Thursday, May 2, 2024

కొనసాగుతున్న ఇజ్రాయెల్‌ – హమాస్‌ యుద్ధం

తప్పక చదవండి
  • మరో ఇద్దరు హమాస్‌ కమాండర్లను హతమార్చిన ఇజ్రాయెల్‌ సైన్యం.
  • ఐడీఎఫ్‌ ప్రతినిధి లెఫ్టినెంట్‌ కర్నల్‌ రిచర్డ్‌ హెచ్ట్‌ ప్రకటన..

ఇజ్రాయెల్‌ – హమాస్‌ మధ్య యుద్ధం కొనసాగుతున్నది. ఇప్పటి వరకు 11వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఖాన్‌ యూనిస్‌ బ్రిగేడ్‌లోని యాంటీ ట్యాంక్‌ యూనిట్‌ హెడ్‌ యాకోవ్‌ అషర్‌ను హతమార్చినట్లు ఇజ్రాయెల్‌ సైన్యం ప్రకటించింది. అలాగే మహ్మద్‌ ఖమీస్‌ దబాబేష్‌ను సైతం చంపినట్లు తెలిపింది. దబాబేష్ ప్రస్తుతం హమాస్ రాజకీయ విభాగంలో పని చేస్తున్నాడు. అంతకుముందు అతను హమాస్‌ సాయుధ విభాగానికి చీఫ్‌గానూ సేవలందించాడు. ఇజ్రాయెల్ సైన్యం ఇతర హమాస్ కమాండర్లను సైతం మట్టుబెట్టినట్లు పేర్కొంది. అయితే, హమాస్‌ మాత్రం మరణాలను ధ్రువీకరించలేదు.

239 మంది ఇజ్రాయెలీ బంధీలను విడుదల చేసేందుకు గాజాలోని తమ దళాలు పని చేస్తూనే ఉన్నాయని ఐడీఎఫ్‌ ప్రతినిధి లెఫ్టినెంట్‌ కర్నల్‌ రిచర్డ్‌ హెచ్ట్‌ పేర్కొన్నారు. హమాస్‌పై యుద్ధంలో ఇజ్రాయెల్‌ సైన్యం భూమి, వాయు, నౌకాదళాన్ని వినియోగిస్తున్నది. తమ యుద్ధం హమాస్‌తో మాత్రమేనని.. గాజా ప్రజలకు వ్యతిరేకం కాదని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా.. కాల్పుల విరమణను డిమాండ్‌ చేస్తూ యూరోపియన్‌ సిటీ బ్రస్సెల్స్‌లో ఈయూ విదేశాంగ మంత్రుల సమావేశం జరిగింది. గాజాలో తక్షణమే కాల్పుల విరమణ ప్రకటించాలని కోరింది.
గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఇస్మాయిల్ అల్-తవాబ్తా యుద్ధంలోని తాజా మరణాలపై మరణాల గణాంకాలను సమర్పించారు. గాజాలో ఇప్పటివరకు 11,240 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 4,630 మంది పిల్లలు, 3,130 మంది మహిళలు ఉన్నారు. గాజాలో ఇప్పటివరకు 189 మంది హెల్త్‌ కేర్‌ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. అల్‌ షిపా ఆసుపత్రిలో ఇంధనం లేకపోవడంతో ఇప్పటి వరకు 10 మంది రోగులు ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్‌ నేరాలన్నీ ప్రపంచం నుంచి దాచబడతాయని.. మనవతా సంక్షోభం మరింత తీవ్రమవుతుందని అల్‌ తవాబ్తా పేర్కొన్నారు.
గాజాలోకి ఇంధనాన్ని అనుమతించాలని.. రఫా క్రాసింగ్‌ను తెరవాలన్నారు. యుద్ధం కారణంగా గాజాలో ఇప్పటివరకు 41,120 నివాసగృహాలు ధ్వంసమయ్యాయి. దాంతో పాటు 94 ప్రభుత్వ ప్రధాన కార్యాలయాలు, 71 మసీదులు, 253 పాఠశాలలు, 25శాతం పొలాలు, మూడు చర్చ్‌లు ధ్వంసమయ్యాయి. ఇజ్రాయెల్ సైన్యం తమ 401 బ్రిగేడ్ గాజాలోని షాతీ క్యాంప్ శివారుల్లో దాడులు జరుపుతున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని యూనివర్సిటీలు, పాఠశాలలతో పాటు మసీదులు, నివాస సముదాయాల్లో ఉగ్రవాదులు దాక్కున్నట్లు దాడులతో వెలుగులోకి వచ్చింది. అయితే, ఇజ్రాయెల్‌ వీలైనంత త్వరగా గాజా స్ట్రిప్‌లోని ఉత్తర భాగాన్ని స్వాధీనం చేసుకోవాలని భావిస్తున్నది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు