- శ్వేతపత్రం విడుదల చేసిన భట్టి
- అప్పులు చేసి ఆస్తులు పెంచామన్న జగదీశ్ రెడ్డి
- గత ప్రభుత్వం తీరుపై మండిపడ్డ అధికార పక్షం
- ప్లాంట్ల పేరుతో దోపిడీ చేశారని కోమటిరెడ్డి ఆరోపణలు
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో విద్యుత్ అక్రమాలపై వాడీవేడీ చర్చ సాగింది. వాదోపవాదాలు సాగాయి. నాటి బిఆర్‌ఎస్ ప్రభుత్వ విధానాలపై విపక్ష సభ్యులు విమర్శలు సంధించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విద్యుత్‌పై శ్వేతపత్రం విడుదల చేశారు. దీనిపై సభలో లఘు చర్చ ప్రాంభం కాగా, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి గత నిర్ణయాలను సమర్థించుకున్నారు. అయితే రాష్టాన్రికి సంబంధించినంతవరకు ఏ రంగం అభివృద్ధి చెందాలన్న విద్యుత్ అవసరమని.. అలాంటి విద్యుత్ ఉత్పత్తి, ధీంట్లో ఇబ్బందులపై రాష్ట్ర ప్రజలకు వాస్తవ పరిస్థితులు తెలియాలనే ఆలోచనతో శ్వేత పత్రాన్ని ప్రవేశపెడుతున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పురోగతి, అభివృద్ధిలో విద్యుత్ రంగం కీలకపాత్ర పోషిస్తోందని భట్టి విక్రమార్క అన్నారు. పరిశ్రమల అభివృద్ధికి, వ్యవసాయ రంగం పురోగతికి, సేవారంగం అభివృద్ధికి నమ్మకమైన విద్యుత్ సరఫరాయే వెన్నెముకని అన్నారు. వైద్య రంగంలో అత్యవసర సేవలకైనా, రవాణా, సమాచార రంగాల మనుగడకైనా నాణ్యమైన విద్యుత్ సరఫరా చాలా ముఖ్యమని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రజల నాణ్యమైన జీవన శైలిని సూచించేది కూడా విద్యుత్ అని ఆయన వ్యాఖ్యానించారు. మొత్తంగా చూస్తే ఆర్థిక, నిర్వాహణ పరంగా విద్యుత్ రంగం పరిపుష్టిగా ఉండడం రాష్ట్ర మనుగడకు చాలా అవసరమని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి జెన్‌కోలో విద్యుత్ సామర్థ్యం
4,365.26 మెగావాట్లుగా ఉందిని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పాటు కన్నా చాలా ముందు గానే.. ఆనాటి నాయకుల ముందు చూపుతో తెలంగాణలో 2,960 మెగావాట్ల విద్యుత్ కేంద్రాలకు అవసరమైన ప్రణాళిక పనులు చేపట్టారన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉత్పతి ప్రారంభించిన కొత్త విద్యుత్ కేంద్రాలే తర్వాత కాలంలో తెలంగాణలో నాణ్యమైన విద్యుత్‌ను అందించడంలో కీలక పాత్ర పోషించాయన్నారు. రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టం రూపకల్పన సమయంలోనే విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యానికి అదనంగా 18 వందల మెగావాట్ల విద్యుత్ వచ్చే విధంగా యూపీయే ప్రభుత్వం సోనియాగాంధీ నాయత్వంలో ప్రత్యేక నిబంధన చట్టంలో రూపొందించడం జరిగిందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత బీఆర్‌ఎస్ ప్రభుత్వం మొదలు పెట్టి పూర్తి చేసింది కేవలం 1080 మెగావాట్ల భద్రాద్రి థర్మల్ మాత్రమేనని ఈ ప్రాజెక్టులో ప్రమాణాలకు విరుద్ధంగా సబ్ క్రిటికల్ టెక్నాలజీ ఉపయోగించటం వల్ల పెట్టుబడి వ్యయం భారీగా పెరిగిందని భట్టి విక్రమార్క అన్నారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ వ్యయంలో కేవలం బొగ్గు సరఫరాకు ఏడాదికి 800 కోట్లు అదనంగా అవుతుందని, రాష్ట్ర విద్యుత్ రంగ ఆర్థిక పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉందని, డిస్కంలు రూ. 81 వేల 516 కోట్ల నష్టాల్లో ఉన్నాయని, విద్యుత్ ఉత్పత్తి, సరఫరా సంస్థలకు రూ. 28,673 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. ప్రభుత్వంలోని వివిధ శాఖలు రూ. 28,842 కోట్ల బకాయిలను డిస్కంలకు చెల్లించాల్సి ఉందని, రూ. 14,193 కోట్లు సాగునీటి శాఖ బకాయి ఉందన్నారు. విద్యుత్ కొనుగోళ్లలో ఇబ్బందులకు ఈ బకాయిలే ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం రూ. 