Thursday, May 2, 2024

కాంగ్రెస్ గూటికి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కీలక నేత

తప్పక చదవండి
  • బీఆర్ఎస్ కు డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి గుడ్ బై
  • మారనున్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రాజకీయ సమీకరణాలు
  • అగ్రనేతల సమక్షంలో కాంగ్రెస్ కండువ కప్పుకోనున్న మనోహర్ రెడ్డి

హైదరాబాద్ :- తెలంగాణలో మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. జంపింగులతో రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి.జనవరి నెల చివరి మాసంలో అసెంబ్లీ ఎన్నికలను పూర్తిచేసేందుకు ఈసీ కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నియోజకవర్గాల వారిగా అభ్యర్థులను ప్రకటించేశారు. బీజేపీ, కాంగ్రెస్,టీడీపీ పార్టీలు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి. త్వరలో మూడు పార్టీలు నియోజకవర్గాల వారిగా తమతమ అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ పార్టీలో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ టీడీపీ లవైపు చూస్తున్నారు. ఇప్పటికే కొందరు కాంగ్రెస్, బీజేపీ నేతలు అధికార పార్టీ తీర్థం పుచ్చుకోగా మరికొందరు సమయం కోసం వేచి చూస్తున్నారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్
బీఆర్ఎస్ కు డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి గుడ్ బై చెప్పేయడంతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రాజకీయ సమీకరణలు ఒక్కసారిగా మారిపోయాయి. మంత్రి కేటీఆర్ కు అత్యంత సన్నిహిత నేతగా మనోహర్ రెడ్డికి పేరుంది.మనోహర్ రెడ్డి తొలుత పరిగి నియోజకవర్గం టికెట్ ను ఆశించారు . కానీ, ఇటీవల బీఆర్ఎస్ అధిష్టానం ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో తన పేరు లేకపోవటంతో మనోహర్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ పెద్దలు మనోహర్ రెడ్డిని సంప్రదించడంతో పాటు, తాండూరు నియోజకవర్గం కాంగ్రెస్ టికెట్ ఇచ్చేందుకు ఓకే చెప్పినట్లు తెలిసింది. దీంతో ఆయన బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. అగ్రనేతల సమక్షంలో కాంగ్రెస్ కండువ కప్పుకోనున్న మనోహర్ రెడ్డి
మనోహర్ రెడ్డి ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. గురువారం ఆయన నివాసంలో కాంగ్రెస్ నేతలు భేటీ కానున్నారు. ఈ సమావేశానికి వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి, మాజీ మంత్రి ప్రసాద్ హాజరు కానున్నారు. అనంతరం ప్రసాద్, రామ్మోహన్ రెడ్డిలు మనోహర్ రెడ్డిని రేవంత్ వద్దకు తీసుకెళ్లనున్నారు. శుక్రవారం ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతల సమక్షంలో మనోహర్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు