Saturday, April 27, 2024

పొగతాగటంతో ఏటా 13 లక్షల క్యాన్సర్‌ మరణాలు

తప్పక చదవండి

న్యూఢిల్లీ : ధూమపానం కారణంగా క్యాన్సర్‌ బారినపడి భారత్‌ సహా ఏడు దేశాల్లో ఏటా 13 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఈ వివ రాలు ప్రముఖ వైద్య పత్రిక ‘ద లాన్సెట్స్‌’ జర్నల్‌’లో ప్రచురితమయ్యాయి. ఇంటర్నేషనల్‌ ఏజెన్సీ ఫర్‌ రీసెర్చ్‌ ఆన్‌ క్యాన్సర్‌, క్వీన్స్‌ మేరీ యూనివర్సిటీ ఆఫ్‌ లండన్‌, కింగ్స్‌ కాలేజ్‌ శాస్త్రవేత్తలు ఈ పరిశోధనలో పాలుపంచుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా సంభవిస్తున్న క్యాన్సర్‌ మరణాల్లో సగా నికి పైగా.. భారత్‌, చైనా, రష్యా, అమెరికా, బ్రిటన్‌, బ్రెజిల్‌, దక్షిణాఫ్రికా దేశాల్లోనే సంభవిస్తున్నాయ ని ఈ కథనం తెలిపింది. ధూమపానం, మద్యపానం, ఊబకాయంతోపాటు హ్యూమన్‌ ప్యాపిలోమా వైరస్‌ (హెచ్‌పీవీ) ఇన్‌ఫెక్షన్లు వంటి ముప్పు అంశాల వల్ల ఏటా 20 లక్షల మందికిపైగా బలవుతు న్నట్లు వివరించింది. ఇవి నివారించదగ్గ కారణాలేనని పేర్కొంది. వీటితో చోటుచేసుకుంటున్న అకాల మరణాల వల్ల ఏటా 3 కోట్ల ఏళ్ల జీవన కాలానికి గండిపడుతున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. కేవలం ధూమపానం వల్లే 2.08 కోట్ల సంవత్సరాల జీవనకాలాన్ని ప్రజలు కోల్పోతున్నారని పేర్కొన్నారు. ఇక నివేదిక లోని ముఖ్యాంశాలను చూస్తే.. .ప్రపంచవ్యాప్తంగా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌తో ప్రతి రెండు నిమిషాలకు ఒకరు చొప్పున చనిపోతున్నారు. ఇందులో 90 శాతం మరణాలు అల్ప, మధ్యాదాయ దేశాల్లోనే సంభవిస్తున్నాయి. సమగ్ర స్క్రీనింగ్‌, హెచ్‌పీవీ టీకా కార్యక్రమాలతో వీటిని బాగా తగ్గించొచ్చు. భారత్‌లో పురుషుల్లో తల, మెడ క్యాన్సర్‌తో ఎక్కువ మంది చనిపోతున్నారు. మహిళల్లో పునరుత్పత్తి వ్యవస్థల్లో సంభవించే క్యాన్సర్లతో అధికశాతం మంది ప్రాణాలు కోల్పోతు న్నారు. మిగతా దేశాలు.. ధూమపానం కారణంగా సంభవిస్తున్న క్యాన్సర్లతో ఎక్కువ జీవనకాలాన్ని నష్టపోతున్నాయి. ఆమెరికా, బ్రిటన్‌ వంటి దేశాలతో పోలిస్తే భారత్‌, దక్షిణాఫ్రికాల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ తక్కువగా జరుగుతోంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు