- ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఎదుట మహిళల ఆందోళన
మిర్యాలగూడ : మేమేం పాపం చేశాం… రోజు కూలీ చేసుకునే కూలీలం… కక్షగట్టి మా మూడు బజార్లకు డబ్బులు పంపిణీ చేయలేదంటూ ఆగ్రహిస్తూ బుధవారం సాయంత్రం మిర్యాలగూడ పట్టణంలోని స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట 36 38 వార్డులకు చెందిన మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆందోళన చేపట్టారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అధికార బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు ఓటుకు వెయ్యి చొప్పున పంపిణీ చేస్తున్నారని… 36, 38 వార్డులలో సుందర్ నగర్ చెందిన కొన్ని బజార్లకు వార్డు ఇన్చార్జిలు డబ్బులు పంపిణీ చేయలేదని చుట్టుపక్కల అందరికీ ఇచ్చి తమకు మాత్రం ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నించారు. తాము రేక్కాడితే గానీ డోక్కాడని కూలీలమని ఏ పార్టీ వారు పిలిచినా ఊరేగింపులకు వెళ్లామని వాటిని సాకుగా చూపి సాక్షాత్తు మున్సిపల్ చైర్మన్ తిరు నగర్ భార్గవ్ మీకు డబ్బులు ఇవ్వద్దంటూ చెప్పారని వార్డు ఇన్చార్జిలు చెబుతున్నారని, ఇదెక్కడి అన్యాయం అంటూ ఆగ్రహిస్తూ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న టూ టౌన్ పోలీసులు వారిని అక్కడ నుంచి పంపించి వేశారు.