ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ట్రూడో ఆరోపణలతో భారత్-కెనడా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విషయంలో పొరుగు దేశమైన శ్రీలంక భారత్‌కు మద్దతుగా నిలిచింది. ఈ మేరకు కెనడా ప్రధాని ట్రూడోపై ఆ దేశ విదేశాంగ మంత్రి అలీ సబ్రీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ట్రూడో ఏ విధమైన ఆధారాలూ ఇవ్వకుండా దారుణమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ‘కొంతమంది తీవ్రవాదులు కెనడాలో సురక్షిత స్థావరాన్ని ఏర్పరుచుకున్నారు. ఎటువంటి ఆధారాలూ లేకుండా కొన్ని దారుణమైన ఆరోపణలతో కెనడా ప్రధాని ముందుకొచ్చినట్లు అనిపిస్తోంది. గతంలో మాపై కూడా వారు ఇలాంటి ఆరోపణలే చేశారు. శ్రీలంకలో మారణహోమం జరిగిందన్నది భయంకరమైన అబద్ధం. మా దేశంలో మారణహోమం జరగలేదని అందరికీ తెలుసు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నాజీలతో కలసి పోరాడిన వ్యక్తికి కెనడాలో సాదర స్వాగతం లభించడాన్ని చూశాను. ఇది నిజంగా ప్రశ్నించదగినది. కొన్ని సందర్భాల్లో ట్రూడో నిరాధార, దారుణ ఆరోపణలు చేయడం నాకేమీ ఆశ్చర్యం కలిగించలేదు’ అంటూ వ్యాఖ్యానించారు.