- వైసిపికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటన
- స్వాగతించిన టిడిపి.. అయోమయంలో వైసిపి
అమరావతి : వైఎస్‌ఆర్‌సీపీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. టిక్కెట్లు దక్కక కొందరు రాజీనామాలకు సిద్దపడుతున్నారు. మరికొందరు పార్టీకి గుడ్‌బై చెబుతున్నారు. తాజాగా క్రికెటర్ అంబటి రాయుడు షాక్ ఇచ్చారు. పార్టీలో జాయిన్ అయిన వారం రోజులకే పార్టీకి రాజీనామా చేసినట్టు ప్రకటించారు. వైఎస్‌ఆర్‌సీపీ నుంచి వైదొలగుతున్నట్టు సోషల్ మీడియా వేదికగా అంబటి రాయుడు ప్రకటించారు. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండబోతున్నట్టు తెలిపారు. ఆ తర్వాత భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తానంటూ వెల్లడిరచారు. డిసెంబర్ 28వ తేదీన పార్టీలో వైసీపీలో చేరారు. సరిగ్గా పది రోజుల్లో పార్టీని వీడుతున్నట్టు తెలపడం సంచలనంగా మారింది. ఈ మధ్య కాలంలో వైసీపీ నేతల రాజీనామాలు తరచూ వినిపిస్తున్నాయి. టికెట్ రాదనుకున్న నేతలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తున్నారు. అవన్నీ ఒక ఎత్తైతే ఇప్పుడు అంబటి రాయుడు రాజీనామా మాత్రం చాలా ప్రత్యేకమనే చెప్పాలి. ఎప్పటి నుంచో ఉన్న నేతలను పార్టీయే వదులుకుందని… జగన్ వద్దనుకోవడంతోనే వాళ్లంతా రాజీనామాలు చేస్తున్నారి సమర్థించుకోవచ్చు. కానీ అంబటి రాయుడు రాజీనామాను మాత్రం ఎలా సమర్థించుకుంటారో చూడాలి. కనీసం పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఒక్కసారైనా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా జాయిన్ అయిన పది రోజులకే ఇలా రాజీనామా చేయడం తెలుగు రాష్ట్ర రాజకీయాల్లోనే సంచలనంగా మారుతోంది. ఇలా చేరిన పదిరోజుల్లో వైసీపీని వీడుతున్నట్లు మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ప్రకటించడం రాజకీయ వర్గాల్లో సంచలనం కలిగించింది.ఈ నిర్ణయం ప్రకటించడంపై టీడీపీ స్పందించింది. ’జగన్ వంటి దుర్మార్గుడితో కలిసి మీరు మీ రాజకీయ ఇన్నింగ్స్ ఆడనందుకు సంతోషంగా ఉంది. మీ భవిష్యత్ ప్రయత్నాల్లో మీకు అంతా మంచే జరగాలని దేవుడిని కోరుకుంటున్నాం’ అంటూ సంచలన ట్వీట్ చేసింది. దీనికి అంబటి రాయుడు ట్వీట్ ను ట్యాగ్ చేసింది. దీంతో అధికార పార్టీ నేతలు, కార్యకర్తల్లో గందరగోళం నెలకొంది. ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారో అంటూ పార్టీ శ్రేణులు, అభిమానుల్లో ఉత్కంఠ రేగింది. గుంటూరు ఎంపీ టికెట్ ఇస్తామన్న హామీతోనే అంబటి రాయుడు వైసీపీలో చేరారు. అయితే, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలని గుంటూరు స్థానానికి మారాల్సిందిగా సీఎం జగన్ శుక్రవారం ప్రతిపాదించారు. ఆ స్థానాన్ని బీసీ అభ్యర్థికి కేటాయించాలని అనుకుంటున్నట్లు చెప్పారు. దీనికి ఏమాత్రం అంగీకరించని శ్రీకృష్ణదేవరాయలు తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. రాయుడుకి మచిలీపట్నం టికెట్ ఆఫర్ చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో గుంటూరు టికెట్ ఆశించిన రాయుడు, పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం చర్చనీయాంశమైంది.