లక్నో : ఏసీ వేసుకుని డాక్టర్ నిద్రించడంతో.. ఓ ఇద్దరు నవజాత శిశువులు మృతి చెందారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని శామ్లి జిల్లాలో ఆదివారం చోటు చేసుకోగా, ఆలస్యంగా వెలుగు చూసింది. కైరణా ప్రభుత్వ ప్రైమరీ హెల్త్ సెంటర్‌లో శనివారం ఇద్దరు శిశువులు జన్మించారు. మెరుగైన చికిత్స నిమిత్తం ఆ పసిపాపలను ఇద్దరిని అదే రోజు ఓ ప్రయివేటు క్లినిక్‌కు తరలించారు. దీంతో ఆ నవజాత శిశువులను ఫోటోథెరపీ యూనిట్‌లో ఉంచి చికిత్స ప్రారంభించారు. అయితే ఆదివారం రాత్రి డాక్టర్ నీతూ హాయిగా నిద్రించేందుకు ఫోటోథెరపీ యూనిట్‌లో ఏసీ వేసుకున్నారు. ఆ చలికి తట్టుకోలేక పిల్లలిద్దరూ ఆదివారం ఉదయం కన్నుమూశారు. చనిపోయిన పిల్లలను చూసి వారి కుటుంబ సభ్యులు డాక్టర్ నీతూపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై నవజాత శిశువుల కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. డాక్టర్ నీతూను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆస్పత్రిని సీజ్ చేశారు.