Tuesday, May 7, 2024

వసూల్ రాజాలుగా చైన్ మెన్లు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు

తప్పక చదవండి
  • చందానగర్ సర్కిల్-21లో కింగ్ మేకర్లు వీళ్లే
  • నిర్మాణాలు జరగాలంటే వీరు అడిగినంత ఇవ్వాల్సిందే
  • సర్కిల్ పరిధిలో ఒక్క టీపీఎస్ అందుబాటులో లేని వైనం
  • కాసులు కురిపిస్తున్న గురుకుల, అయ్యప్ప సోసైటీ ల్యాండ్స్
  • కింది నుంచి పై దాకా కొనసాగుతున్న మామూళ్ల యవ్వారం
  • పత్రికల్లో వార్తలు వస్తున్నా..పట్టించుకోని వైనం

శేరిలింగంపల్లి : చందానగర్ సర్కిల్-21లో చైన్ మెన్లు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల హవా కొనసాగుతోంది. టౌన్ ప్లానింగ్ విభాగంలో వీళ్లే కింగ్ మేకర్లుగా మారిపోయారు. సర్కిల్-21 పరిధిలో ఎక్కడ ఏ బిల్డింగ్ కట్టినా..ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా..వీరికి అడిగినంత ఇచ్చుకోవాల్సిందే. కాదు,కుదరదు అంటే కొత్తగా ఒక ఇటుకను కూడా పేర్చనియ్యరు. తట్టేడు సిమెంట్ ను కూడా పోయ్యనియ్యరు. వాస్తవానికి జీహెచ్ఎంసీ పరిధిలో చందానగర్ సర్కిల్-21 నిర్మాణ రంగంలో వేగంగా దూసుకుపోతోంది. ఈ సర్కిల్ లిమిట్స్ లో చందానగర్,మియాపూర్,హబిస్ పేట్,మాదాపూర్ మొత్తం నాలుగు డివిజన్లున్నాయి. సుమారు 3 లక్షల వరకు జనాభా ఉంటుంది. ప్రతీ ఏటా కొన్ని వందల భవనాల నిర్మాణాలు జరుగుతుంటాయి. గురుకుల ల్యాండ్స్,అయ్యప్ప సోసైటీ వంటి భూములు కూడా చందానగర్ సర్కిల్ పరిధిలోనే ఉన్నాయి.

సర్కిల్-21 పరిధిలోని భవన నిర్మాణాల విషయంలో నిబంధనలను కఠినంగా అమలు చేస్తే ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం సమకూరే అవకాశాలున్నాయి. ప్రతీ సంవత్సరం వందల కొద్ది బిల్డింగ్స్ నిర్మాణాలు జరుగుతున్నందున కోట్లల్లో సోమ్ము సర్కార్ ఖజనాకు జమ అయ్యే ఛాన్సుంది. కానీ, అలా జరగడం లేదు. సర్కిల్ లిమిట్స్ లోని టౌన్ ప్లానింగ్ విభాగం మొత్తం నిర్వీర్యం అయిపోయింది. నిబంధనల ప్రకారం చందానగర్ సర్కిల్-21 పరిధిలోని టౌన్ ప్లానింగ్ వింగ్ కు 4గురు టీపీఎస్ అధికారులుండాలి. అయితే వీరిలో ఒక్కరంటే ఒక్కరు కూడా ప్రస్తుతం అందుబాటులో లేకపోవడం బాధాకరం. ఉన్నతాధికారులు ఒక టీపీఎస్ అధికారిని చందానగర్ కు కేటాయించినప్పటికీ ప్రస్తుతం ఆమె కూడా లీవ్ ఉండడం గమనార్హం.