14,928 కోట్ల సర్దుబాటు ఖర్చులు చెల్లించక పోవటం డిస్కంల ఆర్థిక పరిస్థితిని కుంగదీసిందని, దీంతో రోజువారి విద్యుత్ మనుగడకు భారీగా అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిరదన్నారు. ఎన్ని ఆర్థిక సవాళ్లు ఉన్న వాటిని అధిగమించి నాణ్యమైన విద్యుత్‌ను అందించటానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఈ అంశంపై మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ..దేశంలో 24 గంటల విద్యుత్‌ను అన్ని రంగాల వినియోగదారులకు అందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని నీతి ఆయోగ్ తన స్టేట్ ఎనర్జీ అండ్ క్లైమెట్ ఇండెక్స్‌లో ప్రకటించిందని గుర్తు చేశారు. తెలంగాణలో విద్యుత్ పరిస్థితిని ఆయన వివరించారు. 2014 జూన్ 2 నాటికి విద్యుత్ సంస్థల ఆస్తులు 44,438 కోట్లు ఉంటే.. అప్పు 22,423 కోట్లు ఉండేదని జగదీశ్ రెడ్డి తెలిపారు. ఇప్పుడు ఆ అప్పులు 81,016 కోట్లు అవ్వగా.. ఆస్తుల విలువ 1,37,570 కోట్లకు పెంచామని వివరించారు. తెచ్చిన అప్పుతో ఎక్కడా నష్టం జరగలేదని.. ఆస్తులు పెంచామని వివరించారు. ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో పిల్లలకు పరీక్షలు వస్తున్నాయంటే.. పెద్దలకే పెద్ద పరీక్ష ఉండేదని గుర్తు చేశారు. పరీక్షలు వస్తున్నాయంటే.. కిరసనాయిల్ దేవులాడుకురావడం.. క్యాండిల్స్ కొనుక్కొచ్చుకునే పరిస్థితి ఉండేదన్నారు. ఒకప్పుడు పల్లెల్లో నీళ్లు కావాలంటే బోరుబావుల దగ్గరకు వెళ్లి తెచ్చుకోవాల్సిన దుస్థితి ఉండేదన్నారు. అలా బోరుబావి దగ్గరికి పోయాక కరెంటు పోతే.. రెండు గంటలా మూడు గంటలా నాలుగు గంటలా ఎన్ని గంటలు అక్కడే ఉండాలో తెలియని పరిస్థితి ఉండేదన్నారు. బిందెడు నీళ్లు లేకుండా ఇంటికి పోతే ఎసరు పెట్టే పరిస్థితి లేదని గుర్తు చేశారు. ఆనాడు పరిశ్రమలు, వాణిజ్య రంగం, వ్యాపార రంగం, జనరేటర్ లేని ఏ ఒక్క షాపు, ఇన్వర్టర్ లేని ఇల్లు ఉండేదా? అని ప్రశ్నించారు. ప్రపంచంలో పారిశ్రామికవేత్తలు ధర్నా చేసిన మొట్టమొదటి సందర్భం సమైక్య పాలనలోనే హైదరాబాద్‌లో జరిగిందని అన్నారు. ఇదే అంశంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి మధ్య వాడీ వేడీ చర్చ జరిగింది. ముందుగా యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టులో పెద్ద కుంభకోణం జరిగిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. ఇందులో 10 వేల కోట్లను జగదీశ్ రెడ్డి తిన్నారని అన్నారు. మంత్రి కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై జగదీశ్ రెడ్డి ధీటుగా స్పందించారు.కోమటిరెడ్డి చేసిన ఆరోపణలపై సిట్టింగ్ జడ్జితో లేదా కమిషన్‌తో విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని జగదీశ్ రెడ్డి కోరారు. ఆ విచారణలో దోషులు దొరికితే వాళ్లకు శిక్ష వేయాలన్నారు. లేదంటే ఆధారాలు లేకుండా అసంబద్ధ ఆరోపణలు చేసిన వారికి శిక్ష పడాలన్నారు. తప్పకుండా ఈ విషయం తేలాలని అన్నారు. ఇటువంటివి చాలా సందర్భాల్లో బయట మాట్లాడుతుంటే విన్నానని.. కానీ ఏ ఒక్కరోజు కూడా రియాక్ట్ కాలేదని చెప్పారు. ఇవన్నీ పనికిమాలిన మాటలు.. అర్థం లేని.. ఆధార రహితమైన మాటలు అని అన్నారు. ఇవన్నీ రికార్డుల్లోకి రావాలనే ఇన్ని రోజులు వెయిట్ చేశానని.. ఇవాళ రికార్డుల్లోకి వచ్చాయని అన్నారు. దీనిపై తప్పకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. మూడు అంశాలపై జ్యుడీషియల్ ఎంక్వైరీ చేసేందుకు సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఆ విచారణతో పాటు.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన ఆరోపణలపై కూడా విచారణ చేయాలన్నారు. వారు చేసిన ఆరోపణలు అసంబద్ధమైతే తప్పకుండా శిక్ష పడాల్సిన అవసరం ఉందని పునరుద్ఘాటించారు. అది మీరు చేయగలుగుతారా? ప్రజా కోర్టులో తేలుస్తామా అనేది చూడాలన్నారు. అయితే వాస్తవ పరిస్థితులను కాదని గతం గురించి మాజీమంత్రి మాట్లాడడంపై సభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు అభ్యంతరం చెప్పారు. తరవాత ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ విద్యతు పేరుతో అక్రమాలు జరిగాయని, దీనిపై సమగ్ర విచారణ జరగాల్సిందేనని అన్నారు.