Tuesday, April 30, 2024

సూపర్‌ ఓవర్‌లో రెండుసార్లు బ్యాటింగ్‌..

తప్పక చదవండి

ఇంతకీ రోహిత్‌ శర్మ రిటైర్డ్‌ ఔటా..? కాదా..? స్వదేశంలో భారత్‌ – అఫ్గాన్‌ మధ్య బుధవారం రాత్రి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌ అత్యంత నాటకీయంగా ముగిసింది. రెండుసార్లు సూపర్‌ ఓవర్‌కు దారి తీసిన ఈ మ్యాచ్‌లో భారత్‌ అద్వితీయమైన విజయం సాధించింది. అయితే నిన్నటి పోరులో భాగంగా తొలి సూపర్‌ ఓవర్‌లో రోహిత్‌ శర్మ.. అజ్మతుల్లా వేసిన ఓవర్‌లో రెండు భారీ సిక్సర్లు బాది ఆరో బంతికి క్రీజును వదిలివెళ్లాడు. ఆ సమయంలో రింకూ సింగ్‌ బ్యాటింగ్‌ (నాన్‌ స్ట్రయికర్‌ ఎండ్‌)కు వచ్చాడు. ఇంతకీ రోహిత్‌ ఎందుకు బయటకు వెళ్లాడు..? రోహిత్‌ రిటైర్డ్‌ హర్ట్‌గా అవుట్‌ అయ్యాడా..? అలా వెళ్తే రెండోసారి ఎందుకు బ్యాటింగ్‌కు వచ్చాడు. ఇంతకీ నిబంధనలు ఏం చెబుతున్నాయి..?
ఎందుకెళ్లాడు..? ఫస్ట్‌ సూపర్‌ ఓవర్‌లో భారత్‌.. 17 పరుగులు చేయాల్సి ఉండగా రోహిత్‌ రెండు సిక్సర్లు కొట్టడంతో భారత్‌.. ఐదు బంతుల్లో 15 పరుగులు చేసింది. ఆఖరి బంతికి ముందు రెండు సింగిల్స్‌ తీయాల్సి ఉండగా అప్పటికే అలిసిపోయిన హిట్‌మ్యాన్‌.. క్రీజు నుంచి పెవిలియన్‌ చేరాడు. ఆ సమయంలో రింకూ సింగ్‌ బ్యాటింగ్‌కు వచ్చాడు. ఆ సమయంలో ఆశ్చర్యపోవడం టీవీల ముందు చూస్తున్న అభిమానులతో పాటు స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు, ఇరు జట్ల ఆటగాళ్లు, కోచింగ్‌ సిబ్బంది వంతైంది. అయితే ఇది ‘రిటైర్డ్‌ అవుట్‌’, ‘రిటైర్డ్‌ నాట్‌ అవుట్‌’ అనేది క్లారిటీ లేదు. కానీ రోహిత్‌ మాత్రం రెండోసారీ బ్యాటింగ్‌కు వచ్చాడు.
నిబంధనలు ఏం చెబుతున్నాయి..? ఐసీసీ నిబంధనల ప్రకారం.. పురుషుల టీ20లలో ‘ఒక బ్యాటర్‌ సూపర్‌ ఓవర్‌లో డిస్మిస్‌ (ఔట్‌) అయితే అతడు తర్వాతి సూపర్‌ ఓవర్‌లో బ్యాటింగ్‌కు రావడానికి ఆస్కారం లేదు..’ అని ఉంది. ఇక్కడ ‘డిస్మిస్‌’ అనేదే కీలకం. దీని ప్రకారం.. నిన్నటి మ్యాచ్‌లో రోహిత్‌ను అఫ్గాన్‌ ఔట్‌ చేయలేదు. టీమిండియా హెడ్‌కోచ్‌ ద్రావిడ్‌తో పాటు ఇతర క్రికెట్‌ పండితులు రోహిత్‌ నిర్ణయాన్ని ‘రిటైర్డ్‌ ఔట్‌’గానే పిలుస్తున్నారు. ఇక క్లాజ్‌ 25.4.2 ప్రకారం పురుషుల టీ20లలో ‘ఒక బ్యాటర్‌ గాయం లేదా అస్వస్థత కారణంగా క్రీజును వదిలితే అతడు తిరిగి మరో సూపర్‌ ఓవర్‌లోనూ బ్యాటింగ్‌కు రావొచ్చు.. ఒకవేళ అలా కాకుంటే (బ్యాటర్‌ క్రీజులోకి రావాలంటే) సదరు బ్యాటర్‌ ‘రిటైర్డ్‌ నాట్‌ అవుట్‌’ గానే పరిగణిస్తారు..’ అని రాసి ఉంది. అయితే ఇదే నిబంధనలో రిటైర్డ్‌ అవుట్‌ అయిన బ్యాటర్‌ తిరిగి రెండో సూపర్‌ ఓవర్‌లో బ్యాటింగ్‌కు రావాలంటే ప్రత్యర్థి జట్టు సారథి సమ్మతితో మళ్లీ బ్యాటింగ్‌ చేయొచ్చు అని కూడా ఉంది. దీని ప్రకారం.. నిన్న రోహిత్‌ శర్మ రెండో సూపర్‌ ఓవర్‌లో బ్యాటింగ్‌కు వచ్చింది అఫ్గాన్‌ సారథి ఇబ్రహీం జద్రాన్‌ సమ్మతితోనే అనేది సుస్పష్టం.
మ్యాచ్‌ విషయానికొస్తే.. భారత్‌ నిర్దేశించిన 212 పరుగుల ఛేద నలో అఫ్గాన్‌ కూడా అన్నే రన్స్‌ చేయడంతో మ్యాచ్‌ టై అయింది. దీంతో అంపైర్లు సూపర్‌ ఓవర్‌ నిర్వహించాల్సి వచ్చింది. తొలి సూపర్‌ ఓవర్‌లో అఫ్గాన్‌ 16 పరుగులు చేయగా భారత్‌ కూడా అక్కడే ఆగిపోయింది. రెండో సూపర్‌ ఓవర్‌లో భారత్‌ 11 పరుగులు చేసింది. అఫ్గాన్‌ మాత్రం ఒక్క పరుగే చేసి రెండు వికెట్లను కోల్పోయింది. దీంతో భారత్‌ విజయాన్ని అందుకుంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు