న, మరో అధికారి వేణుగోపాల్ రావు సెప్టెంబర్ 30,2023న రిటైర్ అయ్యారు.
అయితే గత ఏడాదిలోనే పదవీ విరమణ పొందిన వీరికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్లీ ప్రభుత్వం లోని కీలక బాధ్యతలు అప్పగించడం విశేషం. అది కూడా తన పార్టీ క్యాడర్ కు ఆయాచిత లబ్ధి చేకూర్చే పోస్టులు ఇవ్వడం గమ్మత్తుగా ఉంది. తన అవినీతి లీలలను కప్పి పుచ్చుకునేందుకు ఈ ముగ్గురు వృద్ధ జంబుకాలకు కేసీఆర్ పోస్టింగ్ లిచ్చేశారు. వీరు అలా ఉద్యోగం నుంచి రిటైర్ మెంట్ తీసుకున్నారో.. లేదో.. వెంటనే గత బీఆర్‌ఎస్ సర్కార్ లో ఆర్డర్ కాపీలొచ్చేశాయి. వీరందరిని కేసీఆర్ దళిత బంధు పథకం అమలు కోసం అపాయింట్ చేసేశారు. టి.విజయ్ కుమార్ ను దళిత బంధు పథకానికి కన్సల్టెంట్ అధికారిగా.. పశు సంవర్ధక శాఖలో అడ్డగోలు అవినీతికి పాల్పడిన వి.లక్ష్మారెడ్డిని దళిత బంధు పథకానికి సంబంధించిన స్టేట్ రీసోర్స్ పర్సన్ గా.. మరో రిటైర్డ్ ఉద్యోగి ఆర్.వేణుగోపాల్ రావును దళిత బంధు పథకం స్టేట్ ట్రైనింగ్ అండ్ రీసోర్స్ పర్సన్ అధికారిగా నియమించడం విస్మయం కల్గిస్తోంది.
బీఆర్‌ఎస్ క్యాడర్ కు ఆయాచిత లబ్ధి చేకూర్చేందుకే..
హుజూరాబాద్ ఉప ఎన్నికలను పురస్కరించుకొని తీసుకొచ్చిన దళిత బంధు స్కీంను ఆ తర్వాత తన పార్టీ క్యాడర్ కు ఇచ్చుకునేందుకు కేసీఆర్ ఈ ముగ్గురు రిటైర్డ్ ఉద్యోగులను తనకు అనుకూలంగా వాడుకోవడం గమనార్హం. వాస్తవానికి ఏదైనా ప్రభుత్వ శాఖ తరపున ఏదైన్షా స్కీం అమలు చేసేందుకు అందులోనే శాశ్వత ఉద్యోగులుంటారు. వారిని సక్రమంగా వినియోగించుకుంటే చాలు సంబంధిత పథకాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లవచ్చు. అయితే వారు ఉద్యోగపరంగా యాక్టివ్ గా ఉండడం వల్లే నిబంధనలను ఉల్లంఘించి నిర్ణయాలు తీసుకునేందుకు వెనకా.. ముందు ఆలోచించే పరిస్థితులుంటాయి. అయితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇందుకు పూర్తి భిన్నమైన ఆలోచనను కల్గి ఉండడంతో.. డిపార్ట్ మెంట్ లోని యాక్టివ్ ఉద్యోగులను కాదని.. ఈ ముగ్గురు వృద్ధ జంబుకాలకు దళిత బంధు బాధ్యతలు అప్పగించడం విశేషం.
ఇక ఉద్యోగాలకు స్వస్తి పలికిన సదరు ముగ్గురు ఉద్యోగులకు సుమారు రూ. 84వేల వేతనంతో కేసీఆర్ సర్కార్ హయాంలో మళ్లీ ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతిన ఉద్యోగాలు దొరకడంతో పెద్దసారు చెప్పిన ప్రతీ దానికి వారూ తలూపేశారు. దీంతో స్వంత డిపార్ట్ మెంట్ లో అసలే సరైన పోస్టులు దొరక్క అవస్థలు పడుతున్న వారు. ఉద్యోగాలు లేక అవస్థలు పడుతున్న మరికొందరు.. ఈ వృద్ద జంబుకాల తీరుతో తీవ్ర అవస్థలు పడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అంతేకాక వీరి హయాంలో ఇంప్లిమెంట్ అయిన దళిత బంధులోనూ అధికార పార్టీ నేతలు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడేందుకు ఆస్కారం కల్గడం గమనార్హం. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ముగ్గురు అధికారుల ఆధ్వర్యంలో తీసుకున్న నిర్ణయాలు, ఇంప్లిమెంట్ అయిన పాలసీలపై తరువుగా విచారణ చేస్తే ఈ అవినీతి అధికారులతో పాటు అప్పటి ప్రభుత్వంలోని అసలు తిమింగలాల అసలు భాగోతం బయటపడే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.