- Advertisement -

చైన్ మెన్లు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులే కింగ్ మేకర్లు
మరోవైపు సర్కిల్-21లో టీపీఎస్ అధికారులు లేకపోవడంతో చైన్ మెన్లు,ఔట్ సోర్సింగ్ ఉద్యోగులే కింగ్ మేకర్ల అవతారమెత్తారు. చందానగర్ లో వీరు ఆడిందే ఆట..పాడిందే పాటన్న చందనంగా మారిపోయింది. చందానగర్ సర్కిల్ లిమిట్స్ లో ప్రతీరోజు అనేక చోట్ల కొత్త భవనాలు,అదనపు బిల్డింగ్స్ నిర్మాణాలు,సెల్లార్ల కన్స్ట్రక్షన్స్ జరుగుతుంటాయి. అయితే ఎక్కడ కొత్త నిర్మాణాలు ప్రారంభమైనా అక్కడ ఈ చైన్ మెన్లు,ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు గద్దల్లా వాలిపోవడం పరిపాటిగా మారిపోయింది. భవన నిర్మాణ యాజమానులు వీరికి అడిగినంత ఇస్తే కానీ,అస్సలు ఊరుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. జీరో పర్మిషన్ కు ఎంత చెల్లించాలి,అదనపు ఫోర్స్ కన్స్ట్రక్షన్ కు ఎంత ముట్టజెప్పాలి..కొత్త భవనాల నిర్మాణాలకు ఎంత చెల్లించాలి అనే విషయాలపై వీరే ఓ ధరను నిర్ణయించేస్తున్నారు.

ఒకవేళ వీరు చెప్పినంత ఇవ్వకుంటే వెంటనే ఉన్నతాధికారులకు సదరు నిర్మాణ యాజమానుల వివరాలను చేరవేసి పనులను నిలిపివేయిస్తున్నారనే విమర్శలున్నాయి. ఫైర్ సెఫ్టీ,సెట్ బ్యాక్,ఇతరత్రా కారణాలు చెప్పి నిర్మాణాలు నిలుపుదల చేయిస్తున్నారు. ఈ విషయంలో చైన్ మెన్లు,ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి అండదండలు పుష్కలంగా అందుతున్నట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారులు ఇచ్చిన సపోర్టుతోనే ఈ అవినీతి చేప పిల్లలు రెచ్చిపోతున్నట్లు సమాచారం. రోజు వారిగా బిల్డింగ్ నిర్మాణ యాజమానుల దగ్గర వసూల్ చేసుకొచ్చిన అవినీతి సోమ్మును పై అధికారులకు వారి వారి స్థాయిలను బట్టి ఎవరి ముల్లే వారికి అప్పజెబుతున్నట్లు తెలుస్తోంది. చందానగర్ సర్కిల్-21 లిమిట్స్ లో వీరి ఆగడాలకు అడ్డూ-అదుపులేని పరిస్థితి దాపురించింది. ఈ వ్యవహరాలపై పలుమార్లు పత్రికల్లో వార్తలు వచ్చినా..ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. అయితే వీరి లీలలను భరించలేని పబ్లిక్ మాత్రం మున్సిపల్ అధికారులపై దుమ్మెత్తిపోస్తున్నారు.

అక్రమ షెడ్డు నిర్మాణానికి జోనల్ అధికారి అండ
చందానగర్ సర్కిల్-21 మాదాపూర్ డివిజన్ లో హైటెక్ సిటీ వెళ్లే ప్రధాన రహదారిలో పాత కమర్షియల్ భవనంపై ఒక భారీ అక్రమ షెడ్డు నిర్మాణం జరుగుతోంది. అయితే ఈ షెడ్డు నిర్మాణానికి జోనల్ స్థాయిలోని ఓ ఉన్నతాధికారి అండదండలు పుష్కలంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు దాని పక్కనే ఓ పాత కమర్షియల్ భవనంపై మరిన్ని అంతస్తుల నిర్మాణం జరుగుతున్నా.. దానికి ఎలాంటి ఫైర్ సెఫ్టీ,పార్కింగ్ సౌకర్యం లేకున్నా..అవినీతి అధికారుల అండతో ఈ నిర్మాణం కూడా సాఫీగా సాగిపోతున్నట్లు సమాచారం. అయితే వీటిపై ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాలే కావొచ్చు చైన్ మెన్లు,సర్కిల్ పరిధిలోని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు అటు వైపు కూడా చూడకపోవడం గమనార్హం. ఇక చందానగర్ లో జరుగుతున్న ఈ అవినీతి దందాలు,ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్,చైన్ మెన్ల లీలలపై ప్రజా శ్రేయస్సు దృష్ట్యా పూర్తి ఆధారాలతో ఆదాబ్ లో మరో కథనం ద్వారా బహిర్గతం చేస్తామని వెల్లడిస్తున్నాం.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు