Sunday, April 28, 2024

దేశీయ మార్కెట్లలోకి పోటెత్తిన విదేశీ పెట్టుబడుల వరద..

తప్పక చదవండి
  • ఈ నెలలోనే గరిష్టం..

ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగింట బీజేపీ గెలుపొందడంతో బలమైన ఆర్థిక వృద్ధి, రాజకీయ సుస్థిరత నెలకొంటుందన్న అంచనాల మధ్య దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఆల్‌టైం రికార్డు నెలకొల్పాయి. ఈ నెలలో దేశీయ స్టాక్‌ మార్కెట్లలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) రూ.57,300 కోట్లకు పైగా విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశారు. దీనికితోడు అమెరికా ట్రెజరీ బాండ్ల విలువ స్థిరంగా తగ్గడంతో ఈ ఏడాదిలో భారత్‌ స్టాక్‌ మార్కెట్లలో ఎఫ్‌పీఐల పెట్టుబడులు రూ.1.62 లక్షల కోట్ల మార్కును దాటేశాయి. అమెరికాలో వడ్డీరేట్లు తగ్గుతాయన్న అంచనాల మధ్య కొత్త ఏడాదిలో భారత్‌ స్టాక్‌ మార్కెట్లలో ఎఫ్‌పీఐ పెట్టుబడులు పెరిగే అవకాశం ఉందని జియోజిత్‌ ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌ చీఫ్‌ ఇన్‌వెస్ట్‌మెంట్‌ ఆఫీసర్‌ వీకే విజయ కుమార్‌ తెలిపారు. దేశీయ స్టాక్‌ మార్కెట్ల నుంచి వెలువడిన గణాంకాల ప్రకారం ఈ నెల 22 నాటికి ఎఫ్‌పీఐలు నికరంగా రూ.57,313 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశారు. ఈ ఏడాది ఎఫ్‌పీఐల పెట్టుబడుల్లో ఇదే గరిష్టం. గత అక్టోబర్‌లో రూ.9,000 కోట్ల పెట్టుబడులు వస్తే, ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో విదేశీ ఇన్వెస్టర్లు రూ.39,300 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించారు. జాతీయ రాజకీయాల్లో సుస్థిరత, సానుకూల సెంటిమెంట్‌ వంటి అంశాలతో భారత్‌ స్టాక్‌ మార్కెట్లలోకి ఎఫ్‌పీఐ పెట్టుబడులు వచ్చి పడుతున్నాయని మార్నింగ్‌ స్టార్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ రీసెర్చ్‌ మేనేజర్‌ రీసెర్చ్‌-అసోసియేట్‌ డైరెక్టర్‌ హిమాన్షు శ్రీవాత్సవ చెప్పారు. కార్పొరేట్‌ సంస్థల స్ఫూర్తిదాయక ఆర్థిక ఫలితాలు కూడా దీనికి మరో కారనం అని జియోజిత్‌ ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌ చీఫ్‌ ఇన్‌వెస్ట్‌మెంట్‌ ఆఫీసర్‌ వీకే విజయ కుమార్‌ అన్నారు. ఇక డెట్‌ మార్కెట్లోకి ఈ ఏడాది కాలంలో రూ.15,545 కోట్ల ఎఫ్‌పీఐ నిధులు వచ్చి చేరాయి. గత నెలలో రూ.14,860 కోట్లు, అక్టోబర్‌లో 6,381 కోట్ల నిధులు వచ్చి చేరాయి. ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌తోపాటు ఆటోమొబైల్‌, క్యాపిటల్‌ గూడ్స్‌, టెలికం రంగాల్లో ఎఫ్‌పీఐ పెట్టుబడులు ఎక్కువగా పెట్టుబడి పెట్టారని గణాంకాలు చెబుతున్నాయి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు