- ప్రాణాంతకంగా మారిన ప్రయాణం.
- ఈ రోడ్డుకు మోక్షం ఎప్పుడు కలుగునో?
- నిద్ర మత్తులో అధికారులు.. కనీసం పట్టించుకోని నాయకులు
- తీవ్ర ఇబ్బందులు పడుతున్న గిరిజన తండాల ప్రజలు..
- సారూ జర ఈ రోడ్డు గురించి పట్టించుకోరూ!
మఠంపల్లి : సూర్యపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండలం లోని పల్లెల నుండి మండల కేంద్రాలను కలుపుతూ పంచాయతీ రాజ్ శాఖ గతంలో నిర్మించిన గ్రామీణ రహదారులు శిథిలావస్థకు చేరి వాహన దారులకు నరకాన్ని చూపిస్తున్నాయి. దశాబ్దాలుగా మరమ్మత్తులకు నోచుకోక బీటి పూర్తిగా తొలగిపోయి కంకర తేలడంతో ద్విచక్ర వాహనాలు, ఆటోలు, స్కూల్ బస్సుల పై వెళ్లేవారు ప్రాణాలు అరచేత పట్టుకొని ప్రయాణించాల్సి వస్తుంది. వర్షము పడి వర్షపు నీరు నిల్వ ఉండడంతో పెద్ద పెద్ద గుంతలు పడి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ రోడ్డు కృష్ణ తండా, గుర్రంపోడు తండా, భీమ్లా తండా, భోజ్య తండా, రామచంద్రపురం తండా నుంచి దాదాపు 7 కిలోమీటర్ల దూరంలో సింహపురి వద్ద ఆర్ అండ్ బి రహదారిని కలుపుతోంది. ఇక్కడి గ్రామాల ప్రజలు నిత్యం వందల సంఖ్యలో హుజూర్నగర్, ఏపీలోని పట్టణాలకు వెళుతుంటారు. 2016లో కృష్ణ పుష్కరాల సందర్భంగా పిఆర్ నిధులతో బీటీ రహదారి నిర్మించారు. రోడ్డు వేసిన రెండెళ్లకే తారు తొలగిపోయి కంకర తేలింది. అప్పటినుండి సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు విన్నవించినా ప్రయోజనం లేకుండా పోయిందని స్థానికులు చెబుతున్నారు. ఇతర వాహనాలతో పాటు నిత్యం వివిధ పాఠశాలల బస్సులు, ఆటోలు వస్తుంటాయని, చిన్నారులు, ప్రయాణికుల అవస్థలను దృష్టిలో ఉంచుకొని శిథిలమైన రహదారిని పునర్ నిర్మించాలని కోరుతున్నారు. మండలానికి చెందిన పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న నాయకులు ఇదే ప్రాంతానికి చెందిన వారు కావడం గమనార్హం. మరి ఆ పదవుల్లో ఉన్న నాయకులు ఈ రోడ్డు గురించి ఎందుకు పట్టించుకోవడం లేదో అని, గిరిజన ప్రాంతాల ప్రజలంటే అంత చిన్న చూపా అని చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు ఆ నాయకులను, అధికారులను విమర్శిస్తున్నారు. గ్రామాలలో ఛోటా, మోటా నాయకులేమో మా లీడర్ గొప్ప అంటే మా లీడర్ గొప్ప అని వారి భజనలు చేస్తారు. కానీ ఈ రోడ్డు గురించి మాత్రం పట్టించుకోరు. ఆ గుంతలు ఉన్న రోడ్డు మీద వాహనాలు కానీ ప్రజలు కానీ ప్రమాదాలకు గురైతే అప్పుడు ఎక్కడా లేని మానవత్వం బయటకు వస్తుంది. అదే ముందే జాగ్రత్త పడి రోడ్డు వేస్తే ప్రమాదాలు జరగకుండా చూడవచ్చు. ఈ నెల రోజుల వ్యవధి లో స్థానిక ఎమ్మెల్యే రెండు మూడు సార్లు పెళ్ళి కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అని ఈ రోడ్డు మీదనే ప్రయాణం చేశారు. మరి ఎమ్మెల్యే అయిన వెంటనే చొరవ తీసికొని రోడ్డు వేయిస్తారేమో చూడాలి. ఇకనైనా స్థానిక నాయకులు, అధికారులు వెంటనే స్పందించి చుట్టు పక్కల ఉన్న గ్రామాల గిరిజన ప్రజలు ఈ రోడ్డు మీద ప్రమాదాలకు గురికాకుండా వెంటనే క్రిష్ణ తండా స్టేజి నుండి రామచంద్రాపురం మీదుగా నాగార్జున సిమెంట్ ఫాక్టరీ వరకు ఉన్న రోడ్డు వేయాలని గిరిజన గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేని యెడల రాబోయే రోజుల్లో ఓటు అనే ఆయుధంతో ఆ నాయకులను తగిన బుద్ధి చెబుతాం అని గిరిజన గ్రామాల ప్రజలు హెచ్చరిస్తున్నారు. ఈ విషయంపై పంచాయతీరాజ్ డి ఈ వెంకటేశ్వర్లును సంప్రదించగా మీ మండల ఏఈ ని అడగండి పూర్తిగా మీకు సమాచారం అందిస్తారు అని అన్నారు. ఏఈ ని వివరణ అడుగుదామని ప్రయత్నం లో భాగంగా ఎన్ని సార్లు ఫోన్ చేసినా కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయని పరిస్థితి